హెచ్-1 బీ దరఖాస్తుల జోరు తగ్గలేదట!
బెంగళూరు: హెచ్ -1 బీ వీసాల ఫీజు పెంచినా భారతదేశంనుంచి దరఖాస్తుల వెల్లువ ఏమాత్రం తగ్గలేదని అమెరికా సీనియర్ కాన్సులర్ అధికారి జోసెఫ్ ఎం పాంపర్ తెలిపారు. భారత ఐటి పరిశ్రమకు ఆందోళన కలిగించిన హెచ్ -1 బీ వీసా ఫీజు రెట్టింపు వీసా అప్లికేషన్ల సంఖ్యను, వ్యాపార లావాదేవీలను ప్రభావితం చేయదని పేర్కొన్నారు. హెచ్ -1 బీ కేటగిరీలో భారత్ తమకు మాణి మకుటం లాంటిదని వ్యాఖ్యానించారు. ఈ పరంపర ఇక ముందు కొనసాగనున్నట్టు వెల్లడించారు.
భారతదేశం లోని ఐదు అమెరికా కాన్సులేట్ ఆఫీసులు ఇంచార్జిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా బెంగళూరులో పర్యటించిన అనంతరం పాంపర్ మీడియాతో ముచ్చటించారు. మరోవైపు హెచ్ -1 బీ వీసాలపై రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై చెలరేగిన ఆందోళనను ఆయన కొట్టి పారేశారు. వీసా, ఇమ్రిగ్రేషన్ చట్టాలను యూఎస్ కాంగ్రెస్ నియంత్రిస్తుందని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచార వేడిలో ఎవరో ఏదో మాట్లాడినదాన్ని పరిగణనలోకి తీసుకు రావాల్సిన అవసరం లేదని పాంపర్ తెలిపారు.
వీసా జారీలో ఫీజు పెంపు ఒక్క ఇండియాకే పరిమితం కాదని.. ప్రపంచవ్యాప్తంగా ఇది వర్తిసుందన్నారు. అయితే భారత్ నుంచి ఎక్కువ సంఖ్యలో హెచ్ -1 బీ వీసా దరఖాస్తులు వస్తుండడంతో ఎక్కువ భారమనిపిస్తోందని పేర్కొన్నారు. గత ఏడాది భారతదేశానికి సంబంధించి 1.1 మిలియన్ల వీసాలను జారీ చేశామన్నారు. అలాగే ఇప్పటివరకు అత్యధిక సంఖ్యలో 80,000 విద్యార్థి వీసాలు విడుదల చేసినట్టు అధికారి చెప్పారు.
కాగా ప్రత్యేకించిన నైపుణ్యం వృత్తులు విదేశీ కార్మికులు పని చేయడానికి అనుమతించే వలసేతర వీసా ఫీజును డిసెంబర్ 2015 లో రూ.270441 (నాలుగువేల డాలర్లు) నిర్ణయించింది. ఈ పెంపు పదేండ్ల (సెప్టెంబర్ 2025) వరకు అమలులో ఉంటుందని ప్రకటించడం ఐటి పరిశ్రమలో కలకలం రేపింది. హెచ్1బీ, ఎల్ 1 వీసాలపై ప్రత్యేక రుసుమును రెట్టింపు చేయడంతో దేశీయ సాఫ్ట్‌వేర్ కంపెనీలపై కోట్ల మేర భారం పడనుందని ఐటీ నిపుణులు ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.