న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) చెల్లింపుదారులకు జీఎస్‌టీ కౌన్సిల్ ఒక ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ నెల 18న జరిగిన జీఎస్‌టీ కౌన్సిల్ 38వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. జీఎస్‌టీకి సంబంధించి, అలాగే, పన్ను చెల్లింపుదారుల సాధారణ ఫిర్యాదుల పరిష్కారం కోసం నిర్మాణాత్మక పరిష్కార యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కౌన్సిల్ భావించినట్టు బుధవారం విడుదలైన ప్రభుత్వ అధికారిక ప్రకటన తెలియజేసింది. రాష్ట్రాల స్థాయిలో, జోనల్ స్థాయిలో ఫిర్యాదుల పరిష్కార కమిటీలను ఏర్పాటు చేస్తారు.
కేంద్ర, రాష్ట్రాల పన్ను అధికారులు, వాణిజ్య, పారిశ్రామిక రంగాల ప్రతినిధులు, జీఎస్‌టీ ఇతర భాగస్వాములకు కమిటీలో చోటు కల్పిస్తారు. రెండేళ్ల కాలానికి కమిటీలను ఏర్పాటు చేస్తామని, సభ్యుల పదవీ కాలం కూడా అదే విధంగా ఉంటుందని ప్రభుత్వం తన ప్రకటనలో వివరించింది. పన్ను చెల్లింపుదారులు ఎదుర్కొంటున్న అన్ని రకాల అంశాలకు పరిష్కారం చూపించడం ఈ కమిటీ విధుల్లో భాగం. ప్రతీ త్రైమాసికానికి ఒక సారి, అవసరానికి అనుగుణంగాను కమిటీ సమావేశం అవుతుంది. ఫిర్యాదుల నమోదు, నిర్ణీత కాల వ్యవధిలోపు వాటిని పరిష్కరించే విధంగా జీఎస్‌టీఎన్ ఒక పోర్టల్‌ను కూడా ఏర్పాటు చేస్తుందని ప్రభుత్వ ప్రకటన తెలియజేసింది.
Comments
Please login to add a commentAdd a comment