‘పొంజీ’ ఆపరేటర్లపై ఇక ఉక్కుపాదం!
♦ పదేళ్ల వరకూ జైలు శిక్ష...
♦ రూ. 50 కోట్ల జరిమానా కూడా...
♦ కొత్త బిల్లులో ప్రతిపాదించిన కేంద్రం
న్యూఢిల్లీ: పొంజీ స్కీమ్ ఆపరేటర్లపై కొరడా ఝలిపించేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. ప్రభుత్వం తాజాగా ప్రతిపాదించిన ‘అనియంత్రిత డిపాజిట్ పథకాల నిషేధం-డిపాజిటర్ల మనోభావాల పరిరక్షణ’ ముసాయిదా బిల్లు ప్రకారం.. అక్రమ సొమ్ము డిపాజిట్ పథకాలను నడిపిస్తున్న (పొంజీ ఆపరేటర్లు) వారు రూ.50 కోట్లు జరిమానా చెల్లించడం సహా పదేళ్ల వరకు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. అన్ని అనియంత్రిత డిపాజిట్ పథకాలన్నీ కూడా డ్రాఫ్ట్ బిల్లు పరిధిలోకి వస్తాయి. నిందితుడు ఒక ఏడాది తక్కువ కాకుండా జైలు శిక్ష (ఇది ఐదేళ్ల వరకు పొడిగించొచ్చు)తోపాటు రూ.10 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. అదే ఒక వ్యక్తి పదే పదే అక్రమాలకు పాల్పడితే అతను కనీసం ఐదేళ్లు (పదేళ్లకు పొడిగించొచ్చు) జైలు శిక్ష అనుభవించడంతోపాటు రూ.50 కోట్ల జరిమానా కట్టాల్సి వస్తుంది. ప్రభుత్వం కొత్త డ్రాఫ్ట్ బిల్లుపై ఏప్రిల్ 30 వరకు ప్రజాభిప్రాయాలను సేకరించనున్నది.