‘రోడ్డు’న పడిన పనులు
* జపాన్ బ్యాంకు నిధులిస్తే.. కేంద్రం మోకాలడ్డు
* ‘యెన్’ మారకంతో అదనంగా వచ్చిపడ్డ నిధులు
* రూపాయి పతనంతో ఆగిన ఔటర్ రోడ్డు పనులు
సాక్షి, హైదరాబాద్: దేశంలో మరెక్కడా లేనట్టుగా 8 లేన్ల ఎక్స్‌ప్రెస్ కారిడార్‌గా హైదరాబాద్ చుట్టూ ఔటర్‌రింగ్‌రోడ్డు నిర్మిస్తున్న విషయం తెలిసిందే.. దీన్ని హెచ్‌ఎండీఏ (హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ) పర్యవేక్షిస్తోంది. ఇన్నర్‌రింగ్ రోడ్డుతో ఔటర్ రింగు రోడ్డును అనుసంధానిస్తూ గతంలో 33 రేడియల్ రోడ్లకు ప్రణాళికలు రూపొందించారు. ఇందులో ఇప్పటి వరకు 12 రోడ్లను హెచ్‌ఎండీఏ పూర్తి చేసింది.
మరో 5 రోడ్లు నిర్మాణంలో ఉన్నాయి. ఈ దశలో నిధుల కొరత ఏర్పడింది. దీంతో ప్రాజెక్టు పనులను రోడ్లు భవనాల శాఖకు అప్పగించారు. కానీ, ఇక్కడా నిధుల సమస్య ఏర్పడడంతో పనులన్నీ పడకేశాయి.
ఆలస్యం... అ‘ధనం’: వాస్తవానికి జపాన్‌కు చెందిన జైకా (జపాన్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ ఏజెన్సీ) ఆర్థిక సాయంతో ఔటర్ రింగురోడ్డు పనులు జరుగుతున్నాయి. 2008 లో జైకాతో రాష్ట్ర ప్రభుత్వం రెండు లోన్ అగ్రిమెంట్లు కుదుర్చుకున్నాయి. వాటి విలువ రూ.3,123 కోట్లు. ఈ మొత్తాన్ని జపాన్ బ్యాంకు తమ దేశ కరెన్సీ యెన్‌ల రూపంలోనే అందిస్తుంది. కానీ, పనుల్లో జాప్యం, అంతర్జాతీయంగా రూపాయి విలువ పతనం కావడంతో యెన్ రూపంలో అందించే మొత్తం మన రూపాయిలోకి మార్పిడి చేయటంతో ఆ మొత్తం భారీగా పెరిగింది.
అలా దాదాపు రూ.1,400 కోట్ల నిధులు పెరిగాయి. దీంతో ఈ రేడియల్ రోడ్లను పూర్తి చేయాలని అధికారులు ఆశించారు. కానీ, దీనికి కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ అడ్డు చెప్పింది. జైకా రుణాన్ని తిరిగి చెల్లించేటప్పుడు యెన్‌ల రూపంలో చెల్లించాలని, అప్పుడు మన రూపాయి రూపంలో ఎక్కువ మొత్తం చెల్లించాల్సి ఉంటున్నందున ఈ అదనపు మొత్తాన్ని ఖర్చు చేయటానికి వీలులేదని షరతులు విధించింది. దీంతో నిధులు కొరత ఏర్పడి పనులు పడకేశాయి. కానీ, ఇటీవల సీఎం కేసీఆర్ వాటిని ఆర్‌అండ్‌బీకి బదలాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ప్రస్తుతం ఆర్‌అండ్‌బీకి దాదాపు రూ.10,650 కోట్ల విలువైన రోడ్డు నిర్మాణ పనులను ప్రభుత్వం మంజూరు చేసింది. రేడియల్ రోడ్లను హెచ్‌ఎండీఏ నుంచి ఆర్‌అండ్‌బీకి కేటాయించిన ప్రభుత్వం అదనంగా నయా పైసా ఇవ్వలేదు. దీంతో వాటిని ఎలా చేపట్టాలో అర్ధం కాక ఆర్‌అండ్‌బీ తలపట్టుకుంటుంది. మొత్తం 16 పనులకు గాను తొమ్మిదింటికి డీపీఆర్‌లు సిద్ధం చేసుకుంది. కానీ భూసేకరణ జరిపితే కానీ పనులు చేయడానికి వీలు లేదు. భూసేకరణకు రూ.500 కోట్లు అవసరం. అంత డబ్బు తన వద్ద లేదని ఆర్‌అండ్‌బీ అంటోంది. ఎలాగూ రోడ్లను ఆర్‌అండ్‌బీకి అప్పగించామన్న ఉద్దేశంతో భూసేకరణ తంతును హెచ్‌ఎండీఏ పట్టించుకోవటం లేదు. భూసేకరణ ఎవరు జరపాలి, అందుకు నిధులెవరిస్తారో ప్రభుత్వం తేల్చలేదు.
దేవుడు వరమిచ్చినా.. పూజారి అడ్డుకున్నట్లు ఉంది హైదరాబాద్ ఔటర్‌రింగ్‌రోడ్డు పనుల పరిస్థితి... జపాన్ సంస్థ నిధులిచ్చి రోడ్డు నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ ఇస్తే... కేంద్రం మాత్రం పైసా సాయం చేయకుండా ఎర్రజెండాతో పనులకు మోకాలొడ్డింది. రూపాయి విలువ పడిపోవడంతో అదనంగా 1,400 కోట్లు అప్పనంగా వచ్చిపడ్డా పనులు మొదలు పెట్టలేని పరిస్థితి నెలకొంది.