కొత్త ప్రభుత్వంతో రియల్టీకి ఊతం: సీఐఐ
ముంబై: కొత్త ప్రభుత్వం ఏర్పాటుతో రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్వెస్టర్ల సెంటిమెంటు మెరుగుపడుతోందని పరిశ్రమల సమాఖ్య సీఐఐ, రియల్ ఎస్టేట్ రంగ సర్వీసుల సంస్థ జోన్స్ లాంగ్ లాసలె (జేఎల్‌ఎల్) ఒక నివేదికలో పేర్కొన్నాయి. ఎన్నికల ముందు రాజకీయ అనిశ్చితి, అవినీతి కుంభకోణాల కారణంగా ఈ రంగంలోకి ఎఫ్‌డీఐలు గణనీయంగా పడిపోయాయని.. అయితే ఇకపై మళ్లీ పుంజుకునే అవకాశాలు ఉన్నాయని వివరించాయి. స్పష్టమైన మెజార్టీ దక్కించుకున్న ప్రభుత్వం స్థిరమైన పాలన అందించగలదనే విశ్వాసం ఇన్వెస్టర్లలో కలుగుతుండటం ఇందుకు కారణమని పేర్కొన్నాయి. ఒకవైపు అమ్మకాలు పడిపోయి, మరోవైపు రుణభారం పెరిగిపోయి రియల్టీ రంగం గడ్డుకాలం ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. 2012 ఏప్రిల్-2013 మార్చి మధ్యలో రియల్ ఎస్టేట్ రంగంలోకి 3.1 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు రాగా, 2013 ఏప్రిల్- 2014 ఫిబ్రవరి మధ్య 1.3 బిలియన్ డాలర్లకు పడిపోయాయి.