హెచ్‌డీఎఫ్‌సీ షేర్ల ద్వయం జోరుగా లాభపడటంతో పాటు అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా ఉండటం కూడా కలసిరావడంతో గురువారం స్టాక్ సూచీలు చెలరేగిపోయాయి. బ్యాంకింగ్, ఆర్థిక, ఎనర్జీ షేర్లలో జోరుగా కొనుగోళ్లు జరగడంతో సెన్సెక్స్ 35,300 పాయింట్లు, నిఫ్టీ 10,700 పాయింట్ల పైకి ఎగబాకాయి. మే సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగింపు కారణంగా షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు చోటు చేసుకోవడం, మార్కెట్ ముగిసిన తర్వాత వెలువడే జీడీపీ గణాంకాలు ఆశావహంగా ఉంటాయనే అంచనాల కారణంగా సెన్సెక్స్, నిఫ్టీలు దూసుకుపోయాయి. ఇటలీలో రాజకీయ అనిశ్చితి తాత్కాలికంగా సద్దుమణగడం, ముడి చమురు ధరలు చల్లబడటం సానుకూల ప్రభావం చూపించాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 416 పాయింట్ల లాభంతో 35,322 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 122 పాయింట్ల లాభంతో 10,736 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్‌కు ఇది రెండు వారాల గరిష్ట స్థాయి. ఈ ఏడాది ఏప్రిల్ 5 తర్వాత సెన్సెక్స్ ఒక్క రోజులో ఇన్ని ఎక్కువ పాయింట్లు లాభపడటం ఇదే మొదటిసారి.
రోజంతా లాభాలే....
సానుకూల విదేశీ సంకేతాల దన్నుతో సెన్సెక్స్ 35,084 వద్ద లాభాల్లో ఆరంభమైంది. కొనుగోళ్ల జోరుతో రోజంతా లాభాల్లోనే ట్రేడ్ అయింది. 510 పాయింట్ల లాభంతో ఇంట్రాడేలో 35,416 పాయింట్ల వద్ద ఇంట్రాడేలో గరిష్ట స్థాయిని తాకింది. ఇక నిఫ్టీ ఇంట్రాడేలో 149 పాయింట్ల వరకూ లాభపడింది. సానుకూల అంతర్జాతీయ సంకేతాలు, బ్యారెల్ బ్రెంట్ చమురు ధర 80 డాలర్ల నుంచి 76 డాలర్లకు దిగి రావడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ మెరుగుపడిందని, దీంతో మార్కెట్ దూసుకుపోయిందని జియోజిత్ ఫైనాన్షియల్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. నిఫ్టీ 10,800 పాయింట్ల స్థాయిని పరీక్షించవంచే అవకాశాలు ఉన్నాయని రెలిగేర్ బ్రోకింగ్ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ పేర్కొన్నారు.
మరిన్ని విశేషాలు...
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌తో పాటు పలు షేర్లు ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఇండస్‌ఇండ్ బ్యాంక్, అవెన్యూ సూపర్ మార్ట్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, బ్రిటానియా ఇండస్ట్రీస్, గోద్రేజ్ కన్సూమర్, హాట్సన్ ఆగ్రో, హిందుస్తాన్ యూనిలివర్, వరుణ్ బేవరేజేస్, తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.
►మరోవైపు టీసీఎస్, టాటా మోటార్స్, వివిమెడ్ ల్యాబ్స్, రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ షేర్లు తాజా ఏడాది కనిష్ట స్థాయికి పడిపోయాయి.
►గత నాలుగేళ్లలోనే అత్యధిక లాభాన్ని గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో ఓఎన్‌జీసీ సాధించడంతో ఈ షేర్ 2 శాతం ఎగబాకింది.
►మన్‌పసంద్ బేవరేజేస్ షేర్ వరుసగా నాలుగో రోజూ 10 శాతం లోయర్ సర్క్యూట్‌ను తాకింది. ఈ కంపెనీ ఆడిట్ సంస్థ రాజీనామా చేయడంతో ఈ షేర్ వరుసగా ఏడు సెషన్లలో నష్టపోతూ వస్తోంది. ఈ ఏడు రోజుల్లో ఈ షేర్ దాదాపు సగం పతనమైంది.
►కోల్ ఇండియా టార్గెట్ ధరలను బ్రోకరేజ్ సంస్థలు పెంచడంతో ఈ షేర్ 2 శాతం లాభంతో రూ. వద్ద ముగిసింది.
►1:1 బోనస్‌కు జూన్ 7ను రికార్డ్ డేట్‌గా నిర్ణయించిన నేపథ్యంలో గృహ్ ఫైనాన్స్ షేర్ 5 శాతం లాభంతో రూ.736 వద్ద ఇంట్రాడేలో ఆల్‌టైమ్ హైని తాకింది.
సూచీల పరుగుకు ప్రధాన కారణాలు..
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎఫ్‌ఐఐ ట్రేడింగ్ విండో.. ఈ బ్యాంక్‌లో విదేశీ ఇన్వెస్టర్లు వాటా పెంచుకోవడానికి ఎఫ్‌ఐఐ ట్రేడింగ్ విండో నేడు(శుక్రవారం) జరగనున్నది. ఏదైనా షేర్‌లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడి పరిమితికి మించినప్పుడు ఈ ఎఫ్‌ఐఐ ట్రేడింగ్ విండోను అనుమతిస్తారు. జూలై 1 నుంచి ఈ ఎఫ్‌ఐఐ ట్రేడింగ్ విండోను సెబీ రద్దు చేస్తోంది. ఈ ట్రేడింగ్ విండోలో లావాదేవీలు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల మధ్యనే జరుగుతాయి కాబట్టి విదేశీ పోర్ట్‌ఫోలియో హోల్డింగ్‌లో ఎలాంటి మార్పు ఉండదు. ఈ విండో జూలై 1 నుంచి రద్దు కానుండటంతో విదేశీ ఇన్వెస్టర్ల ఫేవరేట్ స్టాక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో తమ వాటా పెంచుకోవడానికి విదేశీ ఇన్వెస్టర్లకు ఇది మంచి అవకాశమని, కనీసం వంద కోట్ల డాలర్ల విలువైన లావాదేవీలు చోటు చేసుకుంటాయని, షేర్ ధర 4–5 శాతం రేంజ్‌లో పెరిగే అవకాశాలున్నాయని మాక్వైరీ సంస్థ అంచనా వేస్తోంది. (అయితే నేటి ట్రేడింగ్ చివర్లో ఈ షేర్‌లో లాభాల స్వీకరణ చోటు చేసుకునే అవకాశాలూ ఉన్నాయని కొంతమంది నిపుణులంటున్నారు). ఈ నేపథ్యంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఇంట్రాడేలో ఆల్ టైమ్ హై, రూ.2,150ను తాకింది. చివరకు 4 శాతం లాభంతో రూ.2,136 వద్ద ముగిసింది. బ్యాంక్ మార్కెట్ క్యాప్ రూ.23,577 కోట్లు పెరిగి రూ.5,54,753 కోట్లకు పెరిగింది. ఒక నెల రోజుల్లోనే ఈ షేర్ 8 శాతం ఎగసింది. సోదర సంస్థ, హెచ్‌డీఎఫ్‌సీ షేర్ 2 శాతం లాభంతో రూ.1,828 వద్ద ముగిసింది. ఈ రెండు షేర్ల లాభాలు సెన్సెక్స్ లాభాల్లో దాదాపు 200 పాయింట్ల వరకూ ఉంటాయని అంచనా.
సానుకూల అంతర్జాతీయ సంకేతాలు..
1. చైనా ఆర్థిక గణాంకాలు అంచనాలు మించాయి.
2. అమెరికా, ఉత్తర కొరియా దేశాధినేతల మధ్య సమావేశానికి చర్చల్లో పురోగతి చోటు చేసుకుంది.
3. ఇటలీలో రాజకీయ అనిశ్చితికి తాత్కాలిక తెర. యూరప్ మార్కెట్లు లాభాల్లో మొదలయ్యాయి.
4. అమెరికాలో చమురు నిల్వలు పెరగడం, ఒపెక్, ఇతర దేశాల నుంచి కూడా సరఫరాలు పెరిగే అవకాశాలున్నాయన్న అంచనాలతో ముడి చమురు ధరలు పతనమయ్యాయి... ఈ సానుకూల అంతర్జాతీయ సంకేతాలు మన మార్కెట్లో కొనుగోళ్ల జోరును పెంచాయి.
షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు...
మే సిరీస్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్టులు గురువారం ముగియనుండటంతో పెండింగ్ షార్ట్ పొజిషన్ల కవరింగ్ కొనుగోళ్లు జరగడం కూడా ఈ భారీ లాభాలకు ఒక కారణం.
ఆశావహ అంచనాలు...
నైరుతి రుతు పవనాలు సకాలంలోనే వస్తున్నాయని, ఈ సారి వర్షాలు విస్తారంగా కురుస్తాయని వాతావరణ శాఖ అంచనాలను వెలువరించడం, గురువారం మార్కెట్ ముగిశాక వెలువడే జీడీపీ గణాంకాలు బాగా ఉంటాయనే ఆశావహ అంచనాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment