
న్యూఢిల్లీ: పెరిగిపోతున్న కరెంటు ఖాతా లోటును నియంత్రించడం, రూపాయి విలువ క్షీణతకు చెక్‌పెట్టే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 19 రకాల దిగుమతులపై సుంకాలను పెంచింది. వీటిలో విమాన ఇంధనం, ఏసీలు, ఫ్రిడ్జ్‌లు, వాషింగ్ మెషీన్లు తదితర ఉత్పత్తులు ఉన్నాయి. బుధవారం అర్ధరాత్రి నుంచి ఇవి అమల్లోకి వచ్చేస్తాయని కేంద్రం ప్రకటించింది. ఈ దిగుమతుల విలువ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.86,000 కోట్ల మేర ఉంటుందని తెలిపింది. సుంకాల పెంపుతో వీటి ధరలు మరింత పెరిగిపోతాయి.
తద్వారా వాటి దిగుమతులకు ఆదరణ తగ్గుతుందని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ‘‘కొన్ని రకాల దిగుమతులను నిరోధించేందుకుగాను ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీని పెంచడం ద్వారా కేంద్ర ప్రభుత్వం టారిఫ్ చర్యలు తీసుకుంది. కరెంటు ఖాతా లోటును కుదించడమే ఈ చర్యల ఉద్దేశం’’ అని కేంద్ర ప్రభుత్వం తన ప్రకటనలో తెలిపింది. పెరిగిపోతున్న కరెంటు ఖాతా లోటు, రూపాయి క్షీణతను అడ్డుకునేందుకు అనవసర దిగుమతులను నిరోధించనున్నట్టు కేంద్రం ఈ నెల 14నే ప్రకటించింది.