
పెరిగిన హెరిటేజ్ ఫుడ్స్ లాభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హెరిటేజ్ ఫుడ్స్ డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసిక నికర లాభంలో 120 శాతం వృద్ధి నమోదుచేసింది. అంతకుముందు ఏడాది ఇదే కాలానికి రూ. 5 కోట్లుగా ఉన్న నికర లాభం ఇప్పుడు రూ. 11 కోట్లు దాటింది. ఇదే సమయంలో ఆదాయం రూ. 511 కోట్ల నుంచి రూ. 582 కోట్లకు పెరిగింది. ఇక వ్యాపారాల వారీగా చూస్తే డెయిరీ వ్యాపార లాభాలు రూ. 15 కోట్ల నుంచి 25 కోట్లకు పెరిగితే, రిటైల్ వ్యాపారంలో నష్టాలు రూ. 3.7 కోట్ల నుంచి రూ. 4.42 కోట్లకు పెరిగాయి. బేకరీ వ్యాపారం ఇంకా నష్టాల్లోనే ఉండగా, రెన్యువబుల్ ఎనర్జీ లాభాలు పెరిగాయి. ఈ వార్తల నేపథ్యంలో బీఎస్‌ఈలో హెరిటేజ్ ఫుడ్ షేరు రూ. 490 వద్ద స్థిరంగా ముగిసింది.
వీఎస్‌టీ లాభం రూ. 41 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో వీఎస్‌టీ ఇండస్ట్రీస్ రూ. 217 కోట్ల ఆదాయంపై రూ. 41 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతకుముందు ఏడాది ఇదే కాలానికి కంపెనీ రూ. 198 కోట్ల ఆదాయంపై రూ. 30 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.
హిందుస్తాన్ జింక్ లాభం 24 శాతం డౌన్
న్యూఢిల్లీ: హిందుస్తాన్ జింక్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్లో 24 శాతం క్షీణించింది. గత క్యూ3లో రూ.2,379 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.1,811 కోట్లకు తగ్గిందని హిందుస్తాన్ జింక్ పేర్కొంది. వ్యయాలు అధికంగా ఉండడం, ధరలు అంతంతమాత్రంగానే ఉండడం దీనికి కారణాలని కంపెనీ చైర్మన్ అగ్నివేశ్ అగర్వాల్ చెప్పారు. మొత్తం ఆదాయం రూ.3,853 కోట్ల నుంచి 11 శాతం క్షీణించి రూ.3,431 కోట్లకు తగ్గిందని పేర్కొన్నారు. మొత్తం వ్యయాలు రూ.1,973 కోట్ల నుంచి 8 శాతం వృద్ధితో రూ.2,124 కోట్లకు పెరిగాయని వివరించారు.