మరిన్ని కంపెనీల వాహన ధరలు తగ్గాయ్
♦ జాబితాలో హ్యుందాయ్,
♦ నిస్సాన్, స్కోడా, ఇసుజు, కేటీఎం
♦ రూ.2.4 లక్షల వరకు తగ్గింపు
న్యూఢిల్లీ: తాజాగా మరిన్ని కంపెనీలు వాటి వాహన ధరలను తగ్గించాయి. నిస్సాన్, హ్యుందాయ్, స్కోడా, ఇసుజు, కేటీఎం కంపెనీలు వాటి వాహన ధరల్లో రూ.2.4 లక్షల వరకు కోత విధించాయి. జీఎస్‌టీ ప్రయోజనాలను కస్టమర్లకు అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీలు ప్రకటించాయి. ధరల తగ్గింపు ప్రాంతాన్ని, మోడల్‌ను బట్టి మారుతుందని పేర్కొన్నాయి.
ధరల తగ్గింపును పరిశీలిస్తే..
⇔ హ్యుందాయ్ మోటార్ ఇండియా కూడా వాహన ధరలను 5.9 శాతం వరకు తగ్గించింది.
⇔ నిస్సాన్ కంపెనీ డాట్సన్ బ్రాండ్ సహా తన వాహన ధరలను 3 శాతం వరకు తగ్గించింది. జీఎస్‌టీ అమలు వల్ల అటు వాహన తయారీ కంపెనీలకు, ఇటు కస్టమర్లకు ఇరువురికీ లబ్ధి కలుగుతుందని నిస్సాన్ మోటార్ ఇండియా ఎండీ అరుణ్ మల్హోత్రా తెలిపారు. నిస్సాన్ మోటార్ ఇండియా భారత్‌లో నిస్సాన్, డాట్సన్ బ్రాండ్స్ కింద రెడిగో మొదలు టెర్రానో వరకు పలు మోడళ్లను విక్రయిస్తోంది.
⇔ స్కోడా ముంబై ప్రాంతంలో వాహన ధరలను 7.3% వరకు తగ్గించింది. అంటే కస్టమర్లు రూ.2.4 లక్షల వరకు ప్రయోజనం పొందొచ్చు.
⇔ టాటా మోటార్స్.. వాణిజ్య వాహన ధరలను 8.2 శాతం వరకు తగ్గించింది.
⇔ ఇసుజు మోటార్స్ ఇండియా వాహన ధరల్లో 12 శాతం వరకు కోత విధించింది.
⇔ కేటీఎం కంపెనీ తన బైక్స్ ధరలను రూ.8,600 వరకు తగ్గించింది.
కాగా రెనో ఇండియా, మహీంద్రా, హోండా కార్స్, ఫోర్డ్, మారుతీ సుజుకీ, మెర్సిడెస్ వంటి పలు కార్ల కంపెనీలు ఇప్పటికే ధరల తగ్గింపును ప్రకటించిన విషయం తెలిసిందే. హీరో మోటోకార్ప్, టీవీఎస్, బజాజ్ వంటి పలు టూవీలర్ కంపెనీలు కూడా వాహన ధరలను తగ్గించాయి.