
హెరిటేజా ... మజాకా!!
♦ మూడేళ్లలో 400 శాతానికిపైగా ఎగసిన షేరు ధర బాబు అధికారంలోకి రావటంతోనే పరుగు షురూ!!
♦ మిగిలిన డెయిరీలతో పోలిక లేని రీతిలో పెరుగుదల
♦ బాబుకు అధికారం లేకుంటే దీనికీ పవర్ కట్; లాభాలూ అంతంతే
♦ రిటైల్ వ్యాపారాన్ని విక్రయించటం వెనక ఇన్‌సైడ్ ఇన్ఫర్మేషన్!
♦ నోట్ల రద్దుకు ఒక్క రోజు ముందు ఫ్యూచర్ రిటైల్‌కు విక్రయం
♦ అక్టోబర్ 12నే నోట్ల రద్దుపై మోదీకి లేఖ రాశానని చెప్పిన బాబు
♦ నోట్ల రద్దు తరవాత రిటైల్ దెబ్బతింటుందని తెలిసే విక్రయం
♦ ఇపుడు షేరు ధర బాగా పెరిగిపోవటంతో విభజించే యోచన
(సాక్షి, బిజినెస్ విభాగం)
దాదాపు మూడేళ్ల కిందట... 2014 జూన్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పదవీ బాధ్యతలు చేపట్టే నాటికి ఆయన వ్యవస్థాపకుడిగా ఆరంభించిన హెరిటేజ్ ఫుడ్స్ షేరు ధర 300 రూపాయలు.
సరిగ్గా మూడేళ్ల తరవాత... 2017 జూలై 24న అదే హెరిటేజ్ ఫుడ్స్ షేరు ధర ఏకంగా 1,303 రూపాయలు. అంటే... 435 శాతం పెరిగిందన్న మాట. ఎలా చూసుకున్నా ఏడాదికి 110 శాతం పెరుగుదల!!
హెరిటేజ్ ఫుడ్స్‌ది ప్రధానంగా పాల వ్యాపారం. పాలతో పాటు ఇతర పాల ఉత్పత్తులమ్మే సంస్థ. మరి స్టాక్ మార్కెట్లో హెరిటేజ్ ఫుడ్స్ లాంటి వ్యాపారం చేసే ఇతర సంస్థలేమీ లేవా? అవి కూడా ఇలాగే పెరిగి ఉంటాయి కదా? మరి అన్ని కంపెనీల షేర్ల ధరలూ పెరిగినపుడు హెరిటేజ్ ఫుడ్స్ షేరు ధర పెరిగితే తప్పేమిటి? అనే సందేహం ఎలాంటివారికైనా రాకమానదు. నిజం!! అన్ని కంపెనీల ధరలూ ఇలాగే పెరిగి ఉంటే వాటి గురించి చెప్పుకోవాల్సిన అవసరమే ఉండదు. ఎందుకంటే... హట్సన్ ఆగ్రో ప్రొడక్ట్స్, క్వాలిటీ, పరాగ్ మిల్క్ ఫుడ్స్, ప్రభాత్ డెయిరీ వంటి సంస్థలన్నీ హెరిటేజ్‌లా పూర్తిస్థాయి డెయిరీ వ్యాపారంలో ఉన్నవే. స్టాక్ మార్కెట్ మంచి బుల్ దశలో ఉంది కనక వీటి ధరలూ పెరిగాయి. కానీ... హెరిటేజ్‌లా మాత్రం కాదు. ఇంకా చెప్పాలంటే వీటి అమ్మకాలు గానీ, లాభాలు కానీ హెరిటేజ్‌కన్నా బాగానే ఉన్నాయి. కానీ షేరు ధర మాత్రం హెరిటేజ్‌లా పెరగలేదు సరికదా... దానికి దరిదాపుల్లో కూడా లేదనే చెప్పాలి. ఎందుకిలా..? దీనికి కారణమేంటి? బహుశా! హెరిటేజ్‌లా వీటి చేతిలో అధికారం లేకపోవటమే కావచ్చేమో!!
చంద్రబాబు నాయుడు అధికారంలో లేనపుడు హెరిటేజ్ ఫుడ్స్ లాభాల్లో గానీ, అమ్మకాల్లో గానీ మరీ దూకుడేమీ కనిపించదు. అదే ఆయన అధికారంలోకి వస్తే మాత్రం... ఒక్కసారిగా కంపెనీ దశ తిరిగిపోతుంది. ఇది చరిత్ర చెబుతున్న సత్యం. 1992లో కంపెనీ ఏర్పాటయ్యాక... పబ్లిక్ ఇష్యూకి రావటం, పన్ను ప్రయోజనాలు పొందటం... సహకార డెయిరీలు మూతపడితే వాటి స్థానాన్ని హెరిటేజ్ ఆక్రమించుకోవటం... ఇవన్నీ బాబు అధికారంతో ముడిపడి జరిగినవేనని చెప్పాలి. తాజాగా 2014లో ఆయన అధికారంలోకి వచ్చాక కూడా పలు పరిణామాలు చోటు చేసుకున్నాయి.
అక్టోబర్ 12నే నోట్ల రద్దు మాటలు...
కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు భాగస్వామి. ఆయనకు పెద్ద నోట్ల రద్దుకు సంబంధించి ముందే సమాచారం ఉందనటానికి మరికొన్ని దృష్టాంతాలూ ఉన్నాయి. అక్టోబర్ 12న విజయవాడలోని వెలగపూడి సచివాలయంలో విలేకరుల సమావేశం పెట్టారు కూడా. దాన్లో రూ.1,000, రూ.500 నోట్లను రద్దు చేస్తే తప్ప బ్లాక్ మనీని అరికట్టలేమని, అందుకే రద్దు చేయాలంటూ తాను ప్రధాని మోదీకి లేఖ రాశానని బహిరంగంగా చెప్పారు. ఏదో దేవుడు చెప్పినట్లుగా పెద్ద నోట్లకు సంబంధించి ఎవ్వరికీ రాని ఆలోచన చంద్రబాబుకే ఎలా వచ్చింది? దీన్నిబట్టే ఆయనకు ముందస్తు సమాచారం ఉందనేది ఖాయమన్న వాదనలు వెలువడ్డాయి. అప్పటి నుంచి తన సొంత వ్యవహారాలు చక్కబెట్టుకోవటంతో పాటు హెరిటేజ్ వ్యవహారాన్నీ చక్కబెట్టారన్న మాట. అందుకే నోట్ల రద్దు ప్రకటనకు ఒక్కరోజు ముందు తన రిటైల్ వ్యాపారాన్ని విక్రయిస్తూ డీల్ చేసుకున్నారు. తద్వారా షేర్ ధర పెరిగేలా చూసుకున్నారు. ఇదంతా ఇన్‌సైడర్ ట్రేడింగ్‌లాంటిదేనని మార్కెట్ నిపుణులు చెబుతున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
ఆది నుంచీ అధికారంతోనే ముడి...
ఆది నుంచీ చంద్రబాబు హెరిటేజ్ ఫుడ్స్‌ది అదే తీరు. 1992లో కంపెనీని ఏర్పాటు చేసిన ఆయన... 1994లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చీ రావటంతోనే పబ్లిక్ ఇష్యూకు వచ్చేశారు. ఈ ఇష్యూ ద్వారా రూ.10 కోట్లు సమీకరించటమే కాదు. అప్పటి నుంచీ తన కంపెనీకి ప్రత్యేక పన్ను రాయితీలివ్వటం, తనకు పోటీగా ఉన్న సహకార డెయిరీలను రకరకాల ఎత్తులతో దెబ్బ తీయటం చేస్తూ వచ్చారు. వాటి స్థానంలో హెరిటేజ్‌ను విస్తరించటం కూడా మరోపక్క చేస్తూ పోయారు. ఫలితం... 2000లో రూ.6 కోట్లుగా ఉన్న కంపెనీ లాభం 2004–05లో అధికారం పోయేనాటికి రూ.17 కోట్లకు చేరుకుంది. చిత్రమేంటంటే బాబుకు పవర్ పోవటంతో కంపెనీకీ పవర్ పోయినట్లయింది. 2005లో రూ.10 కోట్లకు పరిమితమైన లాభాలు... 2007లో ఏకంగా రూ.1.7 కోట్లకు పడిపోయాయి. అక్కడితో ఈ పరంపర ఆగలేదు. నష్టాలు మొదలయ్యాయి. 2009లో ఏకంగా రూ.35 కోట్ల నష్టాన్ని ప్రకటించింది కంపెనీ. 2012–13 వరకూ అంతంత మాత్రం ఫలితాలే వచ్చాయి. 2013లో కూడా లాభం పట్టుమని పదికోట్లు లేదు. 2013లో నాడు అధికారంలో ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వానికి చంద్రబాబు అండదండలందించినప్పటి నుంచీ మళ్లీ కంపెనీ దశ తిరిగింది. అప్పటి నుంచి లాభాలు మెల్లగా పెరగటం మొదలెట్టాయి. చివరికి 2014లో రూ.45 కోట్లుగా ఉన్న కంపెనీ నికర లాభం... ఇపుడు రూ.66 కోట్లకు చేరుకుంది.
షేర్ ధర పరుగులు; అందుకే విభజన!
నిజానికి డెయిరీ వ్యాపారాలన్నీ కొన్నేళ్లుగా లాభాలు పెంచుకుంటూ వస్తున్నాయి. వాటి షేర్ల ధరలూ పెరుగుతున్నాయి. కానీ లాభాలు, అమ్మకాలు సాధారణంగానే ఉన్నా... షేరు ధర మాత్రం అసాధారణంగా పెరిగింది ఒక్క హెరిటేజ్ విషయంలోనే. నష్టాలు అంతకంతకూ పెరిగిపోతున్నపుడు కూడా షేరు ధర పెరగటం గమనార్హం. మూడేళ్లలో 400 శాతానికి పైగా పెరిగి ఏకంగా రూ.1,235కు చేరిపోవటంతో దీన్ని విభజించటానికి కంపెనీ ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ఈ షేరు ముఖవిలువ రూ.10. దీన్ని అంతకన్నా తక్కువ విలువగల షేర్లుగా విభజించటానికి కంపెనీ బోర్డు వచ్చేనెల 10న సమావేశమవుతోంది.
ఉదాహరణకు రూ.10 విలువగల షేరును రూ.1 విలువగల 10 షేర్లుగా విభజించారనుకుందాం. అపుడు షేరు ధర (ప్రస్తుత విలువను బట్టి చూస్తే) రూ.123కు పడిపోతుంది. అంటే రూ.123 విలువగల 10 షేర్లుగా విడిపోతుందన్న మాట. దాంతో సాధారణ ప్రజలకు ఆ షేరు పెద్దగా పెరిగినట్లు అనిపించదు. షేరు ఇంతలా పెరిగిందని ఎవరి దృష్టీ పడకుండా ఉండేందుకే ఇలా చేస్తున్నారనే వాదనలు వినిపిస్తుండటం గమనార్హం.
రిటైల్ నష్టాలకు ‘ఇన్‌సైడర్’ చెక్!
బహుశా! దీన్ని కూడా ఒకరకంగా ఇన్‌సైడర్ ట్రేడింగ్ అనే చెప్పాలేమో!! ఎందుకంటే హెరిటేజ్ ఫుడ్స్‌కు నష్టాలు విపరీతంగా పెరగటానికి దాని రిటైల్ వ్యాపారం ఒక కారణం. దాంతో రిటైల్ వ్యాపారాన్ని వదిలించుకోవటానికి ప్రయత్నాలు మొదలెట్టింది. చివరికి ఆ వ్యాపారాన్ని కిషోర్ బియానీకి చెందిన ఫ్యూచర్ రిటైల్‌కు విక్రయించేసింది. నిజానికిలా చేయటం మంచిదే. కానీ ఆ చేసిన సమయమే అనుమానాలకు తావిచ్చింది. ఎందుకంటే ఈ డీల్‌కు ఇరుపక్షాలూ ఆమోద ముద్ర వేసింది పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధానమంత్రి ప్రకటన చేయటానికి కొన్ని గంటల ముందు!! అంటే నవంబర్ 8న. చిత్రమేంటంటే పెద్ద నోట్ల రద్దు ప్రకటన వెలువడ్డాక కొన్ని నెలలపాటు రిటైల్ సంస్థలన్నీ గందరగోళంలో పడిపోయాయి. జనం దగ్గర డబ్బుల్లేక, డిజిటల్ పేమెంట్లు చేయలేక అటువైపు వెళ్లటమే మానేశారు.
తరవాత మెల్లగా పరిస్థితి సద్దుమణిగింది. మరి నవంబర్ 8న గనక ఫ్యూచర్ రిటైల్ సంస్థ హెరిటేజ్ ఫుడ్స్ తాలూకు రిటైల్ వ్యాపారాన్ని కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించకపోతే ఏమై ఉండేది? ఒక్క మాటలో చెప్పాలంటే డీల్ జరిగేది కాదు. ఎందుకంటే రిటైల్ వ్యాపారం గందరగోళంలో పడ్డ ఆ పరిస్థితుల్లో ఎవరూ వేరొక రిటైల్ వ్యాపారాన్ని కొనాలని అనుకోరు. ఒకవేళ అలా అనుకున్నా ధర అప్పటి పరిస్థితులకు తగ్గట్టు ఉంటుంది. ఇవన్నీ తెలిసే... చంద్రబాబునాయుడు వ్యూహం ప్రకారం రిటైల్ వ్యాపారాన్ని ఒక రోజు ముందే విక్రయించేశారన్న సందేహాలు గతంలోనే వ్యక్తమయ్యాయి.