ట్రంప్ విధానాలతో పసిడి పరుగే?
• వరుసగా నాలుగో వారమూ లాభాలే!
• నడిపిస్తున్న డాలర్ బలహీనత ఊహాగానాలు
న్యూఢిల్లీ/న్యూయార్క్: అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాల అనిశ్చితి, 14 సంవత్సరాల గరిష్ట స్థాయి నుంచి డాలర్ తిరోగమనం, డాలర్ బలహీనతవైపు ట్రంప్ విధానాలు ఉంటాయన్న అంచనాల నడుమ పసిడి దూసుకెళుతోంది. డాలర్ బలహీనతకు తాను అనుకూలమని ట్రంప్ ఇప్పటికే ప్రకటించడం గమనార్హం. గత శుక్రవారం వరుసగా నాల్గవ వారమూ పసిడి లాభాల బాటలోనే నడిచింది. న్యూయార్క్ కమోడిటీ ఎక్సే్ఛంజ్‌లో పసిడి ఔన్స్ (31.1 గ్రా.) ధర జనవరి 13వ తేదీ శుక్రవారం 1,196 డాలర్ల వద్ద ముగిసిన పసిడి, 20వ తేదీతో ముగిసిన వారంలో 1,210 డాలర్లకు చేరింది.
ఇది ఏడు వారాల గరిష్టస్థాయి. ఇకపైన కూడా అమెరికా ఆర్థిక వ్యవస్థకు సంబంధించి సానుకూల, ప్రతికూల వార్తలు డాలర్ లాభనష్టాలపై ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. ట్రంప్ అనుసరించబోయే విధానాలపై అస్పష్టత నేపథ్యంలో పసిడి స్వల్పకాలంలో లాభాలవైపే పయనిస్తుందన్న అంచనాలున్నాయి. అమెరికా ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు, అస్పష్ట ప్రకటనల నేపథ్యంలో పెట్టుబడులకు సురక్షితమైన మెటల్‌గా స్వల్పకాలంలో పసిడి కొనసాగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. బంగారానికి 1,170 డాలర్ల వద్ద మద్దతు ఉందని, 1,241 డాలర్ల వద్ద తొలి నిరోధం ఉండొచ్చనే సంకేతాలున్నాయి.
దేశీయంగానూ మెరుపే!
అంతర్జాతీయ తరహాలోనే దేశీయంగానూ పసిడి ధోరణి కొనసాగుతోంది. ముంబై ప్రధాన స్పాట్ మార్కెట్‌లో శుక్రవారంనాటికి వారం వారీగా పసిడి ధర 99.9 ప్యూరిటీ 10 గ్రాములు రూ.160 పెరిగి రూ.29,200 వద్ద ముగిసింది. 99.5 ప్యూరిటీ ధర కూడా అదే స్థాయిలో ఎగసి రూ.29,050 వద్ద ముగిసింది. దీనితో గడచిన మూడు వారాల్లో పసిడి ధర దాదాపు రూ.1,300 ఎగసింది. ఇక వెండి విషయానికి వస్తే, కేజీ ధర రూ.239 పెరిగి రూ.41,485కి చేరింది. వెండి రెండు వారాల్లో దాదాపు రూ.1,500 పెరిగింది. దేశీయంగా డిమాండ్ బలహీనంగా ఉన్నా... అంతర్జాతీయ ధోరణి వల్ల పసిడి ఇంకా పెరుగుతుందన్నది కొందరి అంచనా.