బ్యాంకు కార్డులపై భారీ ఆఫర్లు | Heavy offers on bank cards | Sakshi
Sakshi News home page

బ్యాంకు కార్డులపై భారీ ఆఫర్లు

Published Mon, Nov 5 2018 1:31 AM | Last Updated on Mon, Nov 5 2018 5:04 AM

Heavy offers on bank cards - Sakshi

అమెజాన్‌ ‘గ్రేట్‌ ఇండియా ఫెస్టివల్‌’... ఫ్లిప్‌కార్ట్‌ ‘ఫెస్టివ్‌ ధమాకా సేల్స్‌’... పేటీఎం ‘మహా క్యాష్‌బ్యాక్‌ సేల్‌’... వీటిలో కొనలేకపోయారా..? ఆఫర్లను మిస్‌ అయ్యామని నిరాశ పడాల్సిన పనేలేదు. ఎందుకంటే పండుగ సందర్భంగా డిస్కౌంట్‌ ఆఫర్లకు పలు ప్రత్యామ్నాయాలు కూడా ఉన్నాయి. అటు ఆన్‌లైన్‌ సంస్థలూ కొత్త కొత్త పేర్లతో పండుగల దాకా ఏదో ఒక రూపంలో ఆఫర్లు అందిస్తూనే ఉంటున్నాయి.

ఇక దగ్గర్లోని  ప్రముఖ దుకాణానికి వెళ్లినా ఆఫర్లు అందుకోవచ్చు! కాకపోతే క్రెడిట్, డెబిట్‌ కార్డులపై చాలా బ్యాంకులు ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్, క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్లు అందిస్తున్నాయి. వీటిని వినియోగించు కోవడం ద్వారా కొంత వరకు ఆదా చేసుకునే అవకాశముంది. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, యాక్సిస్, సిటీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులు తమ క్రెడిట్, డెబిట్‌ కార్డులను ఉపయోగించి షాపింగ్‌ చేస్తే పండుగ ఆఫర్లను అందిస్తున్నాయి.

పలు రిటైల్‌ సంస్థలతో (వీటిలో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌) సంబంధం పెట్టుకుని తగ్గింపు, క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్లను తమ ఖాతాదారులకు అందిస్తున్నాయి. కాకపోతే వీటి గురించి అంతగా ప్రచారం ఉండదు. కాబట్టి ఆయా బ్యాంకు వెబ్‌సైట్లకో, లేదంటే ఈ కామర్స్‌ వెబ్‌సైట్లకో వెళితే తప్ప తెలియదు. వాటిలో గనక ఈ ఆఫర్ల గురించి తెలుసుకుంటే... దానికి అనుగుణంగా కొనుగోళ్లు చేసుకునే వీలుంటుంది.

విభిన్న ఆఫర్లు
పండుగ ఆఫర్లు రెండు రూపాల్లో ఉంటాయి. ఒకటి క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ కాగా, రెండోది రిటైల్‌ సంస్థలు పండుగ సందర్భంగా అందిస్తున్న తగ్గింపు ధరలపై అదనపు డిస్కౌంట్‌!. ఈ అదనపు డిస్కౌంట్‌ అనేది అప్పటికప్పుడే అమలవుతుంది. క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ అయితే, ఆ మొత్తం తిరిగి కస్టమర్‌కు వచ్చేందుకు కొంత సమయం పడుతుంది. అంటే ముందు మొత్తం చెల్లించి ఉత్పత్తి కొనుగోలు చేస్తే... నిర్ణీత తేదీన క్యాష్‌ బ్యాక్‌ జమ చేస్తారు.

ఇది నెల రోజుల నుంచి మూడు నెలల వరకు ఒక్కో సంస్థను బట్టి మారిపోతుంది. పీటర్‌ ఇంగ్లండ్‌ స్టోర్లలో కొనుగోళ్లపై ఐసీఐసీఐ బ్యాంకు తన క్రెడిట్, డెబిట్‌ కార్డులపై 10 శాతం క్యాష్‌ బ్యాక్‌ అందిస్తోంది. కాకపోతే కనీస బిల్లు మొత్తం రూ.3,500 ఉంటేనే ఈ డిస్కౌంట్‌ ఆఫర్‌కు అర్హులు. అలాగే గరిష్ట క్యాష్‌ బ్యాక్‌ ఒక కార్డుపై రూ.750కే పరిమితం. 2019 జనవరి 31లోపు క్యాష్‌ బ్యాక్‌ లభిస్తుంది. ఇదొక ఉదాహరణ మాత్రమే. చాలా స్టోర్లు చాలా కార్డులపై ఇలాంటి ఆఫర్లు అందిస్తున్నాయి.

క్యాష్‌ బ్యాక్, డిస్కౌంట్‌తోపాటు రివార్డు పాయింట్ల రూపంలో మరో ప్రయోజనాన్ని కూడా కస్టమర్లు సొంతం చేసుకోవచ్చు. పండుగ సీజన్లో క్రెడిట్‌ కార్డు కొనుగోళ్లపై హెచ్‌ఎస్‌బీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తదితర కొన్ని బ్యాంకులు రివార్డు పాయింట్లను అందిస్తున్నాయి. ఇన్ఫీబీమ్‌లో రూ.50,000 అంతకుమించి చేసే కొనుగోళ్లపై హెచ్‌ఎస్‌బీసీ ఇతరులతో పోలిస్తే ఐదు రెట్లు అధికంగా రివార్డు పాయింట్లను ఆఫర్‌ చేస్తోంది.

వస్త్రాలు, మొబైల్‌ ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల కొనుగోళ్లపై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు 10 రెట్లు అధికంగా రివార్డు పాయింట్లను ఇస్తోంది. కాకపోతే కనీస కొనుగోలు మొత్తం రూ.5,000 ఉండాలి. ప్రతీ రోజు సాయంత్రం 5–9 గంటల మధ్య కొనుగోలు చేసే వారికే ఈ ఆఫర్‌ పరిమితం. ఇక ఈ పండుగ సీజన్‌లో ఏం కొనుగోలు చేయవచ్చంటే... వస్త్రాలు, గృహోపకరణాలు, మొబైల్‌ ఫోన్లు, బంగారు ఆభరణాలపై ఈ ఆఫర్లు ఉన్నాయి.

ఎక్కడెక్కడ...
రిలయన్స్‌ ట్రెండ్స్, పాంటలూన్, వెస్ట్‌ సైడ్, మ్యాక్స్, మార్క్స్‌ అండ్‌ స్పెన్సర్స్‌ తదితర ప్రముఖ రిటైల్‌ వస్త్ర దుకాణాలు ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంకుతో టై అప్‌ అయ్యాయి. తమ కార్డులతో కొనుగోళ్లపై క్యాష్‌ బ్యాక్, డిస్కౌంట్లను అందిస్తున్నాయి. దాదాపు అన్ని స్టోర్లలోనూ ఇవి అందుబాటులో ఉన్నాయి.

ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల విషయంలో మాత్రం క్రోమా, రిలయన్స్‌ డిజిటల్‌ కనీసం రూ.10,000 కొనుగోలుపై 5 శాతం క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ చేస్తున్నాయి. అదే హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ లేదా డెబిట్‌ కార్డుతో క్రోమాలో చేసే కొనుగోళ్లపై రూ.2,000 వరకు క్యాష్‌ బ్యాక్‌ పొందొచ్చు. తనిష్క్‌లో హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ లేదా డెబిట్‌ కార్డు కొనుగోళ్లపై 5 శాతం డిస్కౌంట్‌ ఆఫర్‌ ఉంది. రూ.50,000–1,00,000 కొనుగోళ్లపై అందుకునే గరిష్ట క్యాష్‌బ్యాక్‌ రూ.2,500. రూ.లక్షపైన కొనుగోలుపై గరిష్ట క్యాష్‌ బ్యాక్‌ రూ.5,000.

కొన్ని పరిమితులు కూడా...
ఈ ఆఫర్లు దాదాపు అన్ని అవుట్‌లెట్లలో అందు బాటులో ఉన్నప్పటికీ కొన్ని పరిమితులూ ఉన్నాయి.  ఉదాహరణకు... పాంట లూన్‌ రిటైల్‌ దుకాణాల్లో ఎస్‌బీఐ అందించే 5%క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్, తూర్పు ప్రాంతంలోని స్టోర్లకు అమలు కాదు. రిలయన్స్‌ ట్రెండ్స్‌లో ఐసీఐసీఐ 5% క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్, అసోం, పశ్చిమబెంగాల్, బిహార్‌ సహా తొమ్మిది రాష్ట్రాల్లో అందుబాటులో లేదు. ఇక మరో అంశం... బ్యాంకు నిర్దేశించిన కనీస మొత్తం కొనుగోలుపైనే ఆఫర్లు అమలవుతాయి.

అంతేకాదు గరిష్ట తగ్గింపు, క్యాష్‌ బ్యాక్‌పైనా పరిమితి ఉంటుంది. ఈ వివరాలను బ్యాంకు వెబ్‌సైట్లు, సంబంధిత రిటైల్‌ దుకాణాల్లో  తెలుసుకోవచ్చు. యాక్సిస్‌ , కోటక్, సిటీబ్యాంకులు రిలయన్స్‌ డిజిటల్‌ అవుట్‌లెట్లలో తమ క్రెడిట్‌ కార్డు లతో చేసే కొనుగోళ్లపై 5 శాతం క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ చేస్తున్నాయి. కాకపోతే కనీస కొనుగోలు రూ.10,000 ఉండాలి. గరిష్ట క్యాష్‌ బ్యాక్‌ రూ.2,000. రిటైల్‌ దుకాణాల్లో కార్డు స్వైప్‌ చేసే ముందు కూడా అక్కడి సిబ్బందికి విషయం తెలియజేయడం మంచిది.  ఇక రిటైల్‌ కార్డులపైనే ఈ ఆఫర్లన్నీ. కార్పొరేట్‌ కమర్షియల్‌ కార్డులకు వర్తించవు.

ముందస్తు జాగ్రత్తలు
క్రెడిట్‌ కార్డు వినియోగం వల్ల వడ్డీ రహిత రుణాన్ని కొన్ని రోజులకు తీసుకునే అవకాశం లభిస్తుంది. కాకపోతే వడ్డీ రహిత కాల వ్యవధి (20–50 రోజుల మధ్య) ముగిసేలోపు ఆ మొత్తాన్ని తిరిగి కార్డులోకి జమ చేయాలి. లేదంటే భారీగా వడ్డీ పడుతుంది. ప్రతి నెలా 2.5–3 శాతం వరకు వడ్డీ ఉంటుంది. అంటే వార్షిక వడ్డీ 30–36 శాతం వరకు. అందుకే తిరిగి వడ్డీ రహిత కాల వ్యవధిలోపు చెల్లించగలిగే వారు, పండుగ ఆఫర్ల కోసమే క్రెడిట్‌ కార్డును వాడుకోవడానికి పరిమితం కావడం మంచిదే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement