జీఎస్‌టీతో వృద్ధికి ఊతం
⇔ మధ్యకాలికంగా 8% ఉండొచ్చు...
⇔ మొండిబకాయిలే ఆందోళనకరం
⇔ భారత్‌పై ఐఎంఎఫ్ అంచనాలు
వాషింగ్టన్: త్వరలో అమల్లోకి రాబోయే వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) విధానం... మధ్యకాలికంగా 8 శాతానికి పైగా వృద్ధి సాధించేలా భారత్‌కు తోడ్పడగలదని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) అంచనా వేసింది. అయితే, దేశ బ్యాంకింగ్ వ్యవస్థలో పేరుకుపోయిన మొండి బకాయిలే సమస్యాత్మకమని ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘పొరుగుదేశాలతో పోలిస్తే భారత్ అత్యంత వేగంగా ఎదుగుతున్న మార్కెట్ ఎకానమీ’’ అని ఐఎంఎఫ్ డిçప్యూటీ ఎండీ తావో ఝాంగ్ అభివర్ణించారు.
భారత్ వృద్ధి రేటు 2016–17లో 6.8%గానూ, 2017–18లో 7.2%గానూ ఉండవచ్చని చెప్పారు. నిలకడగా, పటిష్టమైన వృద్ధికి తోడ్పడే కీలకమైన ఆర్థిక సంస్కరణల అమల్లో ప్రభుత్వం చెప్పుకోతగ్గ స్థాయిలో పురోగతి సాధించిందని ఝాంగ్ తెలిపారు. ఉత్పత్తి పెరుగుదల, రాష్ట్రాల మధ్య వస్తు, సేవల రాకపోకలు సులభతరం అయ్యేలాందుకు జీఎస్‌టీ దోహదపడుతుందన్నారు. చమురు ధరల తగ్గుదల భారత్ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చిందని, ద్రవ్యోల్బణ తగ్గుదలకు దోహదపడిందని చెప్పారు. డీమోనిటైజేషన్‌పై స్పందిస్తూ... దీనివల్ల ఆర్థిక కార్యకలాపాలు కొంత మందగించాయని.. అయితే క్రమంగా రికవరీ కనిపిస్తోందని ఝాంగ్ చెప్పారు.
మొండిబాకీలు ఆందోళనకరం..
భారత్‌లో మొండిబకాయిలతో బ్యాంకింగ్ వ్యవస్థ పోరు కొనసాగిస్తుండటం ఆందోళన కలిగిస్తోందని ఝాంగ్ చెప్పారు. కీలక రంగాల్లో కార్పొరేట్ల పరిస్థితులు అంత బాగా లేకపోవడమూ ఆందోళనకరమేనన్నారు. 2016–17 ఏప్రిల్– డిసెంబర్ మధ్యలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మొండి బకాయిలు రూ.1 లక్ష కోట్ల మేర పెరిగి మొత్తం రూ. 6.06 లక్షల కోట్లకు చేరాయి. ఇందులో సింహభాగం విద్యుత్, ఉక్కు, రహదారులు, టెక్స్‌టైల్స్ రంగాల కంపెనీలకు చెందినవే ఉన్నాయి. 2015–16 ఆఖరు నాటికి స్థూల మొండి బాకీలు రూ. 5,02,068 కోట్లుగా ఉన్నాయి.