లఫార్జ్-హోల్సిమ్ విలీనానికి బ్రేక్! | Holcim Board Rejects Lafarge Merger Terms | Sakshi
Sakshi News home page

లఫార్జ్-హోల్సిమ్ విలీనానికి బ్రేక్!

Published Tue, Mar 17 2015 2:28 AM | Last Updated on Sat, Sep 2 2017 10:56 PM

లఫార్జ్-హోల్సిమ్ విలీనానికి బ్రేక్!

లఫార్జ్-హోల్సిమ్ విలీనానికి బ్రేక్!

డీల్‌ను తిరస్కరించిన హోల్సిమ్ బోర్డు
జెనీవా: ప్రపంచ సిమెంట్ దిగ్గజాలైన హోల్సిమ్, లఫార్జ్‌ల మధ్య కుదిరిన మెగా విలీనానికి బ్రేకులు పడ్డాయి. 40 బిలియన్ డాలర్ల ఈ ప్రతిపాదిత డీల్‌ను ఇప్పుడున్న ప్రకారం ఒప్పుకోబోమని స్విట్జర్లాండ్ సంస్థ హోల్సిమ్ డెరైక్టర్ల బోర్డు తిరస్కరించింది. అంతేకాకుండా విలీనం తర్వాత పాలనాపరమైన అంశాలపైనా అభ్యంతరాలను వ్యక్తం చేసింది.

ఇరు కంపెనీలకూ భారత్‌లో గణనీయమైన స్థాయిలోనే సిమెంట్ కార్యకలాపాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ విలీన డీల్‌కు భారత్ కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) నుంచి ఇంకా ఆమోదం లభించాల్సి ఉంది కూడా. ఫ్రాన్స్ దిగ్గజం లఫార్జ్, హోల్సిమ్‌లు తమ విలీన ప్రణాళికలను 2014 ఏప్రిల్‌లో ప్రకటించాయి. ఈ విలీనంతో 90 దేశాల్లో కార్యకలాపాలతో పాటు 40 బిలియన్ డాలర్ల అమ్మకాలు గల సంస్థ ఆవిర్భవించనుంది. అంతేకాదు.. ప్రపంచంలోనే అతిపెద్ద సిమెంట్ గ్రూప్‌గా కూడా అవతరించనుంది. పాలనా పరమైన అంశాలతో పాటు షేర్ల ఎక్స్ఛేంజ్ రేషియో విషయంలో కూడా మరింతగా సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉందని హోల్సిమ్ డెరైక్టర్ల బోర్డు పేర్కొంది.

ఈ నేపథ్యంలో ప్రస్తుత కాంబినేషన్ ఒప్పందాన్ని ఇక పరిగణనలోకి తీసుకోబోమని సమావేశంలో నిర్ణయించినట్లు హోల్సిమ్ ఒక ప్రకటనలో తెలిపింది. గతేడాది జూలైలో ఇరు కంపెనీల డెరైక్టర్ల బోర్డులు విలీనానికి సంబంధించి ఈ కాంబినేషన్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. కాగా, ఈ విలీనాన్ని సాకారం చేసేందుకు తాము ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని... ప్రస్తుత మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగానే ఏవైనా సవరణలకు ఆస్కారం ఉంటుందని లఫార్జ్ కూడా మరో ప్రకటనలో స్పష్టం చేసింది. అంతేకానీ ఇప్పుడున్న ఒప్పందాల్లో ఇతరత్రా ఎలాంటి మార్పులను అంగీకరించబోమని తేల్చిచెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement