న్యూఢిల్లీ: జపాన్, భారత్ మధ్య మరో కీలక ఒప్పందానికి వీలుగా కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కరెన్సీ విలువల్లో అస్థిరతలకు చెక్ పెట్టేందుకు గాను జపాన్‌తో 75 బిలియన్ డాలర్ల మేర ద్వైపాక్షిక స్వాప్ ఏర్పాటు ప్రతిపాదనకు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ భేటీ ఆమోదం తెలిపింది. రెండు దేశాల మధ్య గరిష్టంగా 75 బిలియన్ డాలర్ల విలువ మేర ద్వైపాక్షిక స్వాప్ ఏర్పాటుకు గాను... బ్యాంక్ ఆఫ్ జపాన్‌తో ఆర్‌బీఐ ఒప్పందం చేసుకునేందుకు కేంద్రం అధికారం కల్పించినట్టు అవుతుంది.
‘‘స్వాప్ ఏర్పాటు అన్నది భారత్, జపాన్ మధ్య గరిష్టంగా 75 బిలియన్ డాలర్ల విలువ మేర దేశీ కరెన్సీ మార్పిడి కోసం. విదేశీ మారకంలో స్వల్పకాల లోటును అధిగమించేందుకు, తగినంత బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్‌ను కొనసాగించేందుకు ఉపయోగపడుతుంది. ద్వైపాక్షిక స్వాప్ ఏర్పాటు క్లిష్ట సమయాల్లో పరస్పరం సహకరించుకుకోవాలన్న భారత్, జపాన్ వ్యూహాత్మక లక్ష్యానికి చక్కని ఉదాహరణ’’ అని కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఈ డీల్‌తో కరెన్సీ పరంగా స్థిరత్వం ఏర్పడి, భారత కంపెనీలు విదేశీ నిధులను సులభంగా పొందే అవకాశాలు మెరుగుపడతాయి.
ఫ్రాన్స్‌తో మరో ఒప్పందం
నూతన, పునరుత్పాదక ఇంధన రంగంలో భారత్, ఫ్రాన్స్ మధ్య సాంకేతిక సహకారం పెంపొందించే ఒప్పందానికి కూడా కేబినెట్ ఆమోదముద్ర వేసింది. అక్టోబర్ 3న ఇందుకు సంబంధించిన అవగాహన ఒప్పందం జరగ్గా దీనికి కేబినెట్ తాజాగా ఆమోదం తెలిపింది. పరస్పర ప్రయోజనం, సమానత్వం కోసం ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సాంకేతిక సహకారాన్ని పెంపొందించుకోవాలన్నది ఒప్పందం లక్ష్యం.
Comments
Please login to add a commentAdd a comment