క్యాన్సర్‌ను ఇంట్లోనే చంపేయండి | solve the cancer problem in home | Sakshi
Sakshi News home page

క్యాన్సర్‌ను ఇంట్లోనే చంపేయండి

Published Sun, Jun 14 2015 11:35 PM | Last Updated on Sun, Sep 3 2017 3:45 AM

క్యాన్సర్‌ను ఇంట్లోనే చంపేయండి

క్యాన్సర్‌ను ఇంట్లోనే చంపేయండి

క్యాన్సర్ వస్తే హాస్పిటల్ వరకూ వెళ్లాలి గానీ... అసలు రాకుండా ఉంచడానికి మన ఇల్లే చాలు. మరీ మాట్లాడితే దాన్ని చంపేయడానికి కిచెన్‌లోని కత్తి చాలు. ఆ కత్తితో ఆకుపచ్చటి ఆకుకూరలు కోసి వండటం, కూరగాయలు కట్ చేసి తినడం, మాంసాహారం తినే వేళ వెజిటబుల్ సలాడ్స్‌ను తయారు చేయడం వంటి చాలా తేలిక మార్గాలున్నాయి.  సులువైన ఈ మార్గాలు అవలంబిస్తే చాలు... క్యాన్సర్ ఇంట్లోనే హతమైపోతుంది. పక్కాగా చెప్పాలంటే ఇవి నివారణలన్నమాట. చికిత్స కంటే నివారణ చాలా మంచిదని అంటారు కదా. అలాంటప్పుడు ఇంత తేలికైన మార్గాలున్నప్పుడు అనుసరించడమే మేలు కదా. క్యాన్సర్ నివారణకు సులువైన సూచనలివిగో...!
 
ఇంట్లో సిగరెట్ పొగ వద్దు, బయటా వద్దు
క్యాన్సర్‌కు ప్రధాన కారణాల్లో పొగతాగడం ఒకటి. అది సిగరెట్, బీడీ, చుట్ట... ఇలా ఏ రూపంలోనైనా కావచ్చు. మొదట్లో అసలు పొగాకు దక్షిణ అమెరికాలోని స్థానికులకే పరిమితమై ఉండేది. అక్కడివాళ్లు పొగాకును ఒక ‘దివ్యమైన’ (ఎంథియోజెనిక్) అనుభూతి కోసం వాడుతుండేవాళ్లు. బ్రిటిష్ వాళ్లు దీన్ని తాము పాలించే అన్ని దేశాలకూ వ్యాప్తి చేశారు. మొదట్లో స్టైలిష్‌గా అనిపించే కనిపించే ఈ అలవాటు చాలా ప్రమాదకరమని తెలుసుకున్న తర్వాత అదే పాశ్చాత్యులు దాన్ని వదిలేశారు. దాంతో అక్కడ పొగతాగడం వల్ల తగ్గిన మరణాల రేటు 24 శాతం. అదీ దాదాపు పదిహేనేళ్ల వ్యవధిలో. అంటే నాలుగోవంతు మరణాలు తగ్గాయన్నమాట. ఎందుకంటే పొగలో 4000కు పైగా రసాయనాలున్నాయి. అందులో క్యాన్సర్‌ను కలిగించేవి (కార్సినోజెనిక్) దాదాపు 50కు పైగా ఉన్నాయి. అందుకే పొగతో కలిగే ఎంథియోజెనిక్ అనుభూతి అబద్ధం. కానీ కార్సినోజెనిక్ ప్రమాదం మాత్రం నిజం అన్న వాస్తవం తెలుసుకుంటే చాలు. క్యాన్సర్‌కు మొదటి నివారణ ప్రారంభమైనట్టే.

ఇక పొగ వెలువరించే సిగరెట్, బీడీ, చుట్టల తర్వాత పొగాకును గుట్కా, ఖైనీ, పాన్‌మసాలలా రూపంలో వాడటం అంటే క్యాన్సర్ కలిగించే విషాన్ని నేరుగా నోట్లోకి తీసుకుంటున్నట్టే అని గుర్తుంచుకోండి.

పొగ ఏ రూపంలోనైనా ఆరోగ్యానికి ఎంత హానికరమో తెలిపేందుకు మరో ఉదాహరణ... మాంసాహారానికి మంచి రంగునూ, ఫ్లేవర్‌నూ, రుచినీ కలిగించేందుకు మాంసానికి పొగచూరించే ప్రక్రియ ఉంది. దీన్నే ‘స్మోకింగ్ ద మీట్’ అంటారు. ఇలా స్మోక్ చేసిన మాంసాహారం వల్ల పెద్దపేగు, మలద్వార క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఎంతగానో ఉన్నాయి. అంటే... పొగ ఏ రూపంలో ఉన్నా, ఏ ప్రక్రియ ద్వారా దాన్ని తీసుకున్నా అది క్యాన్సర్‌ను ప్రేరేపిస్తుంది. అంటే పొగకు ఎంత దూరం ఉంటే క్యాన్సర్ నుంచి అంత దూరంలో ఉన్నట్లన్నమాట.

కిచెన్ కత్తితో ఆకుకూరలు కోయండి
పొగాకు క్యాన్సర్‌కు ఎంత దగ్గరి సంబంధం ఉందో... కూరలుగా ఉపయోగించే మిగతా ఆకులకు ఆ వ్యాధితో అంత శత్రుత్వం ఉంది. ఆకుపచ్చగా ఉండే ఏ ఆకుకూరలలోనైనా క్యాన్సర్‌తో పోరాడగల పోషకాలూ, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. అందుకే పొగ... ఆకును దూరం చేసుకోండి. మిగతా ఆకులను కూరల రూపంలో దగ్గరకు తీసుకోండి. రుచి కోసం తప్పనిసరిగా మాంసాహారం తీసుకోవాలనే కోరిక ఉన్నవారు, చిహ్వచాపల్యాన్ని అణచుకోకుండా ప్రతి నాన్‌వెజ్ ముక్కతో పాటు, ఉడికించిన ఆకుకూరల సలాడ్స్‌ను తీసుకుంటే ఆ మాంసాహారపు ప్రమాదాలను ఈ ఆకుకూరల సలాడ్లు నివారిస్తూ ఉంటాయి.

క్యాన్సర్ నివారణ- చాక్లెట్ లాంటి సూచన
కోకో పాళ్లు ఎక్కువగా ఉండే ‘డార్క్ చాక్లెట్లు’ క్యాన్సర్‌ను నివారిస్తాయి. ఎందుకంటే కోకోలో ‘పెంటామెర్’ అనే ఫ్లేవనాయిడ్ ఉంది. దీనికి క్యాన్సర్‌తో పోరాడే గుణం ఉంది. అందుకే అప్పుడప్పుడూ ‘డార్క్ చాక్లెట్లు’ తింటూ ఉండండి. అలాగని అదేపనిగా తింటే దీని దుష్పరిణామాలు మళ్లీ మరోరూపంలో అంటే స్థూలకాయాన్ని పెంచడం ద్వారా పరోక్షంగా క్యాన్సర్‌కు దోహదపడటం రూపంలో కనిపించవచ్చన్నమాట.

ఆ తీపి మేలు... ఈ తీపి చేదు : ముందు అనుకున్నట్లు డార్క్ చాక్లెట్ల తీపి క్యాన్సర్‌ను నివారిస్తుంది కదా. అలాగే చక్కెర పాళ్లు ఎక్కువగా ఉండే ఆహారం ఆరోగ్యానికి అంత మేలు కాదు. ఈ తీపి పదార్థాలు నేరుగా క్యాన్సర్‌ను కలిగించకపోయినా, బరువు పెంచడానికి తీపి పదార్థాలు దోహదం చేస్తుంటాయి. తీపితో చాలా వేగంగా బరువు పెరిగిపోతారు. అది చాలా రకాల క్యాన్సర్‌లకు రిస్క్ ఫ్యాక్టర్. అందుకే తీపిని ఒక రుచి కోసం చాలా పరిమితంగా మాత్రమే వాడుకోండి. చక్కెర ఎక్కువైతే మొహం మొత్తినట్లుగా... తీపి ఎక్కువైతే అది చేదు అనిపిస్తుంది. చేటు చేస్తుందని గుర్తుంచుకోండి.

పోషకాహారం... క్యాన్సర్ వినాశకాహారం
మంచి పోషకాహారం తీసుకోవడం క్యాన్సర్‌కు వినాశకరం. పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న కూరగాయలు ఆరోగ్యానికీ మేలు చేస్తాయి. అవి  క్యాన్సర్ నుంచి కూడా కాపాడతాయి. ఉదాహరణకు టొమాటోలోని లైకోపిన్ అనే పోషకం క్యాన్సర్‌తో పోరాడుతుంది. అలాగే బీటా కెరోటిన్ ఎక్కువగా ఉంటే క్యారట్ కూడా క్యాన్సర్‌తో మరింత శక్తిమంతంగా ఎదుర్కొంటుంది. అంందుకే ఆరోగ్యకరమైన పోషకాలు ఉండే తాజా ఆహారాలు క్యాన్సర్‌ను నివారిస్తాయి.

ఆ ఆహారం బెస్ట్... ఈ ఆహారం వేస్ట్
ప్రాసెస్ చేసి నిల్వ ఉంచిన ఆహారాలు, కృత్రిమ రసాయనాలు కలిపి, ఎక్కువ కాలం నిల్వ ఉండేలా చేసే జంక్‌ఫుడ్ లాంటి ఆహారాలు క్యాన్సర్‌ను కలిగించే అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే ఇందులోని కృత్రిమ రసాయనాలకు మన హార్మోన్లను ఉత్తేజితం చేసే గుణం. ఏదైనా సాధారణం కంటే ఎక్కువ ఉత్తేజితం అవుతున్నప్పుడు క్యాన్సర్ కణం పుట్టే అవకాశాలు ఎక్కువ. అందుకే ఆహారాల్లో పోషకాహారం ఎంత మంచిదో, ప్రాసెస్‌డ్ ఆహారాలు అంత హానికరమని గుర్తుంచుకోండి.

వ్యాయామం చేయండి... క్యాన్సర్ నుంచి దూరంగా ఉండండి : మనం రోజూ  నడుస్తున్నామంటే క్యాన్సర్ నుంచి దూరంగా నడుస్తున్నామని అర్థం. ఒక మనం రోజూ జాగింగ్ చేస్తున్నామంటే... క్యాన్సర్ నుంచి దూరంగా పరుగు తీస్తున్నామన్నమాట. శరీరానికి కదలికలు లేకుండా ఉంచడం వల్ల కొవ్వులు పేరుకుపోయి బరువు పెరుగుతుంది. ఇది క్యాన్సర్‌కు పరోక్ష కారణం అన్న సంగతి తెలిసిందే కదా. అందుకే మనలో కొవ్వులను తగ్గించడంతో పాటు, క్యాన్సర్‌తో పోరాడే వ్యాధి నిరోధక శక్తిని మనలో పెంచుకుంటున్నామని అర్థం. క్యాన్సర్‌తో పోరాడే శక్తిని పుంజుకుంటున్నామని అర్థం. అందుకే రోజూ క్రమం తప్పకుండా కనీసం అరగంట పాటైనా నడక, మెల్లగా పరుగు, ఈత లాంటి తేలికపాటి వ్యాయామాలు చేయాలి.

మీరూ నిద్రపోండి...
క్యాన్సర్‌నూ నిద్రపుచ్చండి :
వేళకు పడుకుని ఒకేవేళకు లేచే మంచి అలవాటుతో పాటు కంటి నిండా నిద్రపోవడం క్యాన్సర్‌నూ నిద్రపుచ్చుతుంది. ఎందుకంటే కంటినిండా నిద్రపోయినప్పుడు మనలో రకరకాల ఎంజైములనూ, హార్మోన్లనూ స్రవింపజేసే ‘ఎండోక్రైన్’ వ్యవస్థ ఆరోగ్యంగా పనిచేస్తుంది. క్రమబద్ధంగా పనిచేస్తుంది. అదే కంటినిండా నిద్రలేకపోతే అది హార్మోన్ల స్రావాన్ని అస్తవ్యస్తం చేస్తుంది. దాంతో కొన్ని హార్మోన్లు ఉత్తేజితమై అధికంగానైనా పనిచేయవచ్చు లేదా తగ్గనైనా తగ్గవచ్చు. దీంట్లో ఏది జరిగినా వ్యాధి నిరోధక శక్తి తగ్గి క్యాన్సర్ నిద్రలేవచ్చు. కాబట్టి క్యాన్సర్‌ను నిద్రపుచ్చడానికైనా కనీసం ఏడుగంటల పాటు మనం కంటినిండా నిద్రపోవాలి.

ఇందులో పాటించడానికి ఏదీ కష్టమైన అంశం కాదు. అన్నీ ఇంట్లోనే అనుసరించదగిన సూచనలే. కాబట్టి క్యాన్సర్ నివారణ ఎంత సులువో తెలుసుకోండి. క్యాన్సర్‌ను తేలిగ్గా తీసుకోకండి. కానీ దాని నివారణ కోసం అందుబాటులో ఉన్న తేలిక మార్గాలను మాత్రం అనుసరించండి.

డాక్టర్ పి. విజయానంద్ రెడ్డి
డెరైక్టర్, అపోలో క్యాన్సర్ హాస్పిటల్,
అపోలో హెల్త్ సిటీ, జూబ్లీ హిల్స్, హైదరాబాద్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement