
సాక్షి, ముంబై: భారత్‌లో బంగారం ధర సోమవారం కొత్త రికార్డు స్థాయికి చేరుకుంది. దేశీయ ఎంసీఎక్స్‌లో మార్కెట్లో 10గ్రాముల బంగారం ధర 48000 రూపాయిలపైకి ఎగిసి, 48237 రూపాయిల వద్ద చరిత్రాత్మక గరిష్టస్థాయిని అందుకుంది. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య భారీగా పెరగడంతో పాటు చైనాతో నెలకొన్న సరిహద్దు వివాదాలు మరింత ముదరడంతో బంగారానికి డిమాండ్ నెలకొన్నట్లు బులియన్ పండితులు చెబుతున్నారు. (2000 డాలర్లకు బంగారం: గోల్డ్మెన్ శాక్స్)
అలాగే అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధర నెలరోజుల గరిష్టానికి చేరుకోవడం కూడా ఇక్కడి సెంటిమెంట్‌ను బలపరిచినట్లు వారు అభిప్రాయపడ్డారు. సోమవారం ఉదయం 10గంటలకు ఎంసీఎక్స్ మార్కెట్లో 10గ్రాముల పసిడి ధర గతవారం ముగింపు(రూ.47937)తో పోలిస్తే 300 రూపాయిలు లాభపడి 48237 రూపాయిల వద్ద ట్రేడ్ అవుతోంది. ప్రారంభంలో రూ.352లు లాభపడి రూ.48,289 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఈ ధర భారత్‌లో బంగారానికి జీవితకాల గరిష్టస్థాయి కావడం విశేషం. ఇదే ఎంసీఎక్స్ మార్కెట్లో గత శుక్రవారం రూ.582 లాభపడి రూ.47937లు వద్ద ముగిసింది. (స్వల్పంగా పెరిగిన బంగారం)
అంతర్జాతీయంగా నెలరోజుల గరిష్టానికి:
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర నెలరోజుల గరిష్టాన్ని చేరుకుంది. ఆసియా ట్రేడింగ్‌లో నేటి ఉదయం సెషన్‌లో ఔన్స్ పసిడి ధర 22 డాలర్ల లాభపడి 1,775.05 డాలర్ల స్థాయికి చేరుకుంది. కరోనా వైరస్ రెండో దశ వ్యాధి వ్యాప్తితో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ రివకరీ మరింత ఆలస్యం కావచ్చనే ఆందోళనలు బంగారానికి డిమాండ్‌ను పెంచాయి. శుక్రవారం 22డాలర్ల లాభంతో 1,753డాలర్ల వద్ద స్థిరపడింది.