హెచ్‌పీసీఎల్ లాభం రూ. 4,609 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ హిందుస్తాన్ పెట్రోలియం(హెచ్‌పీసీఎల్) గతేడాది(2013-14) జనవరి-మార్చి(క్యూ4)కాలంలో రూ. 4,609 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఇందుకు అధిక స్థాయిలో అందిన ఇంధన సబ్సిడీలు కారణమైనప్పటికీ, అంతక్రితం ఏడాది(2012-13) ఇదే కాలంలో ఆర్జించిన రూ. 7,679 కోట్లతో పోలిస్తే 40% తక్కువే. అయితే గత ఫలితాలతో వీటిని పోల్చలేమని కంపెనీ చైర్మన్ ఎన్.వాసుదేవ చెప్పారు. గతంలో బ్యాక్‌లాగ్ సబ్సిడీలను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు.
డీజిల్, వంటగ్యాస్ విక్రయాలపై వాటిల్లే ఆదాయ నష్టాలకుగాను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు ప్రభుత్వంతోపాటు, ఆయిల్ ఉత్పాదక సంస్థల నుంచి సబ్సిడీలు లభించే సంగతి తెలిసిందే. కాగా, క్యూ4లో డీజిల్, వంటగ్యాస్ విక్రయాలపై రూ. 9,183 కోట్ల ఆదాయ నష్టాలు నమోదయ్యాయి. ఇందుకుగాను ప్రభుత్వం నుంచి రూ. 6,938 కోట్లు, ఆయిల్ ఉత్పత్తి సంస్థల నుంచి రూ. 5,671 కోట్లు లభించాయి. పూర్తి ఏడాదికి లాభం రెట్టింపై రూ. 1,734 కోట్లకు చేరగా, అమ్మకాలు 8% ఎగసి రూ. 2,32,188 కోట్లను తాకాయి. 4% అధికంగా 30.26 మిలియన్ టన్నుల పెట్రోలియం ఉత్పత్తులను విక్రయించినట్లు వాసుదేవ వెల్లడించారు. ఇవి కంపెనీ చరిత్రలోనే అత్యధికమని చెప్పారు.
విస్తరణపై రూ. 17,000 కోట్లు: ముంబై, వైజాగ్ రిఫైనరీల సామర్థ్యాన్ని విస్తరించేందుకు రూ. 17,000 కోట్ల కంపెనీ వెచ్చించనుంది. 2018కల్లా ముంబై రిఫైనరీ సామర్థ్యాన్ని ప్రస్తుత 6.5 మిలియన్ టన్నుల నుంచి 10 మిలియన్ టన్నులకు, వైజాగ్ రిఫైనరీ సామర్థ్యాన్ని 8.33 మిలియన్ టన్నుల నుంచి 15 మిలియన్ టన్నులకు పెంచనున్నట్లు కంపెనీ రిఫైనరీస్ డెరైక్టర్ బీకే నామ్‌దేవ్ చెప్పారు. ముంబై రిఫైనరీపై రూ. 2,000 కోట్లు, వైజాగ్ రిఫైనరీపై రూ. 15,000 కోట్లు వెచ్చిస్తున్నట్లు తెలిపారు.