బ్యాంకులకు రూ.10,000 కోట్లే..
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులకు తాజా మూలధనంగా కేంద్ర బడ్జెట్ వచ్చే ఆర్థిక సంవత్సరంలో కేవలం రూ.10,000 కోట్లు కేటాయించింది. అయితే అవసరమైతే మరిన్ని నిధులు సమకూర్చడానికి సిద్ధమనీ జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. బ్యాంకింగ్ రంగంలో పునరుత్తేజానికిగాను 2015లో ప్రకటించిన ఇంద్రధనస్‌లో భాగంగా ఈ నిధులను సమకూర్చుతున్నట్లు తెలిపారు.
నాలుగేళ్లలో రూ.70,000 కోట్లు...
నాలుగేళ్లలో ఈ పథకం కింద ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.70,000 కోట్లు సమకూర్చాలన్నది కేంద్రం లక్ష్యం. అంతర్జాతీయ బ్యాంకింగ్ మూలధన ప్రమాణాలు బాసెల్ 3కి అనుగుణంగా అవసరమైతే బ్యాంకులు తమ మూలధన అవసరాలకు రూ.1.1 లక్షల కోట్ల నిధులను సమీకరించుకోడానికీ ఈ పథకం కింద వీలుంటుంది. ఇంద్రధనస్సు బ్లూప్రింట్‌లో భాగంగా బ్యాంకులకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016–2017) రూ.25,000 కోట్ల మూలధనాన్ని ప్రభుత్వం అందించాలని ప్రతిపాదించింది.. వీటిలో ఇప్పటికే రూ.22,915 కోట్లను 13 ప్రభుత్వ బ్యాంకులకు కేంద్రం కేటాయించింది. ఇందులో 75 శాతాన్ని ఇప్పటికే విడుదల చేయడం జరిగింది.
ఎన్‌పీఏ కేటాయింపులపై పన్ను రాయితీలు
తాజా బడ్జెట్‌లో బ్యాంకింగ్‌కు ఆర్థికమంత్రి కొన్ని పన్ను రాయితీలనూ ఇచ్చారు. మొండిబకాయిల (ఎన్‌పీఏ)కు సంబంధించి కేటాయింపులపై పన్ను రాయితీలు ఇస్తున్నట్లు బడ్జెట్ పేర్కొంది. దీనివల్ల వాస్తవ ఆదాయాల (వసూలైన వడ్డీలు) ప్రాతిపదికనే పన్నులు ఉంటాయితప్ప, ఎన్‌పీఏల్లో చిక్కుకున్న అకౌంట్లకు సంబంధించి పన్నులు ఉండబోవని బడ్జెట్ స్పష్టతనిచ్చింది. ఇది షెడ్యూల్డ్, నాన్–షెడ్యూల్డ్ సహకార బ్యాంకులకు వర్తిస్తుందని పేర్కొంది. ‘‘బ్యాంకింగ్ రంగానికి బూస్ట్ ఇవ్వడం లక్ష్యంగా ఎన్‌పీఏకు ఆమోదనీయ కేటాయింపులను 7.5 శాతం నుంచి 8.5 శాతానికి పెంచుతున్నాం. బ్యాంకుల పన్ను చెల్లింపు భారాన్ని ఇది తగ్గిస్తుంది’’ అని కూడా జైట్లీ బడ్జెట్ పేర్కొంది.