భార్యను 120 కిలోమీటర్లు సైకిల్‌పై తీసుకెళ్లినా..  | Man Took His Wife On Bicycle To Hospital 120 Kilometers Away | Sakshi
Sakshi News home page

భార్యను 120 కిలోమీటర్లు సైకిల్‌పై తీసుకెళ్లినా.. 

Published Tue, Aug 25 2020 6:43 AM | Last Updated on Tue, Aug 25 2020 9:49 AM

Man Took His Wife On Bicycle To Hospital 120 Kilometers Away - Sakshi

సైకిల్‌పై భార్యతో అరివళగన్‌ (ఫైల్‌) 

సాక్షి ప్రతినిధి, చెన్నై: పేదవాడైతేనేం ఆయనకు పెద్ద మనసు ఉంది. క్యాన్సర్‌ రోగం నుంచి భార్యను కాపాడుకోవాలన్న తపన వృద్ధాప్యాన్ని కూడా మరిచిపోయేలా చేసింది. లాక్‌డౌన్‌ వల్ల బస్సులు లేకపోవడంతో సైకిల్‌పై భార్యను ఎక్కించుకుని 120 కిలోమీటర్ల దూరంలోని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అయినా ఫలితం లేకుండాపోయింది. భార్య ప్రాణాలు హరించింది. భర్తను కన్నీటి కడలిలోకి నెట్టేసింది.  తంజావూరు జిల్లా కుంభకోణం సమీపంలోని మనల్‌మేడుకు చెందిన అరివళగన్‌ (60) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మొదటి భార్య మరణించడంతో మంజుల (44)ను రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి కుమారుడు విష్ణు (12) ఉన్నాడు. మంజుల ఎడమచెంపకు సమీపంలో క్యాన్సర్‌ వ్యాధి సోకినట్లు తొమ్మిది నెలల క్రితం గుర్తించారు.

పుదుచ్చేరి జిప్మర్‌ ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు. మార్చి 24వ తేదీ నుంచి లాక్‌డౌన్‌ ఉండడంతో ఆస్పత్రికి వెళ్లలేకపోయారు. ఈ పరిస్థితిలో భార్య బాధను చూసి తట్టుకోలేకపోయిన అరివళగన్‌ మార్చి 29వ తేదీన పాత సైకిల్‌పై ఆమెను కూర్చోబెట్టుకుని కుంభకోణం నుంచి బయలుదేరాడు. 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుదు చ్చేరిలోని జిప్మర్‌ ఆస్పత్రిలో చేర్పించాడు. తరువాత అంబులెన్స్‌లో ఆమెను తిరిగి స్వగ్రామానికి చేర్చా డు. భార్య ఆరోగ్యం పట్ల అతడు చూపిస్తున్న ప్రేమను గ్రామస్తులు మెచ్చుకుని తోచిన సహాయాన్ని చేశారు. ఇంట్లోనే ఉంటూ మందులు తీసుకుంటున్న మంజుల ఆదివారం రాత్రి మరణించింది. ‘లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కరువైంది, మరోవైపు క్యాన్సర్‌తో భార్య బాధపడుతోంది. ఆస్పత్రికి తీసుకెళదామంటే బస్సులు లేవు. భార్య ను కాపాడుకునేందుకు సైకిల్‌పైనే ఆసుపత్రికి తీసుకెళ్లాను.  నా కష్టం వృథా పోయింది. భార్య ప్రాణా లు నిలబెట్టుకోలేక పోయాను’ అంటూ అరివళగన్‌ కన్నీరుమున్నీరయ్యాడు. మంజుల మరణం గ్రామ ప్రజలను సైతం తీవ్రంగా కలచివేసింది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement