అనిత వర్సెస్ అనిత | Anita Versace Anita | Sakshi
Sakshi News home page

అనిత వర్సెస్ అనిత

Published Mon, Nov 7 2016 11:19 PM | Last Updated on Mon, Sep 4 2017 7:28 PM

అనిత వర్సెస్ అనిత

అనిత వర్సెస్ అనిత

అనితకు క్యాన్సర్.
మనసును దహించేస్తున్న క్యాన్సర్!
నాన్నను, స్నేహితురాలిని  దహించిన క్యాన్సరే తనను కూడా దహిస్తోంది.
క్యాన్సర్ దేహానికి కాదు... జ్ఞాపకానికి అని అర్థం చేసుకుంది.
అనితను అనిత ఛాలెంజ్ చేసింది అనితకు అనిత ధైర్యం చెప్పింది.
అనితను అనితే బతికించుకుంది!

ఆఫీసులో ఉన్న డానీ మోర్జానీకి ఆసుపత్రి నుంచి ఫోన్ వచ్చింది ఉన్న పళంగా రమ్మని. ఆఘమేఘాల మీద ఆసుపత్రికి చేరుకున్నాడు. అత్త, బావమరిది అక్కడే ఉన్నారు. ‘వారం రోజులుగా ఆసుపత్రిలోనే ఉంటున్నారు. ‘ఈ రోజు మేం ఉంటాం మీరు ఫ్రెష్ అయి ఏమైనా పనులు ఉంటే చూసుకొని రండి’ అని వారు అంటే పొద్దున్నే బయల్దేరాడు ఇంటికి. ఆఫీసులో కొన్ని ముఖ్యమైన పనులుంటే అవి చూసుకొని, ఆసుపత్రికి వచ్చేద్దామని వెళ్లాడు. కానీ, ఇంతలో ఫోన్. ఏ నిమిషానికి ఏం న్యూస్ వినాల్సివస్తుందో అని భయంగా ఉంది అతనికి. ఐసియూకెళ్లాడు. వెంటిలేటర్ మీదున్న ఆమెనే చూస్తున్నాడు.

‘అనిత తనతో జీవితం పంచుకొని ఇరవై ఏళ్లకు పైనే అయ్యింది. పిల్లల్లేకపోయినా ఒకరికొకరం ఉన్నామనుకుంటూ ఇన్నాళ్లూ అన్యోన్యంగా జీవించాం. ఇప్పుడు క్యాన్సర్ కారణంగా తను నాకు దూరం కాబోతుంది. నిజంగానే తను నన్ను వదిలేసి వెళ్ళిపోతుందా? నేను ఒంటరివాడినైపోతానా?’ ఏదో తెలియని బెంగ అతని మనస్సంతా ఆవరించింది. చెమగిల్లిన కళ్లను తుడుచుకుంటుండగా డాక్టర్ వచ్చారు. ఇద్దరూ బయటకు నడిచారు. ‘సారీ డానీ! ఆమె అంతర్గత అవయవాలన్నీ దాదాపుగా పనిచేయడం లేదు. ఇంకో 24 గంటలు మాత్రమే బతికే అవకాశం ఉంది. ఆమెకిది లాస్ట్ స్టేజ్...’ డాక్టర్ చెబుతున్న ఆ మాటలకు అనిత ఉలిక్కిపడింది. భర్త కళ్లనీళ్లతో ఉండటం స్పష్టంగా కనిపిస్తోంది. ‘తను ఇంత బాగా తిరుగుతుంటే ఈ డాక్టర్ లాస్ట్ స్టేజ్ అంటాడేండి?’ అనుకుంటూ భర్తను పిలిచింది. అతను తన మాట వినడం లేదు. అర్థం కాక తలతిప్పి చూసింది. ఐసీయూ బెడ్ మీద తన శరీరం. బయట... తను. అక్కడికి ఇక్కడికి కనీసం 40 అడుగుల దూరం. అనిత ఆశ్చర్యపోయింది. అంటే..., తను చనిపోయిందా?! అలా అయితే ఈ నేనెవరిని?!!

మరణం మిగిల్చిన అనుభవం
అనితకు ఒక్కసారిగా తను పడిన కష్టం అంతా గుర్తుకువచ్చింది. నాలుగేళ్ల క్రితం తనకు లింఫోమా క్యాన్సర్ అని మెడ దగ్గర ఉన్న గ్రంధులలో సమస్య అని వైద్యులు నిర్ధరించారు. ‘మొదటి నుంచీ ఈ సంప్రదాయవైద్యం నాకు అంతగా నచ్చేది కాదు. ఎందుకంటే ఎంతోమంది క్యాన్సర్ బాధితులు చనిపోవడం కళ్లారా చూశాను. అందులో నా తండ్రి, నా బెస్ట్ ఫ్రెండ్ కూడా ఉన్నారు. వీళ్లంతా డాక్టర్లు చెప్పిన సూచనలు పాటించినవారే. చికిత్సలు చేయించుకున్నవారే. కానీ, చనిపోయారు. వారిలాగే నేనూ చనిపోతానా! అప్పుడు ఈ ఇల్లు, ఉద్యోగం, భర్త, ఈ ప్రపంచం ఏదీ నాకు ఉండదా? తెలియని దిగులు ఆవరించేది. ఏమవుతుందో అని రోజూ ఆందోళన. ఇలాంటి ఆలోచనలతోనే నాలుగేళ్లు గడిచాయి. శరీరం లోపల నిమ్మకాయ పరిమాణంలో ఉన్న గడ్డలు మెడ పై భాగం నుంచి పొత్తికడుపు వరకు వచ్చేశాయి. ఏమీ తినలేకపోయేదాన్ని. ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరిపోయేది. శ్వాస తీసుకోవడానికి కష్టమయ్యేది.  కండరాలు విపరీతమైన నొప్పి.. వీటన్నింటి నుంచి నాకు విముక్తి లభిస్తుందా? నా కళ్లు మాత్రమే మూసి ఉన్నాయి. కానీ, అన్నీ కనిపిస్తున్నాయి. నా భర్త విపరీతమైన ఆందోళన పడుతున్నాడు. ఆసుపత్రి బెడ్ మీద నా శరీరం ఎలా ఉందో స్పష్టంగా తెలుస్తోంది. ఇక్కడితో ఈ ఫిజికల్ లైఫ్ పూర్తవుతుంది. మరి ఆ తర్వాత... నా ఆలోచనా విస్తృతి పెరుగుతోంది. నేను నన్ను నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను.’

తిరిగి వచ్చిన వైనం...
మూడు రోజుల తర్వాత ఆసుపత్రి ఐసియూ దగ్గర హడావిడిగా ఉంది. డాక్టర్లు వచ్చి అనితను పరీక్షిస్తున్నారు. అనిత బెడ్ మీద నుంచి లేచి కూర్చుంది. కోమా నుంచి బయటకు వచ్చిన ఆమెను అక్కడి వైద్యబృందం విస్తుపోయి చూసింది. ఆమె లేచి నిలబడటం చూసిన భర్త డానీ ఆశ్చర్యపోయాడు. ఆమె జరిగిందంతా చెబుతూ ఉంటే అందరూ విచిత్రంగా చూశారు. ‘‘డానీ.. నేను కోమాలో ఉన్నప్పుడు ఏం జరిగిందో తెలుసా! నా శరీరం నుంచి నేను బయటకు వచ్చేశాను. మీరనుకున్న మాటలన్నీ విన్నాను. అప్పటి నా స్థితిని అవగాహన చేసుకున్నాను. ఈ 36 గంటల పాటు ఎక్కడెక్కడో ప్రయాణించాను. ఎన్నో లోకాలను సందర్శించాను. ఎన్నో అద్భుతాలను స్వయంగా తెలుసుకున్నాను. నా ఈ జన్మను పూర్తిగా అర్థం చేసుకున్నాను. చనిపోయిన నా తండ్రి హర్‌గోబింద్‌ను కలుసుకున్నాను. అలాగే నా ఫ్రెండ్‌ను కూడా! వాళ్లన్నారు ‘నువ్వు భువిపై ఇంకా బతికాల్సి ఉంది. చేయాల్సింది ఎంతో ఉంది. నువ్వు బతుకుతావు’ అని ధైర్యం చెప్పారు. ఆ ధైర్యంతోనే నేను నా శరీరం వద్దకు చేరుకున్నాను. కానీ, నేను తిరిగి వచ్చేటప్పటికి నా శరీరం పూర్తిగా నిర్జీవమైంది. ఏ మాత్రం బాగవని స్థితి. కానీ, మా నాన్న, నా ఫ్రెండ్ ‘భయపడవద్దు. ప్రయత్నించు. నీ శరీరానికి వచ్చిన జబ్బు పూర్తిగా తగ్గిపోతుంది’ అని చెప్పారు. వారు చెప్పిన సూచనలతో నేను నా దేహంలోకి చేరాను. ‘భయం లేకుండా జీవించు’ అని వాళ్లు వెళ్లిపోయారు. అని చెబుతున్న అనిత మాటలను అంతా ఆశ్చర్యంగా విన్నారు. చికిత్స వల్ల అనిత మానసిక స్థితిలో తేడా వచ్చిందని అందరూ మౌనంగా ఉండిపోయారు.

నాలుగు రోజులలో...
కానీ, అనిత చెప్పినట్టుగానే దాదాపు 70 శాతం క్యాన్సర్ గడ్డలన్నీ కేవలం 4 రోజులలో తగ్గిపోయాయి. 5 వారాలలో ఆమె క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకుంది. హాస్పిటల్ నుంచి ఆరోగ్యవంతురాలిగా డిశ్చార్జ్ అయ్యింది. కండరాలు, అవయవాల పనితీరు మెరుగు కోసం కొన్ని నెలలపాటు ఫిజియోథెరపీ చేయించుకుంది. ఇదంతా చూసిన అనిత భర్త, తల్లి, అన్న ఆమె తర్వాత చేయబోయే కార్యక్రమాలకు అండగా నిలుస్తామన్నారు. సంతోషంగా అంగీకరించింది అనిత.

ఆసుపత్రి బెడ్ మీద ఉండగా తనకు కలిగిన ‘మరణం’ అనుభవాన్ని కాగితం మీద పెట్టింది అనిత. ‘నా చిన్నప్పటి నుంచి ఉన్న ఎన్నో భయాలు, వేదనలకు సంబంధించిన ‘బ్లాక్స్’ అంతర్ చేతనలో పడిపోయాయి. అవి లింఫోమా క్యాన్సర్ రూపంలో బయటపడ్డాయి. శరీరం లోపల  గడ్డలుగా ఏర్పడ్డాయి. అది శరీరం భరించలేకపోయింది. దాని తాలూకు భయం, బాధ రెట్టింపుఅయ్యాయి. అదే ఒళ్లంతా రెట్టింపు గడ్డలుగా మారడానికి కారణం అయ్యింది. ఇది తెలిసాక నా భావోద్వేగాలు, నొప్పులు, ఆలోచలను అదుపు చేసుకోగలిగాను. నా అంతర్ చేతనను జాగృతం చేసుకుంటూ నొప్పుల నుంచి మెల్ల మెల్లగా దూరం అవుతూ వ చ్చాను. అప్పుడే శారీరక, మానసిక రుగ్మతలు ఏవైనా మన అంతర్ చేతన  (ఇన్నర్ కాన్షియస్‌నెస్)లో మార్పులు చేసుకొని, నయం చేసుకోవచ్చని నాకు తెలిసింది. అలా నా అంతర్గత శక్తిని పెంచుకున్నాను. బ్లాక్స్‌ను తొలగించుకుంటూ వచ్చాను. రోజు వారీ పనులు చేసుకుంటూనే ప్రతీ క్షణం ధ్యానంలో నిమగ్నమైనట్టుగానే నన్ను నేను సమీక్షించుకుంటూ వచ్చాను. ఎప్పటికప్పుడు నా లోలోపలి విషయాల పట్ల అవగాహన పెంచుకున్నాను. దీని వల్ల అంతర్గత అవయవాలలోని ప్రతీ కణం ప్రభావితం అయ్యింది. అప్పుడే నా ఆరోగ్యంలో మార్పులు వచ్చాయి’ అని తెలిపింది అనిత. కొన్ని రోజుల్లోనే ‘డయ్యింగ్ టు  బి మి’ అనే పుస్తకం ప్రచురించింది. ఈ పుస్తకంతో అనితా మోర్జానియా జీవితం పూర్తిగా మారిపోయింది.

జీవితం ధన్యం!
‘ప్రతి జన్మకూ ఓ అర్థం ఉంటుంది. దానిని పూర్తిగా సద్వినియోగం చేసుకోగల శక్తి ఆ జన్మను తీసుకున్న మనకే ఉంటుంది. అది నేను స్వయంగా తెలుసుకున్నాను. ఈ మిగిలిన జీవితాన్ని అందుకే వినియోగిస్తున్నాను’ అని చెప్పే అనిత మంచి వక్తగా, ‘న్యూయార్క్ టైమ్స్’ బెస్ట్ సెల్లింగ్ ఆథర్‌గా ఎంతో మందికి పరిచయం అయ్యింది. తనను తానుగా చేసుకున్న సెల్ఫ్ హీలింగ్ ప్రక్రియ ఆమె ఆరోగ్యాన్ని మెరుగుపరిచింది. ధ్యానం ద్వారా అంతర్గత శక్తిని ఎంతగా పెంచుకోవచ్చో స్వయంగా తెలుసుకుంది. ఆ విషయాలతోనే ఎంతోమంది మానసిక సమస్యలకు, అంతర్గత సందేహాలకు ఆమె పరిష్కారాలు చూపుతోంది. ఆన్‌లైన్‌లో కూడా అనిత మోర్జానీ క్లాసులకు హాజరవ్వచ్చు. సందేహాలను అడిగి నివృత్తి చేసుకోవచ్చు. ఆమె విజయగాథను తెలుసుకోవచ్చు.

చేదు గతం! చైతన్యం వర్తమానం!!
అనిత తల్లిదండ్రులు సింగపూర్‌లో స్థిరపడిన భారతీయులు. ఆమె చిన్న వయసులోనే కుటుంబం సింగపూర్ నుంచి హాంగ్‌కాంగ్‌లో స్థిరపడింది. అక్కడే ఉన్నత విద్య చదివింది. డానీ మోర్జానీని పెళ్లి చేసుకుంది. కార్పొరేట్ రంగంలో అనితకు పాతికేళ్ల అనుభవం ఉంది. 2002 ఏప్రిల్‌లో క్యాన్సర్ బారిన పడినట్టు వైద్యులు నిర్ధారించారు. 2006లో ఆసుపత్రిలో చేరింది. అప్పుడే ‘నియర్ డెత్ ఎక్స్‌పీరియెన్స్’ను చవిచూసింది.  అంతర్‌చేతనలో ఏర్పడిన బ్లాక్స్‌ను ‘సెల్ఫ్‌హీలింగ్ ప్రక్రియ’ ద్వారా తొలగించుకొని, అనారోగ్యాన్ని నయం చేసుకోగలిగింది. యూనివర్శిటీ ఆఫ్ హాంగ్‌కాంగ్‌లో అక్కడి విద్యార్థులకు క్యాన్సర్‌ను ఎదుర్కోవడం ఎలా అనే అంశాలపై అవగాహన కల్పించింది. కొందరి విమర్శలూ ఎదుర్కొంది. నాలుగేళ్లుగా హీలింగ్ సెషన్స్ నిర్వహిస్తూ కన్‌సల్టెంట్ సేవలను అందిస్తున్న అనిత వయసు ఇప్పుడు 57 ఏళ్లు.

జీవితానుభవాలనే
‘డయ్యింగ్ టు బి మి’ పుస్తకంలో పొందుపరిచారు అనితా మోర్జానియా. మరణం దాకా వెళ్లొచ్చిన అనుభవాలను ఆమె ఇందులో పొందుపరిచారు. రకరకాల భయాలు, వేదనల నుంచి బయటపడాలనుకునేవారికి ఈ పుస్తకమే ఓ సమాధానం అంటారు ఆమె.

ధ్యానం పోగొట్టే బాధలు
బాధలు, భయాలు వాటి తాలూకు క్లాట్స్ ఒక్కొక్కరిలో ఒక్కోలా ఏర్పడిపోతాయి. వాటిని శుద్ధం చేసుకోవ డానికి ఎవరికి వారు ప్రయత్నించాలి. ఇందుకు ధ్యానం సరైన మార్గం.

‘ధ్యానం’ అంతరాంతరాళాలలో ఒక వాహికలా పనిచేసి ‘చేతన’ జాగృతం అవుతుంది. అప్పుడు భయాలు, బాధలు తొలగిపోయి తనను తాను అర్థం చేసుకోవడం మొదలు పెడుతుంది. తనకేం కావాలో తెలుసుకుంటుంది. తనను తాను శుద్ధి చేసుకున్న చేతన తను ప్రశాంతతను పొందడమే కాకుండా చుట్టూ ఉన్నవారిని సంతోషంగా ఉంచే ప్రయత్నం చేస్తుంది.  నిస్వార్థమైన ప్రేమను చుట్టూ ఉన్నవారికీ పంచుతూ ఉంటే మన మనసు ఆనందాన్ని, ప్రశాంతతను పొందుతుంది. ప్రతీ వేదనకూ భయమే మూలం. మైండ్‌ను విశ్రాంతిగా ఉంచి, తద్వారా లోలోపలి భయాలను విడుదల చేస్తే ఎలాంటి అనారోగ్య సమస్య అయినా దూరమవుతుంది. నవ్వడం, నవ్వించడం... ఈ రెండు లక్షణాలూ జీవితానికి సువాసనను అద్దుతాయి. - డాక్టర్ న్యూటన్ కొండవీటి,  లైఫ్ రీసెర్చ్ అకాడమీ, హైదరాబాద్

- నిర్మల చిల్కమర్రి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 

పోల్

Advertisement
Advertisement