Bank of Japan
-
22,000 దిగువకు నిఫ్టీ
ముంబై: బ్యాంక్ ఆఫ్ జపాన్ కీలక వడ్డీ రేట్లను 17 ఏళ్ల తర్వాత పెంచడంతో ద్రవ్యోల్బణ భయాలు భారత్ ఈక్విటీ మార్కెట్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఫెడరల్ రిజర్వ్ ద్రవ పాలసీ నిర్ణయాల వెల్లడి(నేడు)కి ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. బ్రెండ్ క్రూడాయిల్ బ్యారెల్ ఫ్యూచర్స్ ధర అయిదు నెలల గరిష్టం 85 డాలర్లపైకి ఎగిసింది. జపాన్ వడ్డీ రేట్ల పెంపుతో డాలర్ ఇండెక్స్ బలపడింది. ఈ పరిణామాలతో మంగళవారం సెన్సెక్స్ 736 పాయింట్లు నష్టపోయి 72,012 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 238 పాయింట్లు పతనమై 22,000 స్థాయిని కోల్పోయి 21,817 వద్ద నిలిచింది. ముగింపు స్థాయిలు ఇరు సూచీలకు నెల కనిష్టం. ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న దేశీయ మార్కెట్ ఉదయం బలహీనంగా మొదలైంది. అన్ని రంగాల షేర్లూ అమ్మకాల ఒత్తిడికి లోనడంతో సూచీలు ట్రేడింగ్ ఆద్యంతం నష్టాల్లోనే ట్రేడయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్ 815 పా యింట్లు క్షీణించి 72,000 స్థాయి దిగువున 71,933 వద్ద, నిఫ్టీ 263 పాయింట్లు నష్టపోయి 21,793 వద్ద ఇంట్రాడే కనిష్టాలను చూశాయి. చిన్న, మధ్య తరహా షేర్లలో విక్రయాలు కొనసాగాయి. జపాన్ ఎకానమీకి జోష్! ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ జపాన్ పురోగమన బాటన పడుతున్నట్లు కనిపిస్తోంది. 17 సంవత్సరాల నెగటివ్ రుణ రేటు వ్యవస్థకు 4.2 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ ముగింపు పలికింది. బ్యాంకులకు బ్యాంక్ ఆఫ్ జపాన్ ఇచ్చే ఓవర్‌నైట్ రుణ రేటు మైనస్ 0.1 శాతం నుంచి ప్లస్ 0–0.1 శాతం శ్రేణికి పెరిగింది. రూ. 4.86 లక్షల కోట్లు ఆవిరి సెన్సెక్స్ ఒక శాతానికి పైగా నష్టపోవడంతో బీఎస్ఈలో రూ.4.86 లక్షల కోట్లు ఆవిరయ్యాయి. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.373 లక్షల కోట్లకు దిగివచ్చింది. ఈ సూచీలో 30 షేర్లకు గానూ ఏడు మాత్రమే లాభపడ్డాయి. టీసీఎస్ నిరాశ.. టీసీఎస్ షేరు రెండేళ్లలో అతిపెద్ద పతనాన్ని చవిచూసింది. ప్రమోటర్ సంస్థ టాటా సన్స్ బ్లాక్ డీల్ ద్వారా 2.3 కోట్ల ఈక్విటీ షేర్ల విక్రయంతో ఈ షేరు అమ్మకాల ఒత్తిడికి లోనైంది. ట్రేడింగ్‌లో నాలుగున్నర శాతం క్షీణించి రూ. 3,967 వద్ద రెండేళ్ల కనిష్టాన్ని తాకింది. చివరికి 4% నష్టంతో రూ.3,978 వద్ద ముగిసింది. పాపులర్ వెహికల్స్ పేలవం పాపులర్ వెహికల్స్ అండ్ సర్విసెస్ లిస్టింగ్ మెప్పించలేకపోయింది. ఇష్యూ ధర(రూ.295)తో పోలిస్తే బీఎస్ఈలో 1% డిస్కౌంట్‌తో రూ.292 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్‌లో 11% క్షీణించి రూ.263 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరికి 6% నష్టంతో రూ.276 వద్ద ముగిసింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,967 కోట్లుగా నమోదైంది. -
జపాన్‌తో కరెన్సీ మార్పిడి ఒప్పందం
న్యూఢిల్లీ: జపాన్, భారత్ మధ్య మరో కీలక ఒప్పందానికి వీలుగా కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కరెన్సీ విలువల్లో అస్థిరతలకు చెక్ పెట్టేందుకు గాను జపాన్‌తో 75 బిలియన్ డాలర్ల మేర ద్వైపాక్షిక స్వాప్ ఏర్పాటు ప్రతిపాదనకు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ భేటీ ఆమోదం తెలిపింది. రెండు దేశాల మధ్య గరిష్టంగా 75 బిలియన్ డాలర్ల విలువ మేర ద్వైపాక్షిక స్వాప్ ఏర్పాటుకు గాను... బ్యాంక్ ఆఫ్ జపాన్‌తో ఆర్బీఐ ఒప్పందం చేసుకునేందుకు కేంద్రం అధికారం కల్పించినట్టు అవుతుంది. ‘‘స్వాప్ ఏర్పాటు అన్నది భారత్, జపాన్ మధ్య గరిష్టంగా 75 బిలియన్ డాలర్ల విలువ మేర దేశీ కరెన్సీ మార్పిడి కోసం. విదేశీ మారకంలో స్వల్పకాల లోటును అధిగమించేందుకు, తగినంత బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్‌ను కొనసాగించేందుకు ఉపయోగపడుతుంది. ద్వైపాక్షిక స్వాప్ ఏర్పాటు క్లిష్ట సమయాల్లో పరస్పరం సహకరించుకుకోవాలన్న భారత్, జపాన్ వ్యూహాత్మక లక్ష్యానికి చక్కని ఉదాహరణ’’ అని కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఈ డీల్‌తో కరెన్సీ పరంగా స్థిరత్వం ఏర్పడి, భారత కంపెనీలు విదేశీ నిధులను సులభంగా పొందే అవకాశాలు మెరుగుపడతాయి. ఫ్రాన్స్‌తో మరో ఒప్పందం నూతన, పునరుత్పాదక ఇంధన రంగంలో భారత్, ఫ్రాన్స్ మధ్య సాంకేతిక సహకారం పెంపొందించే ఒప్పందానికి కూడా కేబినెట్ ఆమోదముద్ర వేసింది. అక్టోబర్ 3న ఇందుకు సంబంధించిన అవగాహన ఒప్పందం జరగ్గా దీనికి కేబినెట్ తాజాగా ఆమోదం తెలిపింది. పరస్పర ప్రయోజనం, సమానత్వం కోసం ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సాంకేతిక సహకారాన్ని పెంపొందించుకోవాలన్నది ఒప్పందం లక్ష్యం. -
బ్యాంక్ ఆఫ్ జపాన్ కీలక నిర్ణయం
బ్యాంక్ ఆఫ్ జపాన్ కీలక నిర్ణయం తీసుకుంది. రెండు రోజుల ద్రవ్య విధానం సమావేశం ముగిసిన అనంతరం మార్కెట్ అంచనాలను అనుగుణంగానే తన పాలసీ విధానాన్ని వెల్లడించింది. తమ వడ్డీ రేట్లను ఎలంటి మార్పులలేకుండా యధాతథంగా ఉంచినట్టు సెంట్రల్ బ్యాంకు తెలిపింది బ్యాంక్ ఆఫ్ జపాన్ మంగళవారం మానిటరీపాలసీ విధానాన్ని ప్రకటించింది. రెండు రోజుల సమావేశం ముగిసిన తరువాత విడుదలైన ఒక ప్రకటనలో డిపాజిట్ రేట్లను -0.1శాతం వద్ద 10 సంవత్సరాల లక్ష్యాన్ని జీరో శాతంగాను నిర్ణయించినట్టు పేర్కొంది. ఈ నెలలోనే దీర్ఘకాల ప్రభుత్వ బాండ్ల కొనుగోళ్లను స్వల్పంగా తగ్గించింది. కాగా ఆర్థిక వ్యవస్థ స్థిరీకరణకు ప్రపంచ కేంద్ర బ్యాంకుల అడుగుజాడలను అనుసరిస్తుందనే ఊహాగానాలొచ్చాయి. దీనికి అనుగుణంగానే బీఓజే తన పాలసీ విధానాన్ని వెల్లడించింది. వినియోగదారుల ధర సూచిక నవంబరులో సంవత్సరం ప్రాతిపదికన 0.9 శాతం పెరిగింది, వరుసగా 11 వ నెల పెరుగుదల నమోదయింది. కాగా మెట్రిక్ ఒక రాయిటర్స్ పోల్ ప్రకారం, డిసెంబర్ లో అదే స్థాయి పెరుగుతుందని అంచనా. డిసెంబర్ డేటా ఈ శుక్రవారం విడుదల కానుంది. అయితే ఆహార, ఇంధనం ధరలను మినహాయించిన వినియోగదారుల ధరలు నవంబర్‌లో కేవలం 0.3 శాతం పెరిగాయి. -
బీఓజే వడ్డీరేట్లు యధాతథం
టోక్యో: బ్యాంక్ ఆఫ్ జపాన్ మానిటరీ పాలసీలో తటస్థ వైఖరినే అవలంబించింది. శుక్రవారం చేపట్టిలో పాలసీ రివ్యూలో ఎలాంటి మార్పులు చేపట్టలేదు. ద్రవ్యోల్బణాన్ని పెంచే లక్ష్యంతో, జపాన్ బ్యాంకు శుక్రవారం విధాన మార్పులను కొనసాగించలేదు. ద్రవ్యోల్బణాన్ని ఎత్తివేసే లక్ష్యంతో ద్రవ్య ఉద్దీపన కొనసాగించింది. చాలామంది ఆర్థికవేత్తలు ఊహించినట్టుగానే జపనీస్ ప్రభుత్వ బాండ్ దిగుబడి లక్ష్యంతో 10 సం.రాల బాండ్ రేటు జీరోశాతం వద్ద, స్వల్పకాలిక బాండ్లను 0.1శాతంగాను నిర్ణయించింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఆరునెలల్లో మూడు సార్లు వడ్డీరేట్లు పెంచిన అనంతరం జపాన్ సెంట్రల్ బ్యాంక్ అల్ట్రా-ఈజీ వైఖరిని తీసుకుంది. -
రూ. 30,000 దాటిన బంగారం
రెండేళ్ల గరిష్టంలో ధరలు న్యూఢిల్లీ: అంతర్జాతీయ ట్రెండ్‌ను అనుసరిస్తూ మన దేశంలో పసిడి ధరలు పైకి ఎగిసాయి. దేశ రాజధానిలో పసిడి ధర (10 గ్రాములు) చూస్తుండగానే శుక్రవారం రూ.30,000 మార్క్‌ను అధిగమించింది. ఇది రెండేళ్ల గరిష్ట స్థాయి. బ్యాంక్ ఆఫ్ జపాన్ వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించడం, అమెరికా ఫెడ్ కూడా వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగించడం, డాలర్ విలువ పది నెలల కనిష్టానికి చేరడం తదితర కారణాల వల్ల అంతర్జాతీయ మార్కెట్లో పుత్తడి ధరలు పెరిగాయి. దీనికి తోడు దేశంలో జువెలర్స్ నుంచి డిమాండ్ పెరగడం కూడా ఇక్కడి పసిడి ధరల పెరుగుదల ఒక కారణ మయ్యాయి. ప్రపంచ మార్కెట్లో కడపటి సమాచారంమేరకు పసిడి ధర ఔన్స్‌కు 1,295 డాలర్లకు పెరిగింది. వెండి ధర 1.7 శాతం పెరుగుదలతో 17.84 డాలర్లకు చేరింది. వెండికి గతేడాది జనవరి నుంచి చూస్తే ఇదే గరిష్ట స్థాయి. దేశ రాజధానిలో 10 గ్రాముల 99.9%, 99.5 శాతం స్వచ్ఛతగల బంగారం ధరలు రూ.350 పెరుగుదలతో వరుసగా రూ.30,250కు, రూ.30,100కు చేరాయి. 2014, మే 13 నుంచి చూస్తే ఇదే గరిష్ట స్థాయి. అలాగే పరిశ్రమలు సహా నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడంతో వెండి ధర (కిలో) కూడా రూ.600 పెరుగుదలతో రూ.41,600కు ఎగసింది. -
మార్కెట్ కు జపాన్ షాక్..
♦ ఉద్దీపన లేదన్న బ్యాంక్ ఆఫ్ జపాన్ ప్రకటనతో ఇన్వెస్టర్ల నిరుత్సాహం ♦ డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపుతో అమ్మకాల ఒత్తిడి ♦ సెన్సెక్స్ 461 పాయింట్లు డౌన్ 133 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ ముంబై: ప్రతికూల అంశాల ప్రభావంతో మార్కెట్ మూడు వారాల్లో అతిపెద్ద పతనాన్ని చవిచూసింది. ముందస్తు అంచనాలకు భిన్నంగా బ్యాంక్ ఆఫ్ జపాన్ ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించకపోవడంతో నిరుత్సాహానికి లోనైన ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లో భారీ అమ్మకాలు జరిపారు. ఏప్రిల్ డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపునకు గురువారం చివరిరోజుకావడం కూడా మార్కెట్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. దాంతో బీఎస్ఈ సెన్సెక్స్ 461 పాయింట్లు పతనమై 25,603 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 133 పాయింట్లు క్షీణించి 7,847 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఏప్రిల్ 5 తర్వాత సూచీలు ఇంతభారీగా పడిపోవడం ఇదే ప్రథమం. క్షీణతకు పలు కారణాలు... బ్యాంక్ ఆఫ్ జపాన్ వడ్డీ రేట్లను యథాతథంగా అట్టిపెట్టడంతో పాటు ఆర్థిక వ్యవస్థకు ఎటువంటి ఉద్దీపననూ ప్రకటించలేదు. అలాగే క్రితం రాత్రి అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ పాలసీ రేట్లను పెంచనప్పటికీ, ఆర్థిక వ్యవస్థ పట్ల విశ్వాసాన్ని వ్యక్తంచేసింది. దాంతో జూన్ సమావేశంలో ఫెడ్ వడ్డీ రేట్లు పెంచవచ్చన్న అంచనాలు తాజాగా ఏర్పడ్డాయి. ఈ రెండు అంశాలు ప్రపంచ స్టాక్ మార్కెట్లపై ఒత్తిడి పెంచాయని, ఏప్రిల్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్టుల ముగింపు కారణంగా భారత్ మార్కెట్, మిగతా దేశాలతో పోలిస్తే ఎక్కువ క్షీణించిందని విశ్లేషకులు చెప్పారు. ఎఫ్ అండ్ ఓ విభాగంలో ఇన్వెస్టర్లు వారి లాంగ్ పొజిషన్లను మే నెల డెరివేటివ్ సిరీస్‌కు రోలోవర్ చేసేబదులు, వాటిని ఆఫ్‌లోడ్ చేసేందుకు మొగ్గుచూపారని స్టాక్ బ్రోకర్లు తెలిపారు. మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, ఎఫ్ఎంసీజీ, ఇన్ఫ్రా, ఆటో రంగాలకు చెందిన షేర్లలో అమ్మకాలు జరిగినట్లు వారు వివరించారు. హెవీవెయిట్స్‌లో అమ్మకాలు... హెవీవెయిట్ షేర్లలో అమ్మకాల నేపథ్యంలో సెన్సెక్స్‌లో అన్నింటికంటే అధికంగా హెచ్డీఎఫ్సీ 3.21 శాతం క్షీణించింది. ఐటీసీ 3 శాతం, మహీంద్రా 2.99 శాతం, మారుతీ సుజుకి 2.94 శాతం, గెయిల్ 2.52 శాతం, టాటా స్టీల్ 2.5 శాతం, ఎన్టీపీసీ 2.45 శాతం చొప్పున తగ్గాయి. బుధవారం ఆర్థిక ఫలితాలు ప్రకటించిన భారతీ ఎయిర్టెల్ షేరు రోజులో చాలాభాగం లాభాలతో ట్రేడయినా, ముగింపు సమయంలో లాభాల స్వీకరణ కారణంగా 0.23 శాతం తగ్గి ముగిసింది. హిందుస్తాన్ యూనిలీవర్, బజాజ్ ఆటో, బీహెచ్ఈఎల్, ఇన్ఫోసిస్, ఆదాని పోర్ట్స్, ఎస్బీఐ, రిలయన్స్ ఇండస్ట్రీస్, సిప్లా, ఓఎన్జీసీ, హీరో మోటోకార్ప్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా మోటార్స్, కోల్ ఇండియాలు కూడా నష్టాలతో ముగిశాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు తిరిగి రూ. 1000 లోపునకు తగ్గింది. 7 వారాల కనిష్టస్థాయి రూ. 996 వద్దకు పడిపోయింది. వివిధ రంగాల సూచీల్లో అన్నింటికంటే ఎక్కువగా బీఎస్ఈ ఆయిల్ అండ్ గ్యాస్ సూచి 2.18 శాతం నష్టపోగా, మెటల్, పవర్, ఆటో సూచీలు 2 శాతం చొప్పున తగ్గాయి. 3.6 శాతం పతనమైన జపాన్ మార్కెట్... జపాన్ కేంద్ర బ్యాంక్ షాకివ్వడంతో ఆ దేశపు నికాయ్ సూచీ 3.61% పతనమయ్యింది. ఆసియాలో తైవాన్ సూచి 1%పైగా క్షీణించింది. చైనా షాంఘై ఇండెక్స్ 0.27% తగ్గింది. సింగపూర్, దక్షిణ కొరియా ఇండెక్స్‌లు కూడా స్వల్పంగా తగ్గాయి. యూరప్‌లోని ప్రధాన మార్కెట్లైన జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్ సూచీలు ఆరంభంలో నష్టాల్లో ఉన్నా.. చివర్లో కోలుకున్నాయి. -
‘రోడ్డు’న పడిన పనులు
* జపాన్ బ్యాంకు నిధులిస్తే.. కేంద్రం మోకాలడ్డు * ‘యెన్’ మారకంతో అదనంగా వచ్చిపడ్డ నిధులు * రూపాయి పతనంతో ఆగిన ఔటర్ రోడ్డు పనులు సాక్షి, హైదరాబాద్: దేశంలో మరెక్కడా లేనట్టుగా 8 లేన్ల ఎక్స్‌ప్రెస్ కారిడార్‌గా హైదరాబాద్ చుట్టూ ఔటర్‌రింగ్‌రోడ్డు నిర్మిస్తున్న విషయం తెలిసిందే.. దీన్ని హెచ్ఎండీఏ (హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ) పర్యవేక్షిస్తోంది. ఇన్నర్‌రింగ్ రోడ్డుతో ఔటర్ రింగు రోడ్డును అనుసంధానిస్తూ గతంలో 33 రేడియల్ రోడ్లకు ప్రణాళికలు రూపొందించారు. ఇందులో ఇప్పటి వరకు 12 రోడ్లను హెచ్ఎండీఏ పూర్తి చేసింది. మరో 5 రోడ్లు నిర్మాణంలో ఉన్నాయి. ఈ దశలో నిధుల కొరత ఏర్పడింది. దీంతో ప్రాజెక్టు పనులను రోడ్లు భవనాల శాఖకు అప్పగించారు. కానీ, ఇక్కడా నిధుల సమస్య ఏర్పడడంతో పనులన్నీ పడకేశాయి. ఆలస్యం... అ‘ధనం’: వాస్తవానికి జపాన్‌కు చెందిన జైకా (జపాన్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ ఏజెన్సీ) ఆర్థిక సాయంతో ఔటర్ రింగురోడ్డు పనులు జరుగుతున్నాయి. 2008 లో జైకాతో రాష్ట్ర ప్రభుత్వం రెండు లోన్ అగ్రిమెంట్లు కుదుర్చుకున్నాయి. వాటి విలువ రూ.3,123 కోట్లు. ఈ మొత్తాన్ని జపాన్ బ్యాంకు తమ దేశ కరెన్సీ యెన్ల రూపంలోనే అందిస్తుంది. కానీ, పనుల్లో జాప్యం, అంతర్జాతీయంగా రూపాయి విలువ పతనం కావడంతో యెన్ రూపంలో అందించే మొత్తం మన రూపాయిలోకి మార్పిడి చేయటంతో ఆ మొత్తం భారీగా పెరిగింది. అలా దాదాపు రూ.1,400 కోట్ల నిధులు పెరిగాయి. దీంతో ఈ రేడియల్ రోడ్లను పూర్తి చేయాలని అధికారులు ఆశించారు. కానీ, దీనికి కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ అడ్డు చెప్పింది. జైకా రుణాన్ని తిరిగి చెల్లించేటప్పుడు యెన్ల రూపంలో చెల్లించాలని, అప్పుడు మన రూపాయి రూపంలో ఎక్కువ మొత్తం చెల్లించాల్సి ఉంటున్నందున ఈ అదనపు మొత్తాన్ని ఖర్చు చేయటానికి వీలులేదని షరతులు విధించింది. దీంతో నిధులు కొరత ఏర్పడి పనులు పడకేశాయి. కానీ, ఇటీవల సీఎం కేసీఆర్ వాటిని ఆర్‌అండ్‌బీకి బదలాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఆర్‌అండ్‌బీకి దాదాపు రూ.10,650 కోట్ల విలువైన రోడ్డు నిర్మాణ పనులను ప్రభుత్వం మంజూరు చేసింది. రేడియల్ రోడ్లను హెచ్ఎండీఏ నుంచి ఆర్‌అండ్‌బీకి కేటాయించిన ప్రభుత్వం అదనంగా నయా పైసా ఇవ్వలేదు. దీంతో వాటిని ఎలా చేపట్టాలో అర్ధం కాక ఆర్అండ్బీ తలపట్టుకుంటుంది. మొత్తం 16 పనులకు గాను తొమ్మిదింటికి డీపీఆర్‌లు సిద్ధం చేసుకుంది. కానీ భూసేకరణ జరిపితే కానీ పనులు చేయడానికి వీలు లేదు. భూసేకరణకు రూ.500 కోట్లు అవసరం. అంత డబ్బు తన వద్ద లేదని ఆర్అండ్బీ అంటోంది. ఎలాగూ రోడ్లను ఆర్‌అండ్‌బీకి అప్పగించామన్న ఉద్దేశంతో భూసేకరణ తంతును హెచ్ఎండీఏ పట్టించుకోవటం లేదు. భూసేకరణ ఎవరు జరపాలి, అందుకు నిధులెవరిస్తారో ప్రభుత్వం తేల్చలేదు. దేవుడు వరమిచ్చినా.. పూజారి అడ్డుకున్నట్లు ఉంది హైదరాబాద్ ఔటర్‌రింగ్‌రోడ్డు పనుల పరిస్థితి... జపాన్ సంస్థ నిధులిచ్చి రోడ్డు నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ ఇస్తే... కేంద్రం మాత్రం పైసా సాయం చేయకుండా ఎర్రజెండాతో పనులకు మోకాలొడ్డింది. రూపాయి విలువ పడిపోవడంతో అదనంగా 1,400 కోట్లు అప్పనంగా వచ్చిపడ్డా పనులు మొదలు పెట్టలేని పరిస్థితి నెలకొంది.