ఆరోగ్యానికి బీమా భరోసా.. | Health Policy For Future Health And Hospital Schemes | Sakshi
Sakshi News home page

ఆరోగ్యానికి బీమా భరోసా..

Published Mon, Nov 26 2018 12:07 PM | Last Updated on Mon, Nov 26 2018 12:07 PM

Health Policy For Future Health And Hospital Schemes - Sakshi

సమగ్రమైన హెల్త్‌ పాలసీతో పలు ప్రయోజనాలు ఉన్నప్పటికీ .. క్యాన్సర్, మూత్రపిండ సమస్యల వంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలు, ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడి సుదీర్ఘకాలం పాటు ఆస్పత్రిలో చికిత్స పొందాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు వీటి నుంచి పూర్తి స్థాయిలో ఉపశమనం లభించేది కొంత తక్కువే. ఇక పేషెంట్‌కు అనువైన హాస్పిటల్‌లో క్యాష్‌లెస్‌ ఫీచర్‌ గానీ లేకపోతే .. క్లెయిమ్‌ వేళ ఎంత కోత విధిస్తారు .. ఎంత ఇస్తారో అన్న అనిశ్చితి నెలకొంటుంది. వీటికి తోడు సబ్‌–లిమిట్స్, కో–పే వంటి నిబంధనలేమైనా ఉంటే.. పాలసీదారుకు క్లెయిమ్‌లో మరింత కోత పడే అవకాశముంది. అప్పటికే ఒకవైపు అనారోగ్యం, మరోవైపు హాస్పిటల్‌ బిల్లులతో సతమతమవుతున్న పాలసీదారుకు ఇది మరింత సమస్యాత్మకంగా మారుతుంది. ఈ నేపథ్యంలోనే ఆరోగ్య బీమా సంస్థలు కొన్ని తీవ్ర అనారోగ్య సమస్యల చికిత్సకు పూర్తి స్థాయిలో ఉపయోగపడేలా ప్రత్యేక పాలసీలు అందిస్తున్నాయి. 

క్రిటికల్‌ ఇల్‌నెస్‌ కవర్‌..
పేరుకు తగ్గట్టుగా పక్షవాతం, గుండె పోటు, మూత్రపిండాల సమస్యలు, క్యాన్సర్‌ మొదలైన తీవ్ర అనారోగ్య సమస్యల చికిత్స వ్యయాలను ఎదుర్కొనేందుకు క్రిటికల్‌ ఇల్‌నెస్‌ కవర్స్‌ తోడ్పడతాయి. ఇవి పూర్తిగా నిర్దిష్ట అనారోగ్య సమస్యలకోసం మాత్రమే ఉద్దేశించినవి కావడం వల్ల.. అలాంటి వాటి బారిన పడినప్పుడు పాలసీ మొత్తాన్ని క్లెయిమ్‌ చేసుకునే వీలుంటుంది. ఒకవేళ అప్పటికే వేరే రెగ్యులర్‌ పాలసీ కింద చికిత్స వ్యయాలను క్లెయిమ్‌ చేసుకున్నా కూడా.. ఈ క్రిటికల్‌ ఇల్‌నెస్‌ కవర్‌ క్లెయిమ్‌ కూడా పొందవచ్చు. పూర్తి స్థాయిలో కోలుకునే దాకా ఆదాయ నష్టాలను భర్తీ చేసుకునేందుకు ఈ మొత్తాన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ తరహా పాలసీలను తీసుకునేటప్పుడు సాధ్యమైనంత విస్తృతంగా వ్యాధులకు కవరేజీ ఉండేలా చూసుకుంటే మంచిది.  

ప్రత్యేక క్యాన్సర్‌ ప్లాన్స్‌ ..
క్యాన్సర్‌  వ్యాధితో పాటు చికిత్స వ్యయాలు కూడా భయం గొలిపేవిగానే ఉంటాయి. అందుకే క్యాన్సర్‌ చికిత్స వ్యయాల కోసం ఉపయోగపడేలా ప్రత్యేక పాలసీలను అందుబాటులోకి తెచ్చాయి హెల్త్‌ ఇన్సూరెన్స్‌ సంస్థలు. అయితే, వీటిని తీసుకునేటప్పుడు కొన్ని అంశాలు గుర్తుంచుకోవాలి. ప్రారంభ దశలోని క్యాన్సర్‌ చికిత్సకు కొన్ని సంస్థలు .. మొత్తం సమ్‌ అష్యూర్డ్‌లో 25 శాతం మాత్రమే ఇచ్చేవి ఉన్నాయి. అలాగే, 150 శాతం దాకా ఏకమొత్తంగా చెల్లించేవీ ఉన్నాయి. కనుక ఆయా సంస్థల పాలసీలను పరిశీలించి చూసుకోవాలి. ఇక, ఒక్కసారి క్లెయిమ్‌ మొత్తాన్ని చెల్లించేసిన తర్వాత కూడా పాలసీ ముగిసిపోతుందా.. ఆ తర్వాత కూడా కొనసాగించుకోవచ్చా అన్నదీ తెలుసుకోవాలి. కొన్ని రకాల క్యాన్సర్స్‌ తిరగబెట్టే అవకాశం ఉంది కాబట్టి.. పాలసీ వ్యవధి సుదీర్ఘకాలం ఉండేలా చూసుకోవడం మంచిది.

వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీలు..: ప్రమాదాల బారిన పడినా, అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరినా.. సాధారణ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీల్లో ఎలాగూ హాస్పిటలైజేషన్‌కు కవరేజి ఉంటుంది కదా.. మళ్లీ ప్రత్యేకంగా వ్యక్తిగత ప్రమాద బీమా తీసుకోవాల్సిన అవసరం ఏముంటుంది అన్న ప్రశ్న తలెత్తవచ్చు.పెట్టే ఖర్చుతో పోలిస్తే అత్యధిక ప్రయోజనాలివ్వగలగటమే వీటి ప్రత్యేకత. తక్కువ ప్రీమియంతో అత్యధిక కవరేజీనిస్తాయి. ప్రమాదవశాత్తూ మృత్యువాత పడినా, ప్రమాదాల్లో పాక్షికంగా లేదా పూర్తిగా అంగవైకల్యానికి గురైనా ఈ పాలసీల ద్వారా కవరేజీ ఉంటుంది. చికిత్సా కాలంలో ఉద్యోగానికి హాజరు కాలేక నష్టపోయిన ఆదాయాన్ని భర్తీ చేస్తాయి (పాలసీలో పేర్కొన్న పరిమితులకు లోబడి). ఏ ఇన్సూరెన్స్‌ పాలసీ తీసుకున్నా ప్రత్యేకంగా .. మినహాయింపులేమేం ఉన్నాయో కచ్చితంగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. పాక్షిక అంగవైకల్యం సంభవించినప్పుడు ఆదాయ నష్టాలను కొన్ని వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీలు భర్తీ చేయవు. అంతే కాకుండా పాలసీలకు కొన్ని సబ్‌–లిమిట్స్‌ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా క్షుణ్నంగా తెలుసుకున్న తర్వాతే పాలసీ తీసుకోవడం శ్రేయస్కరం.

పరిమితులూ ఉంటాయి..
నిర్దిష్ట సందర్భాల్లో సాధారణ పాలసీలకు మించి ఈ తరహా పాలసీలు ప్రయోజనాలు అందిస్తాయనడంలో సందేహం లేదు. అయితే, ఇవి అన్ని ఆరోగ్య సమస్యలకు కవరేజీనిచ్చే సమగ్రమైన పాలసీలు కావన్నది గుర్తుంచుకోవాలి. సాధారణ పాలసీని జీవితకాలంపాటు రెన్యూవల్‌ చేసుకోవచ్చు. కానీ ఈ తరహా ప్రత్యేక పాలసీల కాలవ్యవధి ఆయా అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు క్లెయిమ్‌ చెల్లింపుల తర్వాత ముగిసిపోయే అవకాశం ఉంది. కాబ ట్టి ఇలాంటి పాలసీలను సాధారణ పథకానికి అదనంగా, మరింత రక్షణ కోసం తీసుకోవడం మాత్రమేనని గుర్తుంచుకోవాలి. నిర్దిష్ట సందర్భాల్లో సాధారణ పాలసీ అందించే కవరేజీకి అదనంగా ప్రయోజనాలు పొందేందుకే ఇవి ఉపయోగపడతాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement