Total Income
-
మారుతి ఫలితాలు ఒకే..భారీ డివిడెండ్
ముంబై: ఆటో దిగ్గజం మారుతి సుజుకి క్యూ4 ఫలితాలను ప్రకటించింది. గురువారం వెల్లడించిన సంస్థ త్రైమాసిక ఫలితాల్లో రూ. 1709కోట్ల నికర లాభాలు పోస్ట్ చేసింది. మొత్తం ఆదాయం రూ. 20,751 కోట్లను సాధించింది. ఎబిటా మార్జిన్లు 13.8 శాతంతో రూ. 2561కోట్లుగా నిలిచాయి. మారుతి విక్రయాలు మార్కెట్ అంచనాలను మించి నమోదు అయ్యాయి. మారుతి రూ. 5 ముఖ విలువ కలిగిన ప్రతి ఈక్విటీ షేరుకు రూ.75 డివిడెండ్ చెల్లించేందుకు బోర్డు ప్రతిపాదించింది. గత ఏడాది ఇది రూ. 35లు చెల్లించింది. ఈ ఫలితాల నేపథ్యంలో మారుతి సుజుకి షేర్ స్వల్ప నష్టపోయినా తిరిగి లాభాల్లోకి మారింది. -
అపోలో హాస్పిటల్స్ లాభం రూ. 91 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హెల్త్‌కేర్ దిగ్గజం అపోలో హాస్పిటల్స్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జూలై-సెప్టెంబర్) కాలానికి ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. స్టాండెలోన్ ప్రాతిపదికన నికర లాభం 5%పైగా పెరిగి రూ. 92 కోట్లకు చేరింది. గతేడాది(2013-14) ఇదే కాలంలో రూ. 87 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం కూడా రూ. 975 కోట్ల నుంచి 18% ఎగసి రూ. 1,153 కోట్లను తాకింది. ప్రణాళిక ప్రకారం విస్తరణ పనులు కొనసాగుతున్నాయని కంపెనీ చైర్మన్ ప్రతాప్ సి.రెడ్డి చెప్పారు. ఈ ఏడాదిలోగా కొత్తగా 600 పడకలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగా ఇప్పటికే మహిళ, శిశు సంబంధిత 45 పడకలను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. ఇక అక్టోబర్-డిసెంబర్(క్యూ3) కాలంలో నెల్లూరులో 200, చెన్నై, ఓఎంఆర్లలో 170 పడకను ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. ఫార్మసీల విస్తరణ: ప్రస్తుత సమీక్షా కాలంలో హైదరాబాద్‌కు చెందిన హెటెరో మెడ్ సొల్యూషన్స్‌ను కొనుగోలు చేయడం ద్వారా ఫార్మసీ చైన్ పటిష్టంకానుందని ప్రతాప్ రెడ్డి చెప్పారు. హాస్పిటళ్లు, ఫార్మసీలు, రిటైల్ హెల్త్‌కేర్ కేంద్రాల విస్తరణ కార్యక్రమాలు చురుకుగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. హెల్త్‌కేర్ సర్వీసుల పరిధిని విస్తరించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింతగా వినియోగిస్తామని చెప్పారు. హెల్త్‌కేర్ సర్వీసుల విభాగం 13% పుంజుకున్నట్లు తెలిపారు. కాగా, కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ2లో రూ. 1,315 కోట్ల ఆదాయంపై రూ. 88 కోట్ల నికర లాభాన్ని పొందింది. -
ఎల్అండ్టీ లాభం 7% ప్లస్
ముంబై: ఇంజనీరింగ్ దిగ్గజం లార్సెన్ అండ్ టుబ్రో(ఎల్అండ్టీ) ఈ ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్(క్యూ2) కాలానికి ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. నికర లాభం దాదాపు 7% పెరిగి రూ. 862 కోట్లకు చేరింది. గతేడాది(2013-14) క్యూ2లో రూ. 806 కోట్లు ఆర్జించింది. కన్సాలిడేటెడ్ ఫలితాలివి. విద్యుత్, హైడ్రోకార్బన్ల విభాగం అమ్మకాలు మందగించడం లాభాలపై ప్రభావాన్ని చూపింది. ఇదే కాలానికి కంపెనీ మొత్తం ఆదాయం సుమారు 11% పుంజుకుని రూ. 21,159 కోట్లను అధిగమించింది. గతంలో రూ. 19,130 కోట్ల ఆదాయం నమోదైంది. ప్రతికూల పరిస్థితుల కారణంగా అమ్మకాలు మందగించాయని, అయితే వాతావరణం మెరుగుపడుతున్నదని కంపెనీ సీఎఫ్‌వో ఆర్.శంకర్ రామన్ చెప్పారు. ప్రభుత్వం తీసుకువచ్చిన వృద్ధి ఆధారిత సంస్కరణల ప్రభావం కనిపించడానికి మరికొంత సమయం పడుతుందని వ్యాఖ్యానించారు. కొత్తగా రూ. 39,797 కోట్ల ఆర్డర్లు సంపాదించింది. ఇది 17% అధికం. దీంతో మొత్తం ఆర్డర్‌బుక్ విలువ రూ. 2,14,429 కోట్లను తాకింది. దీనిలో అంతర్జాతీయ మార్కెట్ల వాటా 27%. ఇన్ఫ్రా ప్రాజెక్ట్‌ల అండ ప్రధానంగా మౌలిక సదుపాయాలు(ఇన్ఫ్రాస్ట్రక్చర్), అభివృద్ధి ప్రాజెక్ట్‌లు సాధించిన పురోగతి ఆదాయాల్లో వృద్ధికి దోహదపడినట్లు రామన్ పేర్కొన్నారు. ఇన్ఫ్రా విభాగం ఆదాయం 27% ఎగసి రూ. 9,633 కోట్లను తాకిందని, ఇందుకు భారీస్థాయిలో లభించిన ఆర్డర్‌బుక్ సహకరించిందని తెలిపారు. దీనిలో అంతర్జాతీయ వాటా 27%గా వెల్లడించారు. పలు బిజినెస్ విభాగాల్లో ప్రాజెక్ట్‌లను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అయితే విద్యుత్, మెటల్స్, హైడ్రోకార్బన్లు విభాగాలు నెమ్మదించాయని తెలిపారు. డెవలప్మెంటల్ ప్రాజెక్ట్‌ల ఆదాయం రూ. 993 కోట్లుగా నమోదుకాగా, విద్యుత్ విభాగం అమ్మకాలు 20% తగ్గి రూ. 1,153 కోట్లకు పరిమితమయ్యాయి. కొత్తగా పొందిన ప్రాజెక్ట్‌లు అభివృద్ధి దశలో ఉండటమే దీనికి కారణమని రామన్ తెలిపారు. కాగా, హైడ్రోకార్బన్ల బిజినెస్ నుంచి 24% తక్కువగా రూ. 1,804 కోట్ల ఆదాయం లభించినట్లు కంపెనీ వెల్లడించింది. -
బీహెచ్ఈఎల్ లాభం 1,845 కోట్లు
న్యూఢిల్లీ: విద్యుత్ పరికరాల ప్రభుత్వ రంగ దిగ్గజం బీహెచ్ఈఎల్ గతేడాది(2013-14) క్యూ4లో రూ. 1,845 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2012-13) ఇదే కాలంలో రూ. 3,233 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అయితే బీహెచ్‌పీవీని విలీనం చేసుకున్నందున ఫలితాలను పోల్చి చూడతగదని కంపెనీ పేర్కొంది. బీహెచ్‌పీవీని విలీనం చేసుకునేందుకు క్యాబినెట్ ఫిబ్రవరిలో ఆమోదముద్ర వేసిందని, దీంతో 2013 ఆగస్ట్ నుంచి విలీనం అమల్లోకి వచ్చిందని వెల్లడించింది. కాగా, రూ. 14,755 కోట్ల నికర అమ్మకాలు నమోదయ్యాయి. గతంలో రూ. 18,850 కోట్ల అమ్మకాల ను సాధించింది. విద్యుత్ రంగ విభాగం నుంచి రూ. 12,211 కోట్ల ఆదాయం లభించింది. గతంలో ఈ ఆదాయం రూ. 15,525 కోట్లుగా ఉంది. పూర్తి ఏడాదికి(2013-14) నికర లాభం 3,503 కోట్లకు చేరగా, గతంలో రూ. 6,693 కోట్లు నమోదైంది. ఇక ఆదాయం కూడా రూ. 50,045 కోట్ల నుంచి రూ. 41,192 కోట్లకు క్షీణించాయి. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో షేరు 2.2% నష్టంతో రూ. 243 వద్ద ముగిసింది. -
హెచ్‌పీసీఎల్ లాభం రూ. 4,609 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ హిందుస్తాన్ పెట్రోలియం(హెచ్‌పీసీఎల్) గతేడాది(2013-14) జనవరి-మార్చి(క్యూ4)కాలంలో రూ. 4,609 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఇందుకు అధిక స్థాయిలో అందిన ఇంధన సబ్సిడీలు కారణమైనప్పటికీ, అంతక్రితం ఏడాది(2012-13) ఇదే కాలంలో ఆర్జించిన రూ. 7,679 కోట్లతో పోలిస్తే 40% తక్కువే. అయితే గత ఫలితాలతో వీటిని పోల్చలేమని కంపెనీ చైర్మన్ ఎన్.వాసుదేవ చెప్పారు. గతంలో బ్యాక్లాగ్ సబ్సిడీలను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. డీజిల్, వంటగ్యాస్ విక్రయాలపై వాటిల్లే ఆదాయ నష్టాలకుగాను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు ప్రభుత్వంతోపాటు, ఆయిల్ ఉత్పాదక సంస్థల నుంచి సబ్సిడీలు లభించే సంగతి తెలిసిందే. కాగా, క్యూ4లో డీజిల్, వంటగ్యాస్ విక్రయాలపై రూ. 9,183 కోట్ల ఆదాయ నష్టాలు నమోదయ్యాయి. ఇందుకుగాను ప్రభుత్వం నుంచి రూ. 6,938 కోట్లు, ఆయిల్ ఉత్పత్తి సంస్థల నుంచి రూ. 5,671 కోట్లు లభించాయి. పూర్తి ఏడాదికి లాభం రెట్టింపై రూ. 1,734 కోట్లకు చేరగా, అమ్మకాలు 8% ఎగసి రూ. 2,32,188 కోట్లను తాకాయి. 4% అధికంగా 30.26 మిలియన్ టన్నుల పెట్రోలియం ఉత్పత్తులను విక్రయించినట్లు వాసుదేవ వెల్లడించారు. ఇవి కంపెనీ చరిత్రలోనే అత్యధికమని చెప్పారు. విస్తరణపై రూ. 17,000 కోట్లు: ముంబై, వైజాగ్ రిఫైనరీల సామర్థ్యాన్ని విస్తరించేందుకు రూ. 17,000 కోట్ల కంపెనీ వెచ్చించనుంది. 2018కల్లా ముంబై రిఫైనరీ సామర్థ్యాన్ని ప్రస్తుత 6.5 మిలియన్ టన్నుల నుంచి 10 మిలియన్ టన్నులకు, వైజాగ్ రిఫైనరీ సామర్థ్యాన్ని 8.33 మిలియన్ టన్నుల నుంచి 15 మిలియన్ టన్నులకు పెంచనున్నట్లు కంపెనీ రిఫైనరీస్ డెరైక్టర్ బీకే నామ్‌దేవ్ చెప్పారు. ముంబై రిఫైనరీపై రూ. 2,000 కోట్లు, వైజాగ్ రిఫైనరీపై రూ. 15,000 కోట్లు వెచ్చిస్తున్నట్లు తెలిపారు.