ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణ?
ముంబై: ఐడీబీఐ బ్యాంకులో వాటాలు తగ్గించుకుని, ప్రైవేటీకరించాలని కేంద్రం యోచిస్తోంది. తద్వారా అది కూడా యాక్సిస్ బ్యాంకులాగా రూపాంతరం చెందేలా చూడాలని భావిస్తోంది. ప్రాజెక్టులకు ఇచ్చిన రుణాలు మొండి బకాయిలుగా మారి సతమతమవుతున్న ఐడీబీఐ బ్యాంకు పనితీరును మెరుగుపర్చుకునే వీలు కల్పించాలని యోచిస్తోంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి జయంత్ సిన్హా మంగళవారం ఈ విషయాలు తెలిపారు.
డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యాలను సాధించే దిశగా ఐడీబీఐ బ్యాంకులో ప్రభుత్వం తన వాటాలను 49 శాతాని కన్నా తక్కువకి తగ్గించుకునే యోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంల సిన్హా వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రభుత్వ రంగ ఫండ్ మేనేజరైన యూటీఐ 1990లో సంక్షోభంలో కూరుకుపోవడం, దాన్నుంచి యాక్సిస్ బ్యాంక్ ఏర్పాటు కావడం తెలిసిందే.
ప్రస్తుతం ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో దిగ్గజంగా ఎదిగిన యాక్సిస్‌లో ప్రభుత్వానికి 13 శాతం వాటాలు ఉన్నాయి. మిగతా వాటాలు ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు, ప్రభుత్వ రంగ బీమా సంస్థలకు ఉన్నాయి.