జీవీకే పవర్ నష్టం రూ. 51 కోట్లు
న్యూఢిల్లీ: మౌలిక రంగ సంస్థ జీవీకే పవర్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో స్టాండెలోన్ ప్రాతిపదికన రూ. 51 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. అంతక్రితం క్యూ1లో ఇది రూ. 3 కోట్లు. మరోవైపు తాజాగా ఆదాయం రూ. 6.62 కోట్ల నుంచి రూ. 6.81 కోట్లకు పెరిగినట్లు సంస్థ తెలిపింది. అటు ఈ ఏడాది జూన్ 30 నాటికి జీవీకే కోల్ డెవలపర్స్ (సింగపూర్) తీసుకున్న రూ. 7,843 కోట్ల మేర రుణాలకు పూచీకత్తు ఇచ్చినట్లు, వివిధ పెట్టుబడులపై రూ. 295 కోట్ల మేర నిధులు రావాల్సి ఉందని కంపెనీ పేర్కొంది. బొగ్గు ధరల పతనం కారణంగా ఆస్తులకు మించి రుణభారంతో సతమతమవుతున్న జీవీకే కోల్ త్వరలో కోలుకోగలదని ఆశాభావం వ్యక్తం చేసింది.