అమ్మకాల రూట్లోనే ఎఫ్‌ఐఐలు
మూడు నెలల కనిష్టానికి సెన్సెక్స్..
⇒ ఇన్ఫోసిస్ ఫలితాలు, వర్షాభావ అంచనాల దెబ్బ కూడా...
ముంబై: బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్‌ఈ) సెన్సెక్స్ గురువారం 297 పాయింట్లు నష్టపోయి, 27,438 పాయింట్ల వద్ద ముగిసింది. మూడు నెలల కనిష్ట స్థాయి ఇది. గత ఎనిమిది ట్రేడింగ్ దినాల్లో 7 రోజులు మార్కెట్ నష్టాల్లోనే ఉంది. ఇంకా చెప్పాలంటే... ఈ వారంలో సెన్సెక్స్ ఏకంగా 1,004 పాయింట్లు (3.53 శాతం) నష్టపోయింది. ఇక నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ సైతం శుక్రవారం 93 పాయింట్ల పతనంతో 8,305 పాయింట్ల వద్దకు దిగింది.
మూడు ప్రధాన కారణాలు!
⇒ పన్ను అంశాలకు సంబంధించి విదేశీ పెట్టుబడిదారు విశ్వాసం దెబ్బతినడం మార్కెట్‌పై తన ప్రభావాన్ని చూపిస్తోంది. దాదాపు రూ. 40,000 కోట్ల పన్ను డిమాండ్ నోటీసులను ఉపసంహరించుకోవాలంటూ విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐ) చేస్తున్న డిమాండ్‌లకు ప్రభుత్వం తలొగ్గే ప్రసక్తే లే దని రెండు రోజుల క్రితం ఆర్థిక శాఖ వర్గాలు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఎఫ్‌ఐఐల అమ్మకాలు భారీ స్థాయిలో కొనసాగుతున్నాయి.
⇒ శుక్రవారం విడుదలైన ఇన్ఫోసిస్ ఫలితాలు నిరాశాజనకంగా ఉండడంతో ఈ షేర్ ధర దాదాపు 6 శాతం నష్టపోయింది. మార్కెట్ నష్టంలో 150 పాయింట్ల మేర కేవలం ఈ షేర్ పతనం వల్లే చోటుచేసుకోవడం గమనార్హం. మొదటినుంచీ అప్రమత్తంగా సాగిన ట్రేడింగ్‌పై చివరి మూడు గంటల్లో ఇన్ఫోసిస్ ఫలితాల ప్రభావమూ కనిపించింది.
⇒ వర్షాభావ పరిస్థితులు ఏర్పడవచ్చన్న అంచనాలూ మార్కెట్ పతనానికి ఒక కారణం.
టర్నోవర్ చూస్తే..: ఎన్‌ఎస్‌ఈలో రూ.19,630 కోట్లుగా, ఎన్‌ఎన్‌ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.3,31,143 కోట్లుగా నమోదైంది. బీఎస్‌ఈలో ఈ పరిమాణం రూ. 3,664కోట్లు.
జూన్‌లో రూ.15,000 కోట్ల ఎస్‌బీఐ ఇష్యూ !
ముంబై: దాదాపు రూ. 15,000 కోట్లు సమీకరించేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తలపెట్టిన షేర్ల ఇష్యూ.. జూన్‌లో రావొచ్చని అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు అనువుగా లేనందువల్ల అప్పటిదాకా వేచి ఉండే అవకాశం ఉందని సమాచారం.