ఆ 17 మంది పన్ను బకాయి.. రూ.2.14 లక్షల కోట్లు!
న్యూఢిల్లీ : దేశంలో 17 మంది వ్యక్తులు రూ.2.14 లక్ష ల కోట్ల పన్ను బకాయిలు చెల్లించాల్సి ఉంది. వీరిలో ప్రతి ఒక్కరూ రూ.1,000 కోట్లపైన పన్ను బకాయి పడినవారే. దేశంలోని 35 కంపెనీలు రూ.1,000 కోట్ల పైబడి కట్టాల్సిన మొత్తం పన్ను బకాయిలు రూ.90,568 కోట్ల కన్నా సంబంధిత 17 మంది వ్యక్తులు చెల్లించాల్సింది దాదాపు రెట్టింపు. రాజ్యసభలో ఒక ప్రశ్నకిచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో ఆర్థిక శాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా ఈ విషయం చెప్పారు. ఆయన తెలిపిన సమాచారం ప్రకారం.. దేశంలో మొత్తం పన్ను బకాయిలు 2015 ఏప్రిల్ 1 నాటికి రూ.8,27,680 కోట్లు. దీన్లో 17 వ్యక్తిగత, 35 కంపెనీల వాటానే మూడోవంతు.
పన్ను వసూళ్ల క్రమంలో పలు న్యాయ, విధానపరమైన అడ్డంకులన్నాయని మంత్రి చెప్పారు. అయితే బకాయిల వసూళ్లకు అడ్డంకులు అధిగమించేందుకు తగిన చర్యలను ప్రభుత్వం తీసుకుంటోందని తెలియజేశారు. కాగా రూ.10 కోట్లుపైబడి పన్ను చెల్లిస్తున్న వారి సంఖ్య దేశంలో 2015 మార్చి నాటికి అంతకుముందు కాలంతో పోలిస్తే 69% పెరిగి 4,692కు చేరిందని మంత్రి తెలిపారు.