‘పోంజీ’ బాధితులకు పరిహారం!
చట్ట సవరణ చేస్తున్నట్లు కేంద్రం ప్రకటన
న్యూఢిల్లీ: మోసపూరిత పథకాల్లో(పోంజీ స్కీమ్స్) నష్టపోయిన వారికి ఊరట కలిగించే కీలక సంకేతాన్ని కేంద్రం ఇచ్చింది. శారద తరహా పథకాల్లో మోసానికి గురైన వారికి నష్టపరిహారం అందేలా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్‌ఏ)కు సవరణలు చేస్తున్నట్లు రెవెన్యూ కార్యదర్శి శక్తికాంత దాస్ శుక్రవారం ఇక్కడ ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టర్ (ఈడీ) నిర్వహించిన ఒక కార్యక్రమంలో వెల్లడించారు. మోసపూరిత పథకాల్లో నష్టపోయిన మదుపుదారుల సంఖ్య దాదాపు 6 కోట్లు ఉంటుందని అంచనా.
నష్టపోయిన విలువ దాదాపు రూ.80,000 కోట్లుగా భావిస్తున్నారు. ఆయా అంశాలను శక్తికాంత దాస్ ప్రస్తావిస్తూ... ఐబీ, సీబీఐ, కస్టమ్స్, డీఆర్‌ఐ, ఆదాయపు పన్ను శాఖ, ఈడీ వంటి వివిధ విచారణా సంస్థల మధ్య చక్కటి సమన్వయం, సహకారం ద్వారా మోసపూరిత పథకాలను నిరోధించవచ్చని అన్నారు.
ఫైనాన్స్ బిల్లులో చొరవ...
ఫైనాన్స్ బిల్లులో పోంజీ స్కీమ్‌ల నిరోధానికి సంబంధించి నిబంధనలు ఉన్నట్లు పేర్కొంటూ, అయితే ఈ విషయం తగినంత ప్రచారం కాలేదని అన్నారు. పోంజీ స్కీమ్‌ల బాధితులకు పరిహారం కల్పించేలా చర్యలకు ఒక నిబంధన ఫైనాన్స్ బిల్లులో ఉందన్నారు. మోసపూరిత పథకాల్లో నష్టపోయిన వారికి పరిహారం అందించడం... కోర్టుల పర్యవేక్షణ వంటి అంశాలకు సంబంధించి రానున్న కాలంలో తగిన మార్గదర్శకాలు, నిబంధనలను వెలువరించనున్నట్లు రెవెన్యూ కార్యదర్శి వెల్లడించారు. ప్రత్యక్ష, పరోక్ష పన్ను చట్ట నిబంధనలను ఉల్లంఘించినవారిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేటే కఠిన చర్యలు తీసుకునేలా పీఎంఎల్‌ఏలో సవరణల అంశం ఫైనాన్స్ బిల్లులో మరో ముఖ్యమైన అంశంగా పేర్కొన్నారు.