
గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం గతేడాది జూలై 1 నుంచి ఎంతో ప్రతిష్టాత్మకమైన ఏకీకృత పన్ను విధానం జీఎస్టీని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పన్ను విధానం చాలా క్లిష్టమైనదని వరల్డ్ బ్యాంకు తెలిపింది. ప్రపంచంలో రెండో అతిపెద్ద పన్ను రేటు ఇదేనని పేర్కొంది. ఇదే మాదిరి పన్ను విధానం కలిగి ఉన్న 115 దేశాల శాంపుల్స్ ఆధారంగా వరల్డ్ బ్యాంకు దీన్ని వెల్లడించింది. భారత్‌లో ప్రస్తుతం ఐదు పన్ను శ్లాబులున్నాయి. 0శాతం, 5శాతం, 12శాతం, 18శాతం, 28 శాతం. బంగారానికి ప్రత్యేకంగా 3 శాతం పన్ను, విలువైన రాళ్లకు 0.25 శాతం విధిస్తున్నారు. ఆల్కాహాల్, పెట్రోలియయం, స్టాంపు డ్యూటీలు, రియల్ ఎస్టేట్, ఎలక్ట్రిసిటీ డ్యూటీలను జీఎస్టీ నుంచి ప్రభుత్వం మినహాయించిన సంగతి తెలిసిందే.
ప్రపంచ వ్యాప్తంగా జీఎస్టీ అమలు చేస్తున్న దేశాల్లో 49 దేశాలు ఒకే శ్లాబును కలిగి ఉండగా.. 28 దేశాలు రెండు శ్లాబులను కలిగి ఉన్నాయని వరల్డ్ బ్యాంకు చెప్పింది. భారత్‌తో పాటే కేవలం ఐదు దేశాలు మాత్రమే నాలుగు లేదా అంతకంటే ఎక్కువ శ్లాబులను కలిగి ఉన్నాయని తెలిపింది. వాటిలో ఇటలీ, లక్సెంబర్గ్, పాకిస్థాన్, ఘనా దేశాలున్నాయని పేర్కొంది. అయితే పలు జీఎస్టీ శ్లాబులు కలిగి ప్రపంచ దేశాల్లో అత్యధిక పన్ను రేటు కలిగిన దేశంగా ఇండియా ఉందని వరల్డ్ బ్యాంకు వెల్లడించింది. అత్యధిక మొత్తంలో జీఎస్టీ శ్లాబులుండటంతో, ఈ శ్లాబు రేట్లను తగ్గిస్తామని అంతకముందే ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ వెల్లడించిన సంగతి తెలిసిందే. 12 శాతం, 18 శాతం పన్ను శ్లాబులను కలిపేయాలని చూస్తున్నట్టు తెలిపారు. గతేడాది నవంబర్‌లో గౌహతిలో భేటీ అయిన జీఎస్టీ కౌన్సిల్, 28 శాతం పన్ను శ్లాబులో ఉన్న ఉన్న ఉత్పత్తులను 228 నుంచి 50కి తగ్గించింది. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తొలి రోజుల్లో కొంత అంతరాయాలున్నాయని వరల్డ్ బ్యాంకు అభిప్రాయం వ్యక్తంచేసింది.
Comments
Please login to add a commentAdd a comment