Ad film
-
జ్యువెల్లరీ యాడ్‌లో సితార.. రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు సినిమాలతో బిజీగా ఉంటే.. కూతురు సితార మాత్రం రికార్డులు సృష్టిస్తోంది. చిన్న వయసులో యాడ్ షూట్ లో పాల్గొన్న స్టార్ కిడ్ గా ఘనత సాధించింది. ఇప్పుడు రెమ్యునరేషన్ విషయంలోనూ ఎక్కడికో వెళ్లిపోయినట్లు కనిపిస్తుంది. చేసింది జ్యూవెల్లరీ యాడ్ అయితేనేం.. సితారకు పెద్ద మొత్తమే ఇచ్చారని మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఏంటి విషయం? (ఇదీ చదవండి: అభిమానుల్ని మోసం చేస్తున్న స్టార్ హీరోలు!) సూపర్‌స్టార్ మహేశ్.. ఏడాది లేదా ఏడాదిన్నరకు ఓ సినిమా చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తుంటాడు. కానీ యాడ్స్, ప్రమోషన్స్ రూపంలో మరోవైపు నుంచి గట్టిగానే సంపాదిస్తున్నాడు. పాన్ మసాలా దగ్గర నుంచి సోప్ వరకు ప్రతిదానిలోనూ యాక్ట్ చేస్తుంటాడు. కోట్లకు కోట్లు ఆర్జిస్తుంటాడు. మహేశ్ ఫ్యామిలీ అంతా కలిసి గతంలో ఓ యాడ్ లో కనిపించారు. ఆ తర్వాత కూతురు సితారకు పలు ఆఫర్స్ వచ్చాయట. కానీ ఎందుకో మహేశ్ వాటిని ఒప్పుకోలేదు. ఇప్పుడు మాత్రం జ్యూవెల్లరీ యాడ్ లో సితార నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కొన్నాళ్ల ముందు ఈ యాడ్ షూట్ జరగ్గా.. ఆ వీడియోని న్యూయార్క్ లోని టైమ్ స్క్వేర్ లో తాజాగా ప్రదర్శించారు. దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన మహేశ్.. కూతురు ఎదుగుదల చూసి తెగ ఆనందపడిపోయాడు. చాలా ఆఫర్లకు ఒప్పుకోని మహేశ్.. ఇలా ఈ యాడ్ కి ఎలా అంగీకరించాడా అని మీకు డౌట్ రావొచ్చు. అయితే ఇందులో సితార యాక్ట్ చేసినందుకు గానూ ఏకంగా రూ.కోటి ఇచ్చారట. బహుశా మహేశ్ కూడా తన తొలి యాడ్ కోసం కూడా ఇంత తీసుకుని ఉండడు. అందుకే సితార యాడ్ షూట్ కి ఒప్పుకున్నాడేమో? Lighting up the Times Square!! 💥💥💥 So so proud of you my fire cracker ♥️♥️♥️ Continue to dazzle and shine!! 😘😘😘 #SitaraGhattamaneni pic.twitter.com/3ALO0HGNMy — Mahesh Babu (@urstrulyMahesh) July 4, 2023 (ఇదీ చదవండి: ఓ పక్క పెళ్లి.. మరో పక్క విడాకులు.. మెగా ఫ్యామిలీకి ఎందుకిలా?) -
ఐపీఎల్లో తళ్లుక్కున మెరిసిన నీరజ్ చోప్రా.. ! ఎక్కడంటే..?
టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా బంగారు పతకం సాధించి చరిత్రపుటల్లో కొత్త అధ్యాయాన్ని లిఖించిన విషయం తెలిసిందే. సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో కూడా నీరజ్ దూసుకుపోయాడు. అదే స్థాయిలో నీరజ్‌చోప్రా సోషల్‌మీడియా వాల్యూయేషన్ ఏకంగా రూ. 428 కోట్లకు పెరిగిందని ప్రముఖ రీసెర్చ్ కన్సెల్టెన్సీ యూగోవ్ వెల్లడించింది. బంగారు పతకం సాధించిన ఒక్కరోజులోనే అతని సోషల్‌మీడియా అకౌంట్లకు గణనీయంగా ఫాలోవర్స్ పెరిగిపోయారు. పలు కంపెనీలు తమ కంపెనీలకు నీరజ్‌ను బ్రాండింగ్ చేయడం కోసం క్యూ కట్టాయి. చదవండి: ప్రముఖ క్రికెటర్లను దాటేసిన నీరజ్ చోప్రా..! తాజాగా నీరజ్‌చోప్రా ఐపీఎల్-14 యాడ్స్‌లో తళ్లుక్కున మెరిశాడు. 23 ఏళ్ల జావెలిన్ త్రోయర్ నీరజ్ ప్రముఖ ఇండియన్ ఫిన్‌టెక్ కంపెనీ క్రెడ్ రూపొందించిన యాడ్స్‌లో కన్పించాడు. ఈ యాడ్‌లో భాగంగా నీరజ్ చోప్రా.. రిపోర్టర్‌గా, మార్కెటింగ్ మెనేజర్, బ్యాంక్ ఉద్యోగి, స్పోర్ట్ పర్సన్, డైరక్టర్‌గా వివిధ పాత్రల్లో కన్పించాడు. ఐపీఎల్ 2021 ద్వితీయార్థంలో క్రెడ్ ‘గ్రేట్ ఫర్ ది గుడ్ క్యాంపెయిన్’ పేరిట ఈ యాడ్‌ను రూపొందించింది. క్రెడిట్ కార్డు బిల్లులను చెల్లించడం కోసం క్రెడ్ ఒక యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. కాగా ఈ యాడ్‌ను చూసిన నెటిజన్లు నీరజ్ చోప్రాపై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. నీరజ్ చోప్రా జావెలిన్ త్రోలోనే కాదు..యాక్టింగ్‌లో కూడా గోల్డ్ మెడల్ కొట్టేశావని నెటిజన్లు పేర్కొన్కారు. గతంలో ప్రముఖ బాలీవుడ్ స్టార్స్ అనిల్ కపూర్, మధూరి దిక్షిత్, గోవిందా, బప్పి లహరీ, ఉదిత్ నారాయణ, అల్కా యగ్నిక్తో కలిసి యాడ్స్‌ను క్రెడ్ రూపోందించింది. కొన్ని రోజుల క్రితం ఎప్పుడు కూల్‌గా ఉంటే భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్‌ను ‘ఇందిరానగర్ కా గుండా’ రూపంలో యాడ్‌ను రూపొందించింది. క్రెడ్ వ్యవస్థాపకుడు, సీఈవో కునాల్ షా మాట్లాడుతూ...ఐపీఎల్‌తో మా భాగస్వామ్యాన్ని కొనసాగించడం సంతోషంగా ఉందన్నారు. బాధ్యదాయుతమైనా ఆర్థిక ప్రవర్తను ప్రజల్లో తీసుకరావడానికి క్రెడ్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. చదవండి: నీరజ్ చోప్రా సోషల్‌మీడియా వాల్యుయేషన్ ఏకంగా రూ. 428 కోట్లు..! -
వైరల్ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా
-
‘లేవగానే నన్ను ఏడిపించింది’
ముంబై: ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎక్కువగా స్ఫూర్తిదాయక అంశాలను సోషల్ మీడియా వేదికగా నెటిజన్లతో పంచుకుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో వీడియోతో ఆనంద్ మహీంద్రా నెటిజనుల ముందుకు వచ్చారు. ‘ఈ రోజు ఉదయం లేవగానే మీరు నన్ను ఏడిపించారు. నాకు మనవరాలు లేదు.. కానీ ఈ వయసు మనవడు ఉన్నాడు’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన వీడియో నెటిజనులను కూడా కదిలిస్తోంది. ఇంతకు ఆ వీడియోలో ఏం ఉంది అనుకుంటున్నారా.. అయితే చదవండి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా క్రిస్టమస్ సందడి నెలకొంది. ఈ నేపథ్యంలో షూట్ చేసిన యాడ్‌కు సంబంధించిన వీడియోని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. (చదవండి: 'ఆనందం' ఎక్కడ దొరుకుతుంది? ఇదిగో..) ఇక ఈ వీడియో ప్రారంభం కాగానే ఓ తాత కనిపిస్తాడు. ఉదయం లేచి స్టోర్ రూమ్‌లోకి వెళ్లి ఓ ఇనుప బంతిని తీసుకొస్తాడు. దాన్ని తన రూమ్‌లోకి తీసుకువచ్చి.. ఓ ఫోటో ఎదురుగా నిల్చుని ఎత్తేందుకు ప్రయత్నం చేస్తాడు. కానీ బరువు మోయలేక వెంటనే ఎత్తేస్తాడు. ఇరుగు పొరుగు వారితో పాటు ప్రేక్షకులకు కూడా ఈయన ఈ ఏజ్‌లో ఎందుకు వ్యాయామం చేస్తున్నాడా అనే అనుమానం మొదలువుతుంది. ఇదిలా ఉండగా ఆ వృద్ధుడు మరుసటి రోజు ఉదయం ఆరుబయట ఓ చిన్న కుర్చిపై ఫోటో పెట్టుకుని బరువు ఎత్తడం ప్రాక్టీస్ చేస్తాడు. ఈ సారి విజయం సాధిస్తాడు. ఇలా కొన్ని రోజులు పాటు ఆయన సాధన కొనసాగిస్తాడు. ఆ తర్వాత క్రిస్టమస్ నాడు రెడీ అయ్యి గిఫ్ట్ బాక్స్ తీసుకుని కుమార్తె ఇంటికి వెళ్తాడు. ఇంతలో మనవరాలు వస్తుంది. తన చేతిలోని గిఫ్ట్ బాక్స్‌ని ఆమెకి ఇస్తాడు. చిన్నారి ఆ బాక్స్ ఒపెన్ చేసి చూడగా అందులో స్టార్ ఉంటుంది. (చదవండి: ‘ఈ వెయ్యి కోట్ల ప్రశ్నకు సమాధానం తెలుసా?’) ఇక వృద్ధుడు మనవరాలిని ఎత్తుకోగా ఆమె స్టార్‌ని తీసుకెళ్లి క్రిస్టమస్ ట్రీలో అంలకరిస్తుంది. కుమార్తె తండ్రిని చూసి ఆనందంతో కంటతడి పెడుతుంది. ఇక చివరగా వృద్ధుడు మొదట్లో చూపించే ఫోటోని రివీల్ చేస్తారు. దానిలో అతడి మనవరాలు ఉంటుంది. రెండు నిమిషాల నిడివి గల ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఇక ఆనంద్ మహీంద్రా దీన్ని షేర్ చేసిన గంటల వ్యవధిలోనే దాదాపు 20 వేల మందికిపైగా దీన్ని వీక్షించారు. ఇక ఈ వీడియో చూసిన నెటిజనులు ‘మమ్మల్ని కూడా కదిలించింది.. మేం కూడా ఏడిచాం.. ఇంత మంచి వీడియో షేర్ చేసినందుకు ధన్యవాదాలు’ అంటూ ప్రశంసిస్తున్నారు. -
చుక్కలు చూపిస్తోన్న చాయ్ యాడ్..
-
చుక్కలు చూపిస్తోన్న చాయ్ యాడ్..
న్యూఢిల్లీ : ఎంఎఫ్‌జీ దిగ్గజం హిందూస్థాన్ యూనీలివర్‌పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ట్విటర్లో "#BoycottHindustanUnilever" అనే హాష్ ట్యాగ్ తెగ ట్రెండ్ అవుతోంది. సదరు కంపెనీ భారతీయుల మనోభావాలను ముఖ్యంగా హిందువులను, వారి సంప్రదాయలను కించపరుస్తోంది.. కాబట్టి ఆ కంపెనీ ఉత్పత్తులను బ్యాన్ చేయండంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతుంది. రెడ్ లేబుల్ టీ పౌడర్ ప్రమోషన్ కోసం రూపొందించిన యాడ్ ఈ వివాదానికి కారణం అయ్యింది. ఈ యాడ్‌లో ఓ వ్యక్తి తన ముసలి తండ్రిని వదిలించుకోవడం కోసం కుంభమేళాకు తీసుకువస్తాడు. జన సమూహంలో తన తండ్రిని వదిలేసి ముందుకు వెళ్తాడు. అంతలోనే ఓ తండ్రి తన కుమారుడు జన సమూహంలో తప్పిపోకుండా ఉండటానికి కొడుకు చేతిని తన చేతికి కట్టేసుకుంటాడు. అది చూసి ఆ యువకుడిలో మార్పు వస్తుంది. తండ్రిని వెతుక్కుంటు వెనక్కి వెళ్తాడు. తర్వాత ఇద్దరు కూర్చుని టీ తాగుతారు. ఈ యాడ్‌తో పాటు ‘వృద్ధులను వదిలించుకోవడం కోసం చాలా మంది కుంభమేళాను ఎన్నుకుంటారు. కానీ మన పెద్దల పట్ల బాధ్యతగా వ్యవహరించకపోవడం నిజంగా విచారకరం. ఈ రోజు మనల్ని ఇలా తయారు చేసిన వారి చేతులను వదలకండి’ అంటూ ట్వీట్ చేసిన ఈ యాడ్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘మీరు కొత్త సంప్రదాయాలను తీసుకురాకండి. ఇది కుంభమేళాను, హిందువుల సంప్రదాయాలను అవమానించడమే’ అంటూ మండి పడుతున్నారు. ‘హిందుస్థాన్ యూనీలివర్ ఉత్పత్తులను నిషేధించండి’ అంటూ #BoycottHindustanUnilever" హాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. ఇలా విమర్శించిన వారిలో పతంజలి వ్యవస్థాపకుడు బాబా రాందేవ్ కూడా ఉన్నారు. ‘ఈస్ట్ ఇండియా కంపెనీ వారి నిజస్వరూపానికి నిదర్శనం ఈ యాడ్. మన దేశాన్ని ఆర్థికంగా, సిద్ధాంతపరంగా తక్కువ చేసి చూపించడమే వారి ప్రధాన అజెండా. వారి వరకూ ప్రతీది చివరకూ ఎమోషన్స్‌ను కూడా వస్తువుగానే పరిగణిస్తారు. ఇలాంటి కంపెనీ ఉత్పత్తులను మనం ఎందుకు నిషేధించకూడదం’టూ రాందేవ్ బాబా ట్వీట్ చేశారు. From East India Co to @HUL_News that’s their true character. Their only agenda is to make the country poor economically & ideologically. Why shld we not boycott them? For them everything, every emotion is just a commodity. For us parents are next to Gods #BoycottHindustanUnilever https://t.co/suozbymLBI — Swami Ramdev (@yogrishiramdev) March 7, 2019 -
హమార యాడ్గురు
1980ల టైమ్.. కొడైకెనాల్ ప్రాంతం.. చలికాలం.. నాలుగు డిగ్రీల టెంపరేచర్.. ఒక జలపాతం దగ్గర.. పదిహేడు, పద్దెనిమిదేళ్లున్న ఒక అమ్మాయిని పైనుంచి దూకుతున్న నీటి కింద మడుగులోకి తోస్తున్నారు.. గడ్డకట్టుకుపోతున్నట్టున్న ఆ నీటిలో ఊపిరి పీల్చుకుంటూ తల పైకి పెడుతోంది.. మళ్లీ ఆమెను బయటకు లాగుతున్నారు.. వెచ్చటి టవల్ కప్పి తుడుస్తున్నారు.. శరీరం వేడిగా ఉండటానికి రమ్ తాగిస్తున్నారు.. కాస్త వెచ్చబడ్డాక మళ్లీ తోస్తున్నారు. ఫైనల్ అవుట్‌పుట్.. ఎనభైల యువతను ఉర్రూతలూపిన లిరిల్ గర్ల్ యాడ్ ప్లే అయింది. పదిహేడు, పద్దెనిమిదేళ్ల ఆ అమ్మాయి కారెన్ లూనెల్ చాలామందికి ఆరాధ్య దేవత అయింది. కొన్నేళ్లకు కనిపించకుండా పోయింది. చనిపోయిందనే పుకారూ లేచింది. కాని.. కారెన్ లూనెల్ బతికే ఉంది. పెళ్లి చేసుకుని, ఆస్ట్రేలియాలో పిల్లాపాపలతో సంతోషంగా ఉంది. వీలున్నప్పుడల్లా ఆ యాడ్ డైరెక్టర్‌కి ఉత్తరాలు రాసింది. తర్వాత మెయిల్స్ కూడా చేసింది. ఆ డైరెక్టర్ కూడా ప్రతి క్రిస్మస్కు ఆమెను గ్రీట్ చేస్తూ మెస్సేజ్ పంపుతాడు. ‘‘ఆ యాడ్ షూటింగ్లో కారెన్తో ప్రేమలో పడ్డా.. ఇప్పటికీ నా మనసులో ఉంది’’ అంటాడు ఆ యాడ్ డైరెక్టర్. హిందుస్తాన్ లీవర్ మార్కెటింగ్ సెక్షన్‌తో లింటాస్ యాడ్ ఏజెన్సీ వాళ్ల మీటింగ్ జరుగుతోంది. సర్ఫ్ యాడ్ ఫిల్మ్ చూసి పెదవి విరిచాడు మార్కెటింగ్ హెడ్. ‘‘ఇలా జనాల్లోకి వెళితే సర్ఫ్ అమ్ముకున్నట్టే’’ వెటకారం అతని నోటి వెంట. అసహనం డైరెక్టర్లో. ఒకవేళ ఇది వర్కవుట్ కాకపోతే.. దీని మీద పెట్టిన ఖర్చు లింటాస్ భరిస్తుందా? ఆందోళన ఆయన మనసులో. ఇటూ అటూ వాదోపవాదాలు, తర్జనభర్జనల తర్వాత అతి కష్టమ్మీద ఒక షరతుతో అంగీకారానికి వచ్చింది. ముందు యాడ్ రిలీజ్ చేశాక రెస్పాన్స్‌ను బట్టి కంటిన్యూ కావాలా వద్దా అని. రిలీజ్ అయింది. (‘గాంధీ’ చిత్రంలో మహమ్మద్ అలీ జిన్నా పాత్రలో అలేక్ పదమ్సీ (కుడి చివర)) ‘‘దేఖో భాయీ సాబ్.. సస్తే చీజ్ ఖరీద్నేమే అచ్ఛే చీజ్ ఖరీద్నేమే ఫర్ఖ్ హోతా హై.. సర్ఫ్ కే ఖరీదారీ మే హీ సమర్nుదారీ హై’’ (‘తెలివైనవారు సర్ఫ్ కొంటారు’ అని సంక్షిప్తార్థం) అంటూ లలితాజీ.. చెప్పిన మాటలు సామాన్య గృహిణుల మెదడులో నాటుకుపోయాయి. ఏ యాడ్కూ రానంత రేటింగ్ వచ్చింది. లలితాజీ లాగా వాళ్లూ సమర్nుదారీ అని నిరూపించుకోవడానికి సర్ఫ్‌ను ఎంచుకున్నారు. ‘‘దేఖో భాయీ సాబ్’’ అని లలితాజీ పిలిచిన పిలుపు చాలా సినిమాల్లో ప్యారడీగా మారింది. ఇప్పటికీ ఎక్కడో అక్కడ స్పూఫ్లూ వినపడుతున్నాయ్.. కనపడుతున్నాయ్. దీని సృష్టికర్తా లిరిల్ యాడ్‌ఫిల్మ్ మేకరే. 1980ల ప్రాంతమే. ఓ గవర్నమెంట్ గుమస్తా.. సైకిల్ నుంచి మోటార్ సైకిల్‌కు మారాలనుకుంటున్నాడు. ఇంట్లో పిల్లలంతా ‘బజాజ్ చేతక్’కే ఓటేశారు. ఇంకో ఇంట్లో.. బజాజ్ బండి కొనమని భర్తతో పోరుపెడుతోంది భార్య. మరో చోట.. ఓ ప్రేమికుడు ప్రియురాలికి ప్రామిస్చేస్తున్నాడు.. ‘‘రేపు మా నాన్న బజాజ్ చేతక్ తీసుకొని వస్తాను.. సినిమాకెళదాం’’ అంటూ! వీళ్లందరూ బజాజ్‌ను హమారా అనుకోవడానికి కారణం.. దూరదర్శన్‌లో ప్రసారమయ్యే ‘‘యే.. జమీ...యే ఆస్మా.. హమారా కల్.. హమారా ఆజ్.. బులంద్ భారత్‌కి బులంద్ తస్వీర్.. హమారా బజాజ్..’’ యాడ్! కామన్ మ్యాన్ కారుగా.. కట్నం కింద వరుడి డిమాండ్‌గా స్కూటర్ మారింది ఈ అడ్వర్టయిజ్మెంట్తోనే. దీన్ని మలిచిందీ లిరిల్యాడ్ డైరెక్టరే. అతని పేరు అలేక్ పదమ్సీ. ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియన్ అడ్వర్టయిజింగ్ అని పేరు. బాంబే అడ్వర్టయిజింగ్ క్లబ్ ‘అడ్వర్టయిజింగ్ మ్యాన్ ఆఫ్ ది సెంచురీ’ అనే బిరుదు ఇచ్చింది. యాడ్ ఇండస్ట్రీలో వాళ్లు.. ఔత్సాహికులు ప్రేమగా ‘యాడ్ గురూ’అని పిలుచుకుంటారు. తొంభై ఏళ్ల ఆ లెజెండ్ శనివారం అంటే పదిహేడో తారీఖున ఈ లోకం నుంచి సెలవు తీసుకున్నాడు. సంస్మరణగా అలెక్ పదమ్సీ గురించి కొన్ని విషయాలు. 1928లో జననం. బాంబే. ధనిక కుటుంబం. తండ్రి జఫర్భాయ్ పదమ్సీ, వ్యాపారస్తుడు. తల్లి కుల్సుమ్బాయి పదమ్సీ కూడా బిజినెస్ చూసుకునేవారు. నలుగురు ఆడపిల్లల తర్వాత పుట్టిన మగపిల్లాడు అలేక్. కాబట్టి చాలా గారంగా పెరిగాడు. అతను ఏదడిగినా కాదనే వారు కాదు తల్లిదండ్రులు. అందుకే తను స్పాయిల్డ్ చైల్డ్ అని చెప్పుకుంటాడు అలేక్. అతని అసలు పేరు రోషన్. ముద్దు పేరు అలేక్. చిన్నప్పుడు ముంబైలోనే మర్ఫీ అనే ఐరిష్లేడీ స్థాపించిన బోర్డింగ్ స్కూల్లో చదివాడు. మర్ఫీకి భారతీయ పేర్లు పలకడం రాక హరిని హ్యారీ అని, శ్యామ్‌ను సామ్ అని రిజిస్టర్లో నమోదు చేసుకునేదట. ఆ విషయం తెలిసిన అలేక్ వాళ్ల అమ్మ కుల్సుమ్.. ముద్దు పేరుతోనే అలేక్ను స్కూల్లో జాయిన్ చేసింది. దాంతో అలేక్గానే ప్రపంచానికి పరిచయమ్యాడు రోషన్. ఇంగ్లండ్‌లోని వరల్డ్ అకాడమీ ఆఫ్ డ్రమాటిక్ ఆర్ట్స్‌లో పట్టా తీసుకున్నాడు. చిన్నప్పటి నుంచీ షేక్స్పియర్ అంటే వల్లమాలిన ప్రేమ. అందుకే ఇంగ్లండ్ నుంచి రాగానే థియేటర్ ప్రాక్టీస్ స్టార్ట్ చేశాడు. అప్పుడే పర్ల్ అనే థియేటర్ ఆర్టిస్ట్‌ను కలిశాడు. ఆమె ఇద్దరు పిల్లలున్న డైవోర్సీ. ప్రేమలో పడ్డాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటే ఇంటిని, తన వాటా ఆస్తినీ వదులుకోవాలని చెప్తుంది తల్లి. సరేనని బయటకు వెళ్లిపోయి స్నేహితుడి సహాయంతో లింటాస్ అనే యాడ్ కంపెనీలో చేరుతాడు. నెలకు మూడువందల రూపాయల జీతంతో. ఒకవైపు యాడ్స్.. ఇంకో వైపు థియేటర్. జిన్నా.. జీసస్.. ఎవీటా... పదేపదే ప్రేమలో పడడం అలెక్ పదమ్సీ బలహీనత.. బలం కూడా. అమ్మాయిలతోనైనా.. పనితోనైనా! జీవితంలో పర్ల్ తర్వాత, డాలీ.. తర్వాత షరాన్ ప్రభాకర్. ముగ్గురు సొంతపిల్లలు.. చాలామంది సవతి పిల్లలు. కెరీర్లో.. హమారా బజాజ్, లిరిల్, సర్ఫ్, చార్లీ బ్లాసమ్ (షూపాలిష్) లాంటి యాడ్స్. థియేటర్లో జీసస్‌క్రైస్ట్ సూపర్‌స్టార్, ఎవీటా! సంగీతంతోనే ప్రపంచం అనుకున్నచోట రాక్ మ్యూజిక్‌ను మిక్స్ చేసి జీసస్క్రైస్ట్ను సూపర్‌హిట్ చేశాడు. రాజకీయాలే సర్వస్వం అనుకున్నచోట పాలిటిక్స్‌ను కలిపి ఎవీటాను ప్లే చేశాడు. ఇది ఇందిరాగాంధీ మీద సాగిన నాటకం. ఏకంగా అయిదేళ్లు నిరవధిక ప్రదర్శనలు సాగాయి. ‘‘అయినా ఇందిరాగాంధీ నుంచి ఒక్క ప్రశంస.. ఒక్క పొలైట్ లెటర్‌ను కూడా అందుకోలేదు’’ నిట్టూర్చాడు. ఒక కాక్టైల్ పార్టీలో ఇంగ్లిష్ యాక్టర్, ఫిల్మ్‌మేకర్ రిచర్డ్ అటెన్‌బరో కంట్లోపడ్డాడు అలేక్. ఫస్ట్‌లుక్‌లోనే తను తీయబోయే గాంధీ బయోగ్రఫీ మూవీలో జిన్నాగా అలేక్ను ముద్ర వేసేసుకున్నాడు. రోల్ ఇచ్చాడు కూడా. చాలామందికి అలేక్.. జిన్నా వేషగాడిగానే తెలుసు. తనను బాగా ప్రభావితం చేసిన మనుషులు ఇద్దరే.. ఓషో, అమెరికన్ మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ అని చెప్తాడు. యాడ్ ఫీల్డ్‌లో చాలామంది ఆయనను గాడ్‌ఫాదర్‌గా భావిస్తారు. ‘‘వాళ్ల అభిమానం.. నేను ఎవరికీ గాడ్‌ఫాదర్‌ను కాను. కనీసం నా పిల్లలకు గుడ్ ఫాదర్‌ని కూడా కాదు. వాళ్లతో గడపాల్సినంత సమయం గడపలేదు. ఈ నిజాన్ని లేట్‌గా గ్రహించా. రిపెంట్ అవుతున్నా. అలాగని ఎమోషనల్ కాదనుకునేరు. వాళ్ల దగ్గరున్నంత సేపు ఎమోషనల్‌గానే ఉండేవాడిని. సెల్ఫ్ సెంట్రిక్ని. నా థర్డ్ వైఫ్ షరాన్ ప్రభాకర్‌కు చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే తనే నా ఇద్దరి మాజీ భార్యలను, పిల్లలను అందరినీ కలిపి.. పార్టీలు అరెంజ్ చేస్తుంటుంది. ఆమె వల్లే అందరినీ కలిసి.. కావల్సినంత టైమ్ కేటాయించగలిగాను. గడపగలుగుతున్నాను. దురదృష్టమేమంటే ప్రాణంలా ప్రేమించిన పర్ల్ ఇప్పుడు ఈ లోకంలో లేదు. ఎక్కడున్నా.. షీ ఈజ్ మై లవ్’’ అని చెప్పాడు అలేక్ పదమ్సీ ఒక ఇంటర్వ్యూలో. ఆరెంజ్ అనే తెలుగు సినిమా, దిల్‌తో బచ్చా హైజీ అనే హిందీ సినిమాలో నటించిన షాజన్ పదమ్సీ ఆయన కూతురే. షరాన్ ప్రభాకర్‌తో పుట్టిన కూతురు. - సరస్వతి రమ -
‘ఈ దివాళి వారి జీవితాల్లోనూ వెలుగులు నింపాలి’
మాల్స్ వచ్చిన దగ్గర నుంచి వీధి చివర దుకాణాలకు.. రోడ్ల వెంబడి వ్యాపారాలు చేసుకునే చిరు వ్యాపారస్తులకు తీవ్ర నష్టం వాటిల్లిందనే చెప్పవచ్చు. విదేశీ సంస్కృతి మీద మోజుతో స్వదేశీయులకు తీవ్ర నష్టం కల్గిస్తున్నాము. మాల్స్‌లో వేలకు వేలు ఖర్చు చేసే జనాలు.. చిరు వ్యాపారస్తుల దగ్గర కొనేటప్పుడు మాత్రం గీసిగీసి బెరమాడతారు. రెక్కాడితే గాని డొక్కాడని బడుగు జీవులకిచ్చే పది, ఇరవై రూపాయల దగ్గర వంద సార్లు ఆలోచిస్తుంటాం. ఈ సంస్కృతి మారి.. చిరువ్యాపారులకు సాయం చేసినప్పుడే.. వారి వ్యాపారాలు కలకలలాడినప్పుడే నిజమైన దీపావళి అనే ఉద్దేశంతో చేసిన ఓ యాడ్ ఇప్పుడు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ప్రముఖ కంప్యూటర్లు, ప్రింటర్ల మేకింగ్ కంపెనీ హెచ్‌పీ ఇండియా ‘వీధి వ్యాపారస్తులకు మద్దతు తెలపండి.. మన ఇళ్లలోని దీపాలు వారి ఇళ్లలో కూడా కాంతులు నింపుతాయి’ అనే ఉద్దేశంతో ఓ యాడ్‌ను రూపొందించింది. తొమ్మిదేళ్ల బాలుడు వీధుల్లో ప్రమిదలు అమ్ముకునే ఓ మహిళ ముఖంలో దివాళి ఆనందం ఎలా తీసుకు వచ్చాడనే ఇతివృత్తంతో రూపొందించిన ఈ వీడియోను హెచ్‌పీ ఇండియా తన ట్విట్టర్ అకౌంట్లో 'ఉమ్మీద్ కా దియా' పేరిట పోస్ట్ చేసింది. ఇలా షేర్ చేసిన కొన్ని గంటల్లోనే ఈ వీడయోను దాదాపు 2.3 మిలియన్ల మంది చూశారు. -
దర్శకుడిగా మారిన యంగ్ హీరో
హీరోగా, నిర్మాతగా కొనసాగుతున్న యంగ్ హీరో మంచు విష్ణు, దర్శకుడిగానూ తన టాలెంట్ నిరూపించుకునేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే దర్శకుడిగా తన తొలి ప్రాజెక్ట్‌ను మొదలు పెట్టాడు విష్ణు. ఈ ప్రాజెక్ట్‌లో విష్ణు తండ్రి, విలక్షణ నటుడు మోహన్‌బాబు నటిస్తున్నారు. అయితే విష్ణు దర్శకత్వం వహించింది సినిమాకు కాదు. ఓ ప్రభుత్వ ప్రకటన కోసం దర్శకుడిగా మారాడు మంచు విష్ణు. నీటి వనరుల ఆవశ్యకత వాటిన సంరక్షించుకోవాల్సిన అవసరాన్ని తెలిపే విధంగా ఈ ప్రకటనను తీర్చి దిద్దుతున్నారు. ఇప్పటికే రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ పనులు పూర్తి చేశారు. మరో వారంలో రోజుల్లో ఈ యాడ్ విడుదల కానుంది. పూర్తిగా రెడీ అయిన తరువాత యాడ్‌ను జలవనరుల మంత్రిత్వ శాఖకు అంధించనున్నారు. మంచు విష్ణు హీరోగా తెరకెక్కిన ఆచారి అమెరికా యాత్ర సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగా.. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఓటర్ ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. -
ది కూల్ మామ్ శ్రీదేవి చివరి యాడ్ ఇదే?
‘ఇంగ్లిష్ వింగ్లిష్’ తర్వాత శ్రీదేవి నటించిన ‘మామ్’ కూడా సూపర్ హిట్ అయిన విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. విశేషం ఏంటంటే.. శ్రీదేవి ఫుల్ లెంగ్త్ రోల్ చేసిన లాస్ట్ మూవీ ‘మామ్’ అయితే.. చివరి యాడ్ కూడా ‘మామ్’ పేరుతోనే ఉంది. సోషల్ మీడియాలో హల్చల్ చేసిన దానిని బట్టి, శ్రీదేవి నటించిన లాస్ట్ యాడ్ ‘ది కూల్ మామ్’. 2 నిమిషాల 30 సెకన్లు నిడివిగల ఈ యాడ్‌లోని కొంత భాగం ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. ఇది చిన్నారులను ఉత్తేజపరిచే యాడ్. ఓ ఫుడ్‌కి సంబంధించిన ఈ యాడ్‌లో ‘‘ఇల్లైనా, స్కూలైనా ఓపెన్‌గా ఉండండి. ఎమోషనల్ డ్రామాను నేను యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే మీ అమ్మ మీకు స్నేహితురాలు అండ్ సూపర్ కూల్’’ అంటూ శ్రీదేవి సందడి చేశారు. ఇందులో జగదేక సుందరి మామ్‌గా చాలా అందంగా కనిపించారు. మొత్తం నాలుగు గెటప్స్‌లో కనిపించి, ఆకట్టుకున్నారు. ఈ యాడ్‌లో శ్రీదేవి హావభావాలు సూపర్‌గా ఉన్నాయి. అతిలోక సుందరి ఆకస్మిక మరణం పొంది ఉండకపోతే ఇలాంటి మరెన్నో యాడ్స్‌లోనూ, సినిమాల్లోనూ చూసి ఉండేవాళ్లం. అన్నట్లు.. ఇది చివరి యాడ్ అని సర్క్యులేట్ చేశారు. అది ఎంతవరకు నిజం అన్నది తెలియాల్సి ఉంది. ఆ సంగతలా ఉంచితే.. నిజజీవితంలో శ్రీదేవి కూల్ మామ్. ఈ యాడ్లోనూ అలానే కనిపించారు. కచ్చితంగా జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ ఓ మంచి మామ్‌ని మిస్సయ్యారు. అండ్.. మనం కూడా మంచి నటిని మిస్సయ్యాం. -
యాడ్ కోసం పవన్ వాయిస్ ఓవర్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓ యాడ్ ఫిల్మ్‌కు వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారు. మానవ జాతిని పట్టి పీడిస్తున్న క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కల్పిస్తూ రూపొందుతున్న ఓ యాడ్‌కి వాయిస్ ఇచ్చేందుకు పవన్ అంగీకరించారని తెలుస్తోంది. త్వరలో ఈ యాడ్ కు సంబంధించిన షూటింగ్ ప్రారంభం అవుతుందట. ప్రజల్లో మార్పు వస్తుందనే చిన్న ఆశతోనే పవన్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ముందు జాగ్రత్త చర్యలు, కొన్ని చెడు అలవాట్లను మానుకోవడం వంటి అంశాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించే విధంగా ఈ యాడ్‌ను రూపొందిస్తున్నారు. త్వరలోనే ఈ యాడ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని అన్ని థియేటర్లలో ప్రదర్శిస్తారు. ఇక పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రం శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటోంది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియోను మార్చిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సినిమా వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.