
జీఎస్‌టీతో ఉద్యోగాలు పోవు
పన్ను అధికారులకు ఆర్థికమంత్రి భరోసా
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) అమలుతో పన్ను అధికారులకు పనిభారం తగ్గుతుందని, దీనితో ఈ శాఖలో ఉద్యోగాలు పోతాయని వస్తున్న ఆందోళనను ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ కొట్టిపారేశారు. వారికి అటువంటి అభద్రతాభావం ఉండనక్కర్లేదని అన్నారు. కొత్త పన్నుల వ్యవస్థలో తగిన పని, అవకాశాలు వారికి ఉంటాయని వివరించారు. ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ కేంద్ర బోర్డ్ (సీబీఈసీ) ఇక్కడ నిర్వహించిన ‘ఇంటర్నేషనల్ కస్టమ్స్ డే 2017’లో అరుణ్‌జైట్లీ ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన ప్రసంగంలోని కొన్ని ముఖ్యాంశాలు..
⇔ ఎక్సైజ్, సేవలు, వ్యాట్ వంటి పలు కేంద్ర, రాష్ట్ర స్థాయి సుంకాల స్థానంలో దేశ వ్యాప్తంగా ఒకేరకమైన అమ్మకపు పన్ను అమల్లోకి వస్తోంది. దీనివల్ల ఉద్యోగుల పనికి సంబంధించిన క్రియాశీలత మారుతుంది తప్ప, ఉద్యోగాలు పోతాయని భావించడం సరికాదు.
⇔ జీఎస్‌టీ అనేది దేశంలో అతికీలకమైన పన్ను సంస్కరణ. దీనిపై ఏకాభిప్రాయ సాధనకు గత కొన్నేళ్లుగా దేశంలో ప్రయత్నం కొనసాగుతోంది. సమగ్రమైన జీఎస్‌టీ విధానం దేశ ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుంది. జీఎస్‌టీ వల్ల కేంద్రానికి ఆదాయాలు పెరుగుతాయి.
⇔ ఆర్థిక వ్యవస్థలో మార్పులు, సంస్కరణలు కొనసాగుతూనే ఉంటాయి. ఇది తప్పదు. ఇది కొత్త అవకాశాలను సైతం సృష్టిస్తుంది.
⇔ ఈ సందర్భంగా రెవెన్యూ కార్యదర్శి హాస్‌ముఖ్ ఆదియా మాట్లాడుతూ, జీఎస్‌టీ వ్యవస్థలో అధికారులకు తగిన పని ఉంటుందని అన్నారు. జీఎస్‌టీ అమలు నేపథ్యంలో ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్) అధికారుల అసోసియేషన్ ఇటీవల కేంద్రానికి తమ ఆందోళనలను తెలియజేసింది. ఐఆర్‌ఎస్ అధికారులతో రాష్ట్ర ప్రభుత్వాల వ్యాట్ శాఖల అధికారులు తమకుతాము సరిపోల్చుకోడానికి జరుగుతున్న నేపథ్యంలో, తమ అధికారాల ప్రత్యేకతను పరిరక్షించాలని అసోసియేషన్ కేంద్రానికి విజ్ఞప్తి చేస్తోంది.