మార్కెట్ కు జపాన్ షాక్..
♦ ఉద్దీపన లేదన్న బ్యాంక్ ఆఫ్ జపాన్ ప్రకటనతో ఇన్వెస్టర్ల నిరుత్సాహం
♦ డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపుతో అమ్మకాల ఒత్తిడి
♦ సెన్సెక్స్ 461 పాయింట్లు డౌన్ 133 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
ముంబై: ప్రతికూల అంశాల ప్రభావంతో మార్కెట్ మూడు వారాల్లో అతిపెద్ద పతనాన్ని చవిచూసింది. ముందస్తు అంచనాలకు భిన్నంగా బ్యాంక్ ఆఫ్ జపాన్ ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించకపోవడంతో నిరుత్సాహానికి లోనైన ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లో భారీ అమ్మకాలు జరిపారు. ఏప్రిల్ డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపునకు గురువారం చివరిరోజుకావడం కూడా మార్కెట్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. దాంతో బీఎస్‌ఈ సెన్సెక్స్ 461 పాయింట్లు పతనమై 25,603 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 133 పాయింట్లు క్షీణించి 7,847 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఏప్రిల్ 5 తర్వాత సూచీలు ఇంతభారీగా పడిపోవడం ఇదే ప్రథమం.
క్షీణతకు పలు కారణాలు...
బ్యాంక్ ఆఫ్ జపాన్ వడ్డీ రేట్లను యథాతథంగా అట్టిపెట్టడంతో పాటు ఆర్థిక వ్యవస్థకు ఎటువంటి ఉద్దీపననూ ప్రకటించలేదు. అలాగే క్రితం రాత్రి అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ పాలసీ రేట్లను పెంచనప్పటికీ, ఆర్థిక వ్యవస్థ పట్ల విశ్వాసాన్ని వ్యక్తంచేసింది. దాంతో జూన్ సమావేశంలో ఫెడ్ వడ్డీ రేట్లు పెంచవచ్చన్న అంచనాలు తాజాగా ఏర్పడ్డాయి. ఈ రెండు అంశాలు ప్రపంచ స్టాక్ మార్కెట్లపై ఒత్తిడి పెంచాయని, ఏప్రిల్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్టుల ముగింపు కారణంగా భారత్ మార్కెట్, మిగతా దేశాలతో పోలిస్తే ఎక్కువ క్షీణించిందని విశ్లేషకులు చెప్పారు. ఎఫ్ అండ్ ఓ విభాగంలో ఇన్వెస్టర్లు వారి లాంగ్ పొజిషన్లను మే నెల డెరివేటివ్ సిరీస్‌కు రోలోవర్ చేసేబదులు, వాటిని ఆఫ్‌లోడ్ చేసేందుకు మొగ్గుచూపారని స్టాక్ బ్రోకర్లు తెలిపారు. మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, ఎఫ్‌ఎంసీజీ, ఇన్‌ఫ్రా, ఆటో రంగాలకు చెందిన షేర్లలో అమ్మకాలు జరిగినట్లు వారు వివరించారు.
హెవీవెయిట్స్‌లో అమ్మకాలు...
హెవీవెయిట్ షేర్లలో అమ్మకాల నేపథ్యంలో సెన్సెక్స్‌లో అన్నింటికంటే అధికంగా హెచ్‌డీఎఫ్‌సీ 3.21 శాతం క్షీణించింది. ఐటీసీ 3 శాతం, మహీంద్రా 2.99 శాతం, మారుతీ సుజుకి 2.94 శాతం, గెయిల్ 2.52 శాతం, టాటా స్టీల్ 2.5 శాతం, ఎన్‌టీపీసీ 2.45 శాతం చొప్పున తగ్గాయి. బుధవారం ఆర్థిక ఫలితాలు ప్రకటించిన భారతీ ఎయిర్‌టెల్ షేరు రోజులో చాలాభాగం లాభాలతో ట్రేడయినా, ముగింపు సమయంలో లాభాల స్వీకరణ కారణంగా 0.23 శాతం తగ్గి ముగిసింది.
హిందుస్తాన్ యూనిలీవర్, బజాజ్ ఆటో, బీహెచ్‌ఈఎల్, ఇన్ఫోసిస్, ఆదాని పోర్ట్స్, ఎస్‌బీఐ, రిలయన్స్ ఇండస్ట్రీస్, సిప్లా, ఓఎన్‌జీసీ, హీరో మోటోకార్ప్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా మోటార్స్, కోల్ ఇండియాలు కూడా నష్టాలతో ముగిశాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు తిరిగి రూ. 1000 లోపునకు తగ్గింది. 7 వారాల కనిష్టస్థాయి రూ. 996 వద్దకు పడిపోయింది. వివిధ రంగాల సూచీల్లో అన్నింటికంటే ఎక్కువగా బీఎస్‌ఈ ఆయిల్ అండ్ గ్యాస్ సూచి 2.18 శాతం నష్టపోగా, మెటల్, పవర్, ఆటో సూచీలు 2 శాతం చొప్పున తగ్గాయి.
3.6 శాతం పతనమైన జపాన్ మార్కెట్...
జపాన్ కేంద్ర బ్యాంక్ షాకివ్వడంతో ఆ దేశపు నికాయ్ సూచీ 3.61% పతనమయ్యింది. ఆసియాలో తైవాన్ సూచి 1%పైగా క్షీణించింది. చైనా షాంఘై ఇండెక్స్ 0.27% తగ్గింది. సింగపూర్, దక్షిణ కొరియా ఇండెక్స్‌లు కూడా స్వల్పంగా తగ్గాయి. యూరప్‌లోని ప్రధాన మార్కెట్లైన జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్ సూచీలు ఆరంభంలో నష్టాల్లో ఉన్నా.. చివర్లో కోలుకున్నాయి.