
ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల కోతతో పసిడి పరుగు
ముంబై : అంతర్జాతీయ మహమ్మారి కరోనా ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తున్న క్రమంలో అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను తగ్గించడం బంగారాన్ని పరుగులు పెట్టించింది. ఫెడ్ వడ్డీరేట్లలో కోత విధించడం పసిడికి కలిసివచ్చింది. ఎంసీఎక్స్‌లో సోమవారం ఉదయం పది గ్రాముల బంగారం ఏకంగా రూ 700 భారమై రూ 41,068కి పెరిగింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ తగ్గడం కూడా బంగారం మరింత ప్రియమైంది. అంతర్జాతీయ మార్కెట్లలోనూ స్వర్ణం ధరలు పైపైకి ఎగబాకాయి. ఇక వెండి ధరలు సైతం బంగారం బాటలోనే భారమయ్యాయి. ఎంసీఎక్స్‌లో కిలో వెండి రూ 338 పెరిగి రూ 40,825కు ఎగబాకింది. అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో రానున్న రోజుల్లోనూ బంగారం, వెండి ధరలు మరింత పెరుగుతాయని బులియన్ నిపుణులు అంచనా వేస్తున్నారు.