మాల్యాను రప్పించడానికి ముమ్మర ఏర్పాట్లు
మాల్యాను రప్పించడానికి ముమ్మర ఏర్పాట్లు
Published Thu, Apr 20 2017 9:35 AM | Last Updated on Tue, Sep 5 2017 9:16 AM
లండన్లో అరెస్టు అయి మూడు గంటల్లోనే బయటికి వచ్చిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను ఎలాగైనా భారత్కు రప్పించాలని కేంద్ర ప్రభుత్వం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. భారత అథారిటీల తరుఫున యూకేకు చెందిన ఓ స్వతంత్ర మధ్యవర్తిని నియమించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. మాల్యాను భారత్కు రప్పించడం కోసం ఈ దిశగా ముందుకు వెళ్తున్నట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు చెప్పారు. మాల్యాను భారత్ రప్పించడం అంత సులువైన ప్రక్రియ కాదని, సదీర్ఘ సమయం పట్టవచ్చని నిపుణులంటున్నారు. బ్రిటన్లో తలదాచుకుంటున్న నేరస్తులను అప్పగించాలని భారత్ అభ్యర్థులను ఆ దేశం చాలాసార్లు తోసిపుచ్చింది. ఈ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని, బ్యాంకులకు వేలకోట్ల రూపాయలు ఎగ్గొట్టి యూకేలో తలదాచుకుంటున్న మాల్యాను ఎలాగైనా త్వరగా భారత్కు రప్పించాల్సిందేనని ప్రభుత్వం భావిస్తోంది.
మాల్యాను భారత్కు రప్పించే ప్రయత్నాల్లో భాగంగా స్కాంట్లాండ్ పోలీసులు ఆయన్ను అక్కడ అదుపులోకి తీసుకున్నారు. కానీ అరెస్టు అయిన మూడు గంటల్లోనే బెయిల్ పై బయటికి వచ్చి, భారత్ను మరింత కవ్వించే విధంగా మాల్యా ట్వీట్లు చేశారు. మాల్యా కేసు మళ్లీ మే 17న అక్కడి కోర్టు ముందుకు విచారణకు రానుంది. అయితే ఈ విచారణ నిమిత్తం అక్కడ న్యాయ ప్రక్రియ గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తిని, భారత్ తరుఫున వాదించడానికి నియమించాలని చూస్తున్నట్టు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చెప్పారు.
దేశ దేశానికి కోర్టు ప్రక్రియలు వేరువేరుగా ఉంటాయని, అక్కడి చట్టాలు, చట్టపరమైన పరిష్కారాలు తెలిసినవాళ్లు వాదిస్తేనే మంచిదని ఆయన పేర్కొన్నారు.అయితే గత నేరస్తుల అప్పగింత ప్రక్రియలో బలమైన సాక్ష్యాలు, తక్కువ పేపర్ వర్క్ ఉండటం వల్ల వారికి భారత్కు తీసుకురావడం సాధ్యపడలేదని, కానీ ప్రస్తుతం సీబీఐ, ఈడీలు ఈ కేసును విచారిస్తున్నాయని తెలిపారు. నిమిష నిమిషానికి సంబంధించిన వివరాలన్ని వారు కలిగి ఉన్నారని చెప్పారు. ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాలన్నింటిన్నీ తీసుకుని సీబీఐతో పాటు సీనియర్ లాయర్స్ ప్యానల్ లండన్ వెళ్లనుంది. వెస్ట్ మినిస్టర్ ప్రైమరీ కోర్టులో 15-20 సార్లు ఇరుపక్షాల వాదోపవాదాల విన్న అనంతరం ఈ కేసుపై తీర్పు ఇస్తారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
Advertisement
Advertisement