
బంగారం ధరలు ఇంకా దిగి వస్తాయా?
చికాగో: న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సేంజ్ ఫ్యూచర్స్ మార్కెట్ లో బంగారం వరుసగా మూడో రోజు కూడా నీరసపడింది. మంగళవారం షిన్హువా న్యూ స్ ఏజెన్సీ జారీ చేసిన అంచనాల ప్రకారం పసిడి ధర మరింత దిగి వచ్చే అవకాశం ఉంది. ఫెడరల్ రిజర్వ్ ఈ సంవత్సరంలో వడ్డీ రేట్లను పెంచనుందనే వార్తల నేపథ్యలో బంగారానికి డిమాండ్ తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది. సెప్టెంబర్ నెలలో పసిడి ధరలు మరింత దిగి రావడం, వరుసగా మూడు ట్రేడింగ్ సెషన్స్ లో బంగారం ధరల పతనం వినియోగాదారుల్లో ఆశలు రేకెత్తిస్తోంది.
శుక్రవారం విడుదల చేసిన ఎంప్లాయిమెంట్ రిపోర్టు ప్రకారం ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు కచ్చితంగా పెరిగే అవకాశం ఉందని కొంతమంది ఎనలిస్టులంటున్నారు. ఇది బంగారం ధరల్లో క్షీణతకు దారి తీస్తుందని అంచనా వేస్తున్నారు. వడ్డీ రేట్ల పెంపుతో డాలర్ విలువ మరింత పెరుగుతుందని, ఈ క్రమంలో బంగారం ధరలు దిగొస్తాయని వారంటున్నారు. సాధారణంగా డాలర్, బంగారం ధరల సూచీలు వ్యతిరేక దిశలో ఉంటాయి కనుక ధరలు దిగా రావడం ఖాయమంటున్నారు.
అయితే మరికొంతమంది ఎనలిస్టులు, నిపుణులు, వినియోగదారుల అంచనాలు దీనికి భిన్నంగా ఉన్నాయి. ఎఫ్ డీ వడ్డీరేట్లను పెంచే అవకాశం లేదని వాదిస్తున్నారు. మెటల్ సెక్టార్ లోని సంక్షోభం బంగారం ధర పతనానికి దోహదం అయ్యిందంటున్నారు. ఇది తాత్కాలికమైన పతనమేనని అంచనావేస్తున్నారు.
కాగా సెప్టెంబర్ నెల మధ్యలో 10 గ్రాముల బంగారం ధర 27 వేల మార్కును దాటినా, అక్కడ నిలదొక్కుకోవడంలో విఫలమయింది. దీంతో బంగారానికి తరువాతి మద్దుతు స్థాయి పాతికవేల దగ్గర ఉందని ఎనలిస్టుల అంచనా. ఆ స్థాయిలో నిలదొక్కుకోవడంలో విఫలమైతే పసిడి విలువ మరింత దిగి వస్తుందని వారు భావిస్తున్నారు. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచనుందనే అంచనాల నేపథ్యంలో పసిడి ధరల పతనంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింత దిగి రానున్నాయనే అంచనాలతో వినియోగదారులు, మహిళలు ధరలను ఆసక్తిగా గమనిస్తున్నారు.