లాభాల స్వీకరణతో తగ్గుతున్న పసిడి
► వారం వారీగా 15 డాలర్ల డౌన్
► ఇది కొనుగోలుకు అవకాశమంటున్న నిపుణులు
బంగారం ధర భారీగా పెరగటంతో ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరిస్తున్నారు. ఈ ధోరణి 28వ తేదీ శుక్రవారంతో ముగిసిన వారంలో మరింత ఊపందుకుంది. అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్– నైమెక్స్‌లో బంగారం కాంట్రాక్ట్ ఔన్స్ (31.1గ్రా) ధర క్రితం వారం ముగింపుతో పోల్చిచూస్తే, మరో 15 డాలర్లకు తగ్గి 1,270 డాలర్లకు చేరింది.
45 రోజుల్లో దాదాపు 80 డాలర్లు పెరిగిన పసిడి, 21వ తేదీతో ముగిసిన వారంలో అంతక్రితం వారంతో పోల్చితే 4 డాలర్లు తగ్గి 1,285 డాలర్ల వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. సిరియా, ఉత్తరకొరియాలకు సంబంధించి యుద్ధ వాతావరణం కొంత శాంతించడం పసిడి నుంచి కొంత లాభాల స్వీకరణకు కారణంగా కనబడుతోందని విశ్లే షకుల అంచనా. వీటన్నింటికీ తోడు ఫ్రాన్స్‌లో యూరో అనుకూల ప్రభుత్వం ఏర్పడ్డం కూడా ఈక్విటీ మార్కెట్లకు ఊతం ఇవ్వగా, ఆ ప్రభావం పసిడిపై పడింది.
మున్ముందు దూకుడే!: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆర్థిక విధానాలకు సంబంధించి నెలకొన్న అస్పష్టత, డాలర్ బలహీనత వంటి అంశాలు పసిడి మున్ముందు కదలికలకు దోహదపడతాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత తగ్గుదల కొనుగోలుకు అవకాశం లాంటిదన్న వాదనలూ వినిపిస్తున్నాయి. వారం వారీగా డాలర్ ఇండెక్స్ 99.75 నుంచి 99.04కు పడింది. అంతక్రితం వారంలో ఇది 100.51 డాలర్లుగా ఉంది. డాలర్ బలహీనపడే విధానాలకే ట్రంప్ ప్రభుత్వం మొగ్గుచూపుతున్న సంగతి తెలిసిందే.
దేశీయంగానూ అదే ట్రెండ్..
అంతర్జాతీయ ప్రభావం దేశీ ఫ్యూచర్స్ మార్కెట్‌పైనా పడింది. ఎంసీఎక్స్‌లో బంగారం ధర 10 గ్రాములకు 28వ తేదీతో ముగిసిన వారంలో స్వల్పంగా రూ.545 తగ్గి రూ.28,873కి చేరింది. ఇక దేశీయంగా ప్రధాన ముంబై స్పాట్ మార్కెట్లో వారం వారీగా పసిడి ధర 99.9 స్వచ్ఛత 10 గ్రాములకు రూ.420 తగ్గి రూ.29,075కి చేరింది. మరోవైపు కేజీ వెండి వరుసగా రెండవ వారమూ తగ్గింది. రూ.1,415 నెమ్మదించి, రూ. 40,610కి చేరింది.