కార్డుల సర్చార్జ్ పై ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ: డెబిట్ క్రెడిట్ కార్డు చెల్లింపులకు వ్యతిరేకంగా దాఖలపైన పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు స్పందించింది. దీనిపై పూర్తి వివరాలు సమర్పించాలంటూ కేంద్రాన్ని,ఆర్‌బిఐలకు ఆదేశించింది. ఆగస్టు 19లోగా సమాధానం చెప్పాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖను, కేంద్ర బ్యాంకును కోరింది. దీనిపై పూర్తి మార్గదర్శకాలతో కూడిన అఫిడవిట్ దాఖలు చేయాలంటూ తదుపరి విచారణను వాయిదా వేసింది.
డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా జరిగే లావాదేవీలపై సర్ చార్జ్ విధించడాన్ని సవాలు చేస్తూ అమిత సాహ్ని అనే లాయర్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. దీనిపై మార్గదర్శకాలను రూపొందించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. నగదు లావాదేవీలను మినహాయించి కేవలం డెబిట్, క్రెడిట్ కార్డు లావాదేవీలపై సర్ చార్జ్ విధించడం అక్రమమని వాదించారు. ఈ చర్య దేశంలో నల్లధనం చలామణిని ప్రోత్సహించేలా ఉందని పిటిషనర్ ఆరోపించారు. 2.5 శాతం చెల్లింపు లేదా అంతకంటే ఎక్కువగా సర్ ఛార్జి విధించడం వలన అక్రమ, అసమాన లావాదేవీలు దేశవ్యాప్తంగా పెరుగుతాయని పేర్కొన్నారు. ప్రధాన న్యాయమూర్తి జి రోహిణి, జస్టిస్ జయంత నాథ్‌తో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది.