Finance Minister Jayant Sinha
-
ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణ?
ముంబై: ఐడీబీఐ బ్యాంకులో వాటాలు తగ్గించుకుని, ప్రైవేటీకరించాలని కేంద్రం యోచిస్తోంది. తద్వారా అది కూడా యాక్సిస్ బ్యాంకులాగా రూపాంతరం చెందేలా చూడాలని భావిస్తోంది. ప్రాజెక్టులకు ఇచ్చిన రుణాలు మొండి బకాయిలుగా మారి సతమతమవుతున్న ఐడీబీఐ బ్యాంకు పనితీరును మెరుగుపర్చుకునే వీలు కల్పించాలని యోచిస్తోంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి జయంత్ సిన్హా మంగళవారం ఈ విషయాలు తెలిపారు. డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యాలను సాధించే దిశగా ఐడీబీఐ బ్యాంకులో ప్రభుత్వం తన వాటాలను 49 శాతాని కన్నా తక్కువకి తగ్గించుకునే యోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంల సిన్హా వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రభుత్వ రంగ ఫండ్ మేనేజరైన యూటీఐ 1990లో సంక్షోభంలో కూరుకుపోవడం, దాన్నుంచి యాక్సిస్ బ్యాంక్ ఏర్పాటు కావడం తెలిసిందే. ప్రస్తుతం ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో దిగ్గజంగా ఎదిగిన యాక్సిస్లో ప్రభుత్వానికి 13 శాతం వాటాలు ఉన్నాయి. మిగతా వాటాలు ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు, ప్రభుత్వ రంగ బీమా సంస్థలకు ఉన్నాయి. -
ఆ 17 మంది పన్ను బకాయి.. రూ.2.14 లక్షల కోట్లు!
న్యూఢిల్లీ : దేశంలో 17 మంది వ్యక్తులు రూ.2.14 లక్ష ల కోట్ల పన్ను బకాయిలు చెల్లించాల్సి ఉంది. వీరిలో ప్రతి ఒక్కరూ రూ.1,000 కోట్లపైన పన్ను బకాయి పడినవారే. దేశంలోని 35 కంపెనీలు రూ.1,000 కోట్ల పైబడి కట్టాల్సిన మొత్తం పన్ను బకాయిలు రూ.90,568 కోట్ల కన్నా సంబంధిత 17 మంది వ్యక్తులు చెల్లించాల్సింది దాదాపు రెట్టింపు. రాజ్యసభలో ఒక ప్రశ్నకిచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో ఆర్థిక శాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా ఈ విషయం చెప్పారు. ఆయన తెలిపిన సమాచారం ప్రకారం.. దేశంలో మొత్తం పన్ను బకాయిలు 2015 ఏప్రిల్ 1 నాటికి రూ.8,27,680 కోట్లు. దీన్లో 17 వ్యక్తిగత, 35 కంపెనీల వాటానే మూడోవంతు. పన్ను వసూళ్ల క్రమంలో పలు న్యాయ, విధానపరమైన అడ్డంకులన్నాయని మంత్రి చెప్పారు. అయితే బకాయిల వసూళ్లకు అడ్డంకులు అధిగమించేందుకు తగిన చర్యలను ప్రభుత్వం తీసుకుంటోందని తెలియజేశారు. కాగా రూ.10 కోట్లుపైబడి పన్ను చెల్లిస్తున్న వారి సంఖ్య దేశంలో 2015 మార్చి నాటికి అంతకుముందు కాలంతో పోలిస్తే 69% పెరిగి 4,692కు చేరిందని మంత్రి తెలిపారు. -
బీసీసీఐ చెల్లించిన పన్ను రూ. 2,140 కోట్లు
న్యూఢిల్లీ : భారత క్రికెట్ బోర్డు నుంచి రావాల్సిన పన్ను బకాయిల్లో రూ.2,140.48 కోట్లు వసూలైనట్టు కేంద్రం తెలిపింది. మిగతా రూ.369.89 కోట్లు ఐటీ అధికారుల దగ్గర నిలిచిపోయాయని, బీసీసీఐ చేసుకున్న అప్పీల్ను తిరస్కరించే వరకు అక్కడే ఉంటాయని రాజ్యసభలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. రావాల్సిన బకాయిల్లో 2008-09లో రూ.50 కోట్లు, 2010-11లో రూ.100 కోట్లు, 2011-12లో రూ.100 కోట్లు, 2012-13లో రూ.116.89 కోట్లు ఉన్నాయని ఆయన వివరించారు.