జీఎస్‌ఎం వినియోగదారులు @ 71.6 కోట్లు
న్యూఢిల్లీ: దేశంలో ఏడు జీఎస్‌ఎం టెలికం ఆపరేటర్ల వినియోగదారుల సంఖ్య మే నెల చివరకు 71.6 కోట్లకు చేరిందని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ) తెలిపింది. ఏడు జీఎస్‌ఎం టెలికం ఆపరేటర్ల జాబితాలో ఎయిర్‌టెల్, వోడాఫోన్, ఐడియా, ఎయిర్‌సెల్, యూనినార్, వీడియోకాన్, ఎంటీఎన్‌ఎల్ ఉన్నాయి. ఏప్రిల్‌లో 71 కోట్లుగా ఉన్న జీఎస్‌ఎం వినియోగదారుల సంఖ్య మే నెలలో 0.66 శాతం వృద్ధితో (46 లక్షలు) 71.6 కోట్లకు చేరింది. ఐడియాకు అత్యధికంగా 12 లక్షల మంది వినియోగదారులు కొత్తగా జతయ్యారు. దీని తర్వాతి స్థానాల్లో ఎయిర్‌టెల్ (11 లక్షలు), యూనినార్ (9 లక్షలు), ఎయిర్‌సెల్ (7 లక్షలు), వోడాఫోన్ (4 లక్షలు), వీడియోకాన్ ( 1.5 లక్షలు) ఉన్నాయి.
2020 నాటికి మొబైల్ కనెక్షన్లుః140 కోట్లు
ముంబై: దేశంలో 2020 నాటికి మొబైల్ కనెక్షన్ల సంఖ్య 140 కోట్లకు చేరుతుందని టెలికం ఉపకరణాల తయారీ సంస్థ ఎరిక్‌సన్ తెలిపింది. గతేడాది మొబైల్ కనెక్షన్ల సంఖ్య 97 కోట్లుగా ఉందని పేర్కొంది. తక్కువ ధరల్లో వివిధ మొబైల్ హ్యాండ్‌సెట్స్ అందుబాటులో ఉండటమే మొబైల్ వినియోగదారుల సంఖ్య పెరుగుదలకు కారణమని పేర్కొంది.