చౌక ట్యాబ్స్ హల్‌చల్
న్యూఢిల్లీ: చౌక ట్యాబ్లెట్ పీసీల హవాతో భారత్‌లో ట్యాబ్ అమ్మకాలు దూసుకెళ్తున్నాయి. 2013లో ఏకంగా 41.4 లక్షల ట్యాట్లెట్లు అమ్ముడయ్యాయని రీసెర్చ్ సంస్థ ఐడీసీ వెల్లడించింది. అంతక్రితం ఏడాది 26.6 లక్షల ట్యాబ్ విక్రయాలతో పోలిస్తే 56.4 శాతం ఎగబాకినట్లు తెలిపింది. 2013 అమ్మకాల్లో శామ్‌సంగ్ 18.7 శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో నిలిచింది. తర్వాత స్థానాల్లో మైక్రోమ్యాక్స్(8.9 శాతం వాటా), యాపిల్(7.5% వాటా) ఉన్నాయి.
గతేడాది అక్టోబర్-డిసెంబర్ కాలంలో 7.51 లక్షల ట్యాబ్లెట్లు అమ్ముడైనట్లు ఐడీసీ పేర్కొంది. కాగా, 2013 ప్రథమార్ధంలో ట్యాబ్స్ అమ్మకాల దూకుడుతో పోలిస్తే... ద్వితీయార్ధంలో తగ్గుముఖం పట్టినట్లు పేర్కొంది. ఈ ఏడాది అమ్మకాల వృద్ధి పెద్దగా ఉండకపోవచ్చనేది ఐడీసీ అంచనా. ప్రభుత్వం ట్యాబ్లెట్లకు సైతం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్) ధ్రువీకరణను తప్పనిసరి చేస్తుండటం, ఫాబ్లెట్ల(మొబైల్+ట్యాబ్లెట్ ఫీచర్స్) హల్‌చల్‌తో ట్యాబ్‌ల జోరుకు కొంత బ్రేకులు పడనున్నాయని ఐడీసీ రీసెర్చ్ మేనేజర్ కిరణ్ కుమార్ చెప్పారు. అయితే, ఆర్థిక సేవలు, మీడియా, హెల్త్‌కేర్, విద్య తదితర రంగాల్లో ట్యాబ్లెట్ వినియోగదారుల వృద్ధి బాగానే ఉంటుందని ఆయన పేర్కొన్నారు.