అపోలో హాస్పిటల్స్ లాభం రూ. 91 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హెల్త్‌కేర్ దిగ్గజం అపోలో హాస్పిటల్స్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జూలై-సెప్టెంబర్) కాలానికి ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. స్టాండెలోన్ ప్రాతిపదికన నికర లాభం 5%పైగా పెరిగి రూ. 92 కోట్లకు చేరింది. గతేడాది(2013-14) ఇదే కాలంలో రూ. 87 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం కూడా రూ. 975 కోట్ల నుంచి 18% ఎగసి రూ. 1,153 కోట్లను తాకింది. ప్రణాళిక ప్రకారం విస్తరణ పనులు కొనసాగుతున్నాయని కంపెనీ చైర్మన్ ప్రతాప్ సి.రెడ్డి చెప్పారు.
ఈ ఏడాదిలోగా కొత్తగా 600 పడకలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగా ఇప్పటికే మహిళ, శిశు సంబంధిత 45 పడకలను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. ఇక అక్టోబర్-డిసెంబర్(క్యూ3) కాలంలో నెల్లూరులో 200, చెన్నై, ఓఎంఆర్‌లలో 170 పడకను ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు.
ఫార్మసీల విస్తరణ: ప్రస్తుత సమీక్షా కాలంలో హైదరాబాద్‌కు చెందిన హెటెరో మెడ్ సొల్యూషన్స్‌ను కొనుగోలు చేయడం ద్వారా ఫార్మసీ చైన్ పటిష్టంకానుందని ప్రతాప్ రెడ్డి చెప్పారు. హాస్పిటళ్లు, ఫార్మసీలు, రిటైల్ హెల్త్‌కేర్ కేంద్రాల విస్తరణ కార్యక్రమాలు చురుకుగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
హెల్త్‌కేర్ సర్వీసుల పరిధిని విస్తరించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింతగా వినియోగిస్తామని చెప్పారు. హెల్త్‌కేర్ సర్వీసుల విభాగం 13% పుంజుకున్నట్లు తెలిపారు. కాగా, కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ2లో రూ. 1,315 కోట్ల ఆదాయంపై రూ. 88 కోట్ల నికర లాభాన్ని పొందింది.