మాల్యా కేసు నిరవధిక వాయిదా
న్యూడిల్లీ: దేశంలో వేలకోట్ల రుణాలను ఎగవేసి విదేశాల్లో జల్సాలు చేస్తున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా వ్యవహారంపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కంటెప్ట్ ఆఫ్ కోర్టు కేసులో మ్యాలాను కోర్టుముందు ప్రవేశపెట్టకపోవడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూసిన కోర్టు శిక్షను ఖరారు చేయడానికి శుక్రవారం నిరాకరించింది. విచారణ పూర్తయినా, మాల్యాను ప్రభుత్వం కోర్టుకు తెచ్చేంతవరకు విచారణ చేపట్టలేమని, జైలు శిక్ష విధించలేమని జస్టిస్ ఆదర్శ్ కె గోయెల్ నేతృత్వంలోని ధర్మాసనం తేల్చి చెప్పింది. అనంతరం కేసును నిరవధికంగా వాయిదా వేసింది. దీంతో కోర్టు ధిక్కారం కేసులో మాల్యాకు మరోసారి ఊరట లభించింది.
ఉద్దేశ పూర్వక వేల కోట్ల రుణాల ఎగవేత దారుడు మాల్యా కోర్టుకు హాజరుకాకుండా అతని శిక్షను ఖరారు చేయలేమని ధర్మాసనం తేల్చి చెప్పింది. అయితే ఈ కేసులో ప్రభుత్వం తరపున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ మాల్యాని తిరిగి తీసుకురావడానికి కేంద్రం తీసుకున్న చర్యలను వివరించారు. మాల్యాను భారత్‌కు రప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు చెప్పారు.ఈ కేసు లండన్ కోర్టులో విచారణ జరుగుతోందని వివరించారు. డిసెంబర్ నాటికి మాల్యాను ఇండియాకు రప్పించే అవకాశాలున్నాయని చెప్పారు.
అయితే ప్రభుత్వ చర్యలను మానిటర్ చేసే ఆసక్తి తమకు లేదని సుప్రీం వ్యాఖ్యానించింది. మ్యాలాను కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తరువాత మాత్రమే తీర్పును వెలువరించగలమని మరోసారి ధర్మాసనం ప్రభుత్వానికి స్పష్టం చేసింది.