హైదరాబాద్: మౌలిక రంగ కంపెనీ జీఎంఆర్ గ్రూప్ కాకినాడ వద్ద ఎల్‌ఎన్‌జీ (లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్) టెర్మినల్ ఏర్పాటు యత్నాల్లో ఉంది. తొలుత 17.5 లక్షల టన్నుల వార్షిక సామర్థ్యంతో రానున్న ఈ ప్లాంటు రూ.471 కోట్లతో ఏర్పాటుకానున్నట్లు ఇటీవల జరిగిన పర్యావరణ శాఖ కమిటీ సమావేశపు మినిట్స్‌లో పేర్కొన్నారు. సామర్థ్యంలో 8.5 లక్షల టన్నుల గ్యాస్‌ను జీఎంఆర్ ఎనర్జీ సొంత అవసరాలకు వాడుకుంటుంది. మిగిలినది 450 కిలోమీటర్ల పరిధిలో పైపుల ద్వారా గృహావసరాలకు, ఇతర వినియోగదార్లకు సరఫరా చేస్తారు.