రియల్టీకి ఎఫ్‌డీఐల ఊతం
* విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలు సడలించిన కేంద్రం
న్యూఢిల్లీ: నిధుల కోసం అల్లాడుతున్న రియల్ ఎస్టేట్ రంగానికి తోడ్పాటునిచ్చే విధంగా కేంద్రం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనలను సడలించింది. కనీస బిల్టప్ ఏరియా, పెట్టుబడి పరిమితులను తగ్గించింది. నిర్మాణ రంగంలో ఎఫ్‌డీఐ విధానాలను సవరించేందుకు ఉద్దేశించిన ప్రతిపాదనను కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదించింది. దీని ప్రకారం కనీస ఫ్లోర్ ఏరియా పరిమితిని 50,000 చ.మీ. నుంచి 20,000 చ.మీ.లకు తగ్గించింది. అలాగే కనీస పెట్టుబడిని 10 మిలియన్ డాలర్ల నుంచి 5 మిలియన్ డాలర్లకు కుదించింది.
అటు మూడేళ్ల లాకిన్ వ్యవధిలో ఎలాంటి మార్పులు చేయనప్పటికీ.. ప్రాజెక్టుల నుంచి వైదొలిగేందుకు సంబంధించిన నిబంధనలను మాత్రం క్యాబినెట్ సడలించింది. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత గానీ లేదా చివరి విడత ఇన్వెస్ట్‌మెంట్ చేసిన నాటి నుంచి మూడేళ్లలోగా గానీ విదేశీ ఇన్వెస్టర్లు వైదొలిగేందుకు అనుమతించింది. ఇక, సర్వీస్డ్ ప్లాట్ల అభివృద్ధి విషయంలో కనీసం 10 హెక్టార్ల స్థలం ఉండాలన్న షరతును పూర్తిగా ఎత్తివేసింది.
ఇక, ఫ్లోర్ ఏరియా రేషియో/ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్‌లో కనీసం 60 శాతాన్ని సుమారు 60 చ.మీ. విస్తీర్ణం ఉండే ఇళ్ల నిర్మాణానికి ఉపయోగిస్తే సదరు ప్రాజెక్టును అందుబాటు ధర హౌసింగ్ ప్రాజెక్టుగా పరిగణిస్తారు. ప్రాజెక్టులోని మొత్తం గృహాల్లో 35 శాతం ఇళ్లను ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోసం 21-27 చ.మీ. విస్తీర్ణంలో నిర్మించాల్సి ఉంటుంది.
డెవలపర్లకు తోడ్పాటు..
మొత్తం మీద తాజా సవరణలు నిర్మాణ రంగ వృద్ధికి తోడ్పడగలవని ప్రభుత్వం అధికారిక ప్రకటనలో పేర్కొంది. దేశీయంగా అందుబాటు ధరల్లో ఇళ్ల నిర్మాణానికి, స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేసేందుకు ఉపయోగపడగలవని వివరించింది. మరోవైపు, కేంద్రం తాజా నిర్ణయంతో డెవలపర్లు తమ ప్రాజెక్టులకోసం నిధులను సమకూర్చుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గం లభించగలదని రియల్టర్ల సమాఖ్య క్రెడాయ్ ప్రెసిడెంట్ కట్టా శేఖర్‌రెడ్డి చెప్పారు.
టౌన్‌షిప్‌లు, హౌసింగ్ ప్రాజెక్టుల్లో 100 శాతం ఎఫ్‌డీఐలకు 2005 నుంచి అనుమతులు ఉన్నప్పటికీ.. కేంద్రం కొన్ని షరతులను అమలు చేస్తోంది. 2006-07, 2009-10 మధ్యలో నిర్మాణ రంగంలోకి ఎఫ్‌డీఐలు గణనీయంగా వచ్చినా.. తర్వాత మాత్రం గణనీయంగా తగ్గిపోయాయి. ఏప్రిల్ 2000-ఆగస్టు 2014 మధ్య కాలంలో సుమారు 23.75 బిలియన్ డాలర్లు వచ్చాయి. ఇది భారత్‌లోకి వచ్చిన మొత్తం ఎఫ్‌డీఐల్లో 10 శాతం. ఈ రంగంలోకి మళ్లీ ఇన్వెస్ట్‌మెంట్లను ఆకర్షించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తాజా సవరణలు చేసింది.