
న్యూఢిల్లీ: చైనాలో వ్యాపించి, ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన రేపుతున్న కోవిడ్-19 (కరోనా వైరస్) ప్రభావాలపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. కోవిడ్-19 వ్యాప్తి వల్ల తమారీ, పంపిణీ రంగాలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ పరిష్కార మార్గాలను ప్రకటిస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రధానంగా తయారీ రంగం, ఔషధాల ముడి సరుకు నిల్వలపై దేశీయ ఫార్మ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయన్న వార్తలను ఆమె ఖండించారు.
నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ..ముడి పదార్ధాల సరఫరాపై ఫార్మా, సౌర , రసాయన పరిశ్రమల ప్రతినిధి ఆందోళన వ్యక్తం చేశారని, అయితే ముడి పదార్థాల కొరత గురించి తక్షణ ఆందోళనలను తొలగించడంతో పాటు, ధరలను నియత్రించేందుకు చర్యలు చేపడతామన్నారు. ఈ చర్యలను ప్రభుత్వం త్వరలో ప్రకటించనుందని ఆమె చెప్పారు. దేశీయ తమారీ రంగం పుంజుకోవడానికి నీతి అయోగ్, ఫార్మాకు చెందిన ప్రముఖులు త్వరలోనే పరిష్కార మార్గాలను సూచించనున్నట్లు నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.