హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కూడా వడ్డీరేట్లకు కోత
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కూడా వడ్డీరేట్లకు కోత
Published Thu, Aug 17 2017 2:28 PM | Last Updated on Sun, Sep 17 2017 5:38 PM
న్యూఢిల్లీ : దేశంలో రెండో అతిపెద్ద ప్రైవేట్ రంగ లెండర్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కూడా సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్ల వడ్డీరేట్లకు కోత పెట్టింది. రూ.50 లక్షల కంటే తక్కువ అకౌంట్ బ్యాలెన్స్ ఉన్న డిపాజిట్లపై ఇక వార్షికంగా 3.5 శాతం మాత్రమే వడ్డీరేటు చెల్లించనునన్నట్టు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు పేర్కొంది. ఈ వడ్డీ రేటు అంతకముందు 4 శాతంగా ఉండేది. రూ.50 లక్షలు, అంతకంటే ఎక్కువున్న మొత్తాలపై వడ్డీరేటు 4 శాతాన్ని అలానే కొనసాగించనున్నట్టు తెలిపింది. సమీక్షించిన ఈ రేట్లు రెసిడెంట్, నాన్-రెసిడెంట్ ప్రాంత కస్టమర్లందరకూ వర్తిస్తుందని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఓ ప్రకటనలో చెప్పింది. 2017 ఆగస్టు 19 నుంచి ఈ కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయి.
నికర వడ్డీ ఆదాయాలను పెంచుకోవడానికి బ్యాంకులు వరుస బెట్టి సేవింగ్స్ అకౌంట్ వడ్డీరేట్లకు కోత పెడుతున్న సంగతి తెలిసిందే. తొలుత స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఈ వడ్డీరేట్ల కోత ప్రకటన విడుదల చేసింది. అనంతరం యాక్సిస్ బ్యాంకు, కర్నాటక బ్యాంకు, బ్యాంకు ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంకు, యస్ బ్యాంకులు కొన్ని సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్లపై వడ్డీరేట్లను తగ్గించాయి. కమర్షియల్ బ్యాంకులు సేవింగ్స్ బ్యాంకు రేట్లలో కోతను ప్రారంభించడం, వాటి మధ్య కొత్త తరహాలో పోటీని తెరతీస్తుందని క్రెడిట్ రేటింగ్ సంస్థ ఇండియా రేటింగ్స్ చెప్పింది.
Advertisement
Advertisement