రూ. 30,000 దాటిన బంగారం
రెండేళ్ల గరిష్టంలో ధరలు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ట్రెండ్‌ను అనుసరిస్తూ మన దేశంలో పసిడి ధరలు పైకి ఎగిసాయి. దేశ రాజధానిలో పసిడి ధర (10 గ్రాములు) చూస్తుండగానే శుక్రవారం రూ.30,000 మార్క్‌ను అధిగమించింది. ఇది రెండేళ్ల గరిష్ట స్థాయి. బ్యాంక్ ఆఫ్ జపాన్ వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించడం, అమెరికా ఫెడ్ కూడా వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగించడం, డాలర్ విలువ పది నెలల కనిష్టానికి చేరడం తదితర కారణాల వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో పుత్తడి ధరలు పెరిగాయి. దీనికి తోడు దేశంలో జువెలర్స్ నుంచి డిమాండ్ పెరగడం కూడా ఇక్కడి పసిడి ధరల పెరుగుదల ఒక కారణ మయ్యాయి.
ప్రపంచ మార్కెట్‌లో కడపటి సమాచారంమేరకు పసిడి ధర ఔన్స్‌కు 1,295 డాలర్లకు పెరిగింది. వెండి ధర 1.7 శాతం పెరుగుదలతో 17.84 డాలర్లకు చేరింది. వెండికి గతేడాది జనవరి నుంచి చూస్తే ఇదే గరిష్ట స్థాయి. దేశ రాజధానిలో 10 గ్రాముల 99.9%, 99.5 శాతం స్వచ్ఛతగల బంగారం ధరలు రూ.350 పెరుగుదలతో వరుసగా రూ.30,250కు, రూ.30,100కు చేరాయి. 2014, మే 13 నుంచి చూస్తే ఇదే గరిష్ట స్థాయి. అలాగే పరిశ్రమలు సహా నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడంతో వెండి ధర (కిలో) కూడా రూ.600 పెరుగుదలతో రూ.41,600కు ఎగసింది.