చుక్కలు చూపిస్తోన్న చాయ్‌ యాడ్‌.. | HindustanUnilever Faces Criticism Over Red Label Tea Ad | Sakshi
Sakshi News home page

హిందూస్థాన్ యూనీలివర్ ఉత్పత్తులను బ్యాన్‌ చేయండి..

Published Fri, Mar 8 2019 9:23 AM | Last Updated on Fri, Mar 8 2019 2:46 PM

HindustanUnilever Faces Criticism Over Red Label Tea Ad - Sakshi

న్యూఢిల్లీ : ఎంఎఫ్‌జీ దిగ్గజం హిందూస్థాన్‌ యూనీలివర్‌పై సోషల్‌ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ట్విటర్‌లో "#BoycottHindustanUnilever" అనే హాష్‌ ట్యాగ్‌ తెగ ట్రెండ్ అవుతోంది. సదరు కంపెనీ భారతీయుల మనోభావాలను ముఖ్యంగా హిందువులను, వారి సంప్రదాయలను కించపరుస్తోంది.. కాబట్టి ఆ కంపెనీ ఉత్పత్తులను బ్యాన్‌ చేయండంటూ సోషల్‌ మీడియా వేదికగా ప్రచారం జరుగుతుంది.

రెడ్‌ లేబుల్‌ టీ పౌడర్‌ ప్రమోషన్‌ కోసం రూపొందించిన యాడ్‌ ఈ వివాదానికి కారణం అయ్యింది. ఈ యాడ్‌లో ఓ వ్యక్తి తన ముసలి తండ్రిని వదిలించుకోవడం కోసం కుంభమేళాకు తీసుకువస్తాడు. జన సమూహంలో తన తండ్రిని వదిలేసి ముందుకు వెళ్తాడు. అంతలోనే ఓ తండ్రి తన కుమారుడు జన సమూహంలో తప్పిపోకుండా ఉండటానికి కొడుకు చేతిని తన చేతికి కట్టేసుకుంటాడు. అది చూసి ఆ యువకుడిలో మార్పు వస్తుంది. తండ్రిని వెతుక్కుంటు వెనక్కి వెళ్తాడు. తర్వాత ఇద్దరు కూర్చుని టీ తాగుతారు. ఈ యాడ్‌తో పాటు ‘వృద్ధులను వదిలించుకోవడం కోసం చాలా మంది కుంభమేళాను ఎన్నుకుంటారు. ‍కానీ మన పెద్దల పట్ల బాధ్యతగా వ్యవహరించకపోవడం నిజంగా విచారకరం. ఈ రోజు మనల్ని ఇలా తయారు చేసిన వారి చేతులను వదలకండి’ అంటూ ట్వీట్‌ చేసిన ఈ యాడ్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

‘మీరు కొత్త సంప్రదాయాలను తీసుకురాకండి. ఇది కుంభమేళాను, హిందువుల సంప్రదాయాలను అవమానించడమే’ అంటూ మండి పడుతున్నారు. ‘హిందుస్థాన్‌ యూనీలివర్‌ ఉత్పత్తులను నిషేధించండి’ అంటూ #BoycottHindustanUnilever" హాష్‌ట్యాగ్‌ను ట్రెండ్‌ చేస్తున్నారు. ఇలా విమర్శించిన వారిలో పతంజలి వ్యవస్థాపకుడు బాబా రాందేవ్‌ కూడా ఉన్నారు. ‘ఈస్ట్‌ ఇండియా కంపెనీ వారి నిజస్వరూపానికి నిదర్శనం ఈ యాడ్‌. మన దేశాన్ని ఆర్థికంగా, సిద్ధాంతపరంగా తక్కువ చేసి చూపించడమే వారి ప్రధాన అజెండా. వారి వరకూ ప్రతీది చివరకూ ఎమోషన్స్‌ను కూడా వస్తువుగానే పరిగణిస్తారు. ఇలాంటి కంపెనీ ఉత్పత్తులను మనం ఎందుకు నిషేధించకూడదం’టూ రాందేవ్‌ బాబా ట్వీట్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement