
ముంబై: టూ వీలర్ దిగ్గజం హీరో మోటొకార్ప్ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రూ.1,011 కోట్ల నికర లాభం సాధించింది. గత క్యూ2లో సాధించిన నికర లాభం రూ.1,004 కోట్లతో పోలిస్తే 0.6 శాతం వృద్ధి సాధించామని హీరో మోటొకార్ప్ తెలిపింది. అమ్మకాలు పెరగడం, నిర్వహణ పనితీరు మెరుగుపడటంతో నికర లాభం ఈ క్యూ2లో పెరిగిందని వివరించింది. పెట్టుబడి ప్రోత్సాహకాలను ఉపసంహరించడం, పరిశోధన, అభివృద్ధి వ్యయాల తగ్గింపుల్లో కోత కారణంగా నికర లాభం అంచనాల కంటే తగ్గిందని వివరించింది. అయితే అమ్మకాలు 11 శాతం పెరగడంతో ఆదాయం 7 శాతం వృద్ధితో రూ.8,362 కోట్లకు పెరిగిందని పేర్కొంది.
అమ్మకాల రికార్డ్: గత క్యూ2 వాహన అమ్మకాలతో పోల్చితే ఈ క్యూ2లో వాహన అమ్మకాలు 11 శాతం వృద్ధితో 20,22,805కు పెరిగాయని, కంపెనీ చరిత్రలోనే ఒక క్వార్టర్‌లో ఈ స్థాయి అమ్మకాలు సాధించడం రికార్డని హీరో మోటొకార్ప్ వివరించింది.
మిశ్రమంగా ఫలితాలు....
మార్కెట్ ముగిసిన తర్వాత హీరో మోటొకార్ప్ ఆర్థిక ఫలితాలు వెలువడ్డాయి. స్టాక్ సూచీలు భారీ లాభాల్లో ఉన్నా, ఫలితాలు ఎలా ఉంటాయోనన్న అంచనాలతో ఈ షేర్ గురువారం తీవ్రమైన ఒడిదుడుకులకు గురైంది. చివరకు 0.8 శాతం నష్టంతో రూ.3,823 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment